కామారెడ్డిలో మంకీపాక్స్ ?

కామారెడ్డిలో మంకీపాక్స్ ?

మంకీపాక్స్‌ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇక భారత్‌లోనూ మంకీపాక్స్‌ కేసులు కలవరపెడుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో మంకీపాక్స్‌ తొలి కేసు నమోదం కావడం ఆందోళనకు గురి చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఒకరికి మంకీపాక్స్ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన 35 ఏళ్ల వ్యక్తికి మంకీ పాక్స్ లక్షణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఇతను కువైట్ నుంచి వచ్చాడు. శరీరంపై దద్దుర్లు రావడంతో ఆసుపత్రికి వచ్చాడు. అక్కడున్న వైద్యులు మంకీపాక్స్ లక్షణాలుగా గుర్తించారు. వెంటనే జిల్లా యంత్రాంగానికి సమాచారం అందించారు. రోగిని హైదరాబాద్ ఫీవర్ ఆసుపత్రికి పంపించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అతడికి మంకీపాక్స్ సోకిందా ? లేదా ? అనేది వైద్య పరీక్షల అనంతరం తేలనుంది. 

దేశంలో నాలుగు కేసులు..

ఇక మంకీపాక్స్ విషయానికి వస్తే.. కేరళలో మూడు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో మరో కేసు బయటపడింది. దీంతో దేశంలో మంకీపాక్స్‌ కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. ప్రపంచవ్యాప్తంగా 75 దేశాల్లో 16,000 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఆఫ్రికాలో ఐదు మరణాలు సంభవించాయి.  ఒకదేశం నుంచి మరో దేశానికి పాకుతోన్న ఈ వైరస్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించింది. మంకీపాక్స్‌ సోకిన వారిలో జ్వరం, తలనొప్పి, వాపు, నడుంనొప్పి, కండరాల నొప్పి, అలసట వంటి లక్షణాలు ఉంటాయని వైద్యులు వెల్లడిస్తున్నారు. మంకీ పాక్స్ లక్షణాలు బయటపడేందుకు 6 నుంచి 13 రోజులు పడుతుందని తెలిపారు.