కామారెడ్డి జిల్లాలో మంకీపాక్స్ అనుమానిత కేసు

కామారెడ్డి జిల్లాలో మంకీపాక్స్ అనుమానిత కేసు
  • 4 రోజులుగా జ్వరం, శరీరంపై దద్దుర్లు
  • అనుమానంతో టెస్టుల కోసం హైదరాబాద్‌‌కు పంపిన ఆఫీసర్లు
  • ఇటీవల కువైట్ నుంచి వచ్చిన బాధితుడు

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తి (35)లో మంకీపాక్స్ లక్షణాలు కలకలం రేపాయి. జిల్లా కేంద్రానికి చెందిన అతడు ఈనెల 6న కువైట్ నుంచి దేశానికి వచ్చాడు. 4 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. శరీరంపై దద్దుర్లు కూడా రావటంతో ట్రీట్‌‌మెంట్ కోసం ఆదివారం ఓ ప్రైవేట్ హస్పిటల్‌‌కు వెళ్లాడు. అక్కడ పరిశీలించిన డాక్టర్.. అనుమానంతో జిల్లా హస్పిటల్‌‌కు పంపారు.

జిల్లా హస్పిటల్‌‌లో చెక్ చేసిన డాక్టర్లు.. దద్దుర్లు ఉండటంతో విషయాన్ని హైదరాబాద్‌‌లోని ఉన్నతాధికారులను తెలియజేశారు. మంకీపాక్స్ లక్షణాలుగా అనుమనించి హైదరాబాద్‌‌కు వెళ్లాలని అతడికి సూచించారు. కానీ ఆ వ్యక్తి హైదరాబాద్‌‌కు వెళ్లకుండా ఇంటికి పోయాడు. దీంతో అలర్ట్ అయిన హెల్త్ డిపార్ట్‌‌మెంట్ ఆఫీసర్లు కలెక్టర్‌‌‌‌కు సమాచారం ఇచ్చారు.

పోలీసుల సాయంతో హెల్త్ స్టాఫ్‌‌ ఆ వ్యక్తి ఇంటికి వెళ్లి 108లో హైదరాబాద్‌‌లోని ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. కువైట్ నుంచి వచ్చిన తర్వాత అతడు పలువురిని కలవడంతోపాటు ఓ పంక్షన్‌‌కు వెళ్లినట్లు తెలిసింది. డీఎంహెచ్‌‌వో లక్ష్మణ్‌‌ సింగ్‌‌ను ఈ విషయంపై సంప్రదించగా.. మంకీపాక్స్ అనుమానిత లక్షణాలు కనిపించటంతో టెస్టు కోసం హైదరాబాద్‌‌కు పంపామన్నారు. అతడి ఫ్యామిలీ మెంబర్లను ముందు జాగ్రత్త చర్యలో భాగంగా హోం ఐసోలేషన్‌‌ ఉండాలని సూచించినట్లు తెలిపారు.