మంకీపాక్స్పై ఆందోళన వద్దు

మంకీపాక్స్పై ఆందోళన వద్దు
  • కామారెడ్డివాసికి ఫీవర్ హాస్పిటల్‌‌లో చికిత్స
  • ఇయ్యాల పుణెకి శాంపిల్స్‌‌ పంపనున్నట్లు వెల్లడి
  • పోచమ్మ సోకినట్టే మంకీపాక్స్ కూడా: ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్

హైదరాబాద్, వెలుగు: మంకీపాక్స్‌‌ ప్రమాదకరం కాదని, ప్రజలు ఆందోళన చెందొద్దని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌‌‌‌ శ్రీనివాసరావు చెప్పారు. కువైట్ నుంచి తిరిగొచ్చిన ఓ వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు రావడంతో అతన్ని హైదరాబాద్‌‌లోని ఫీవర్ హాస్పిటల్‌‌లో ఐసోలేషన్‌‌లో ఉంచామన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన వ్యక్తి 6న కువైట్ నుంచి వచ్చారని, వచ్చేటప్పుడు అతనికి సింప్టమ్స్‌‌ ఏమీ లేవని తెలిపారు. 20న జ్వరం వచ్చిందని, 23వ తేదీ నాటికి రాషెస్ వచ్చాయన్నారు. ఫీవర్​ హాస్పిటల్‌‌లో బాధితుని నుంచి సోమవారం శాంపిల్ సేకరించి, పుణెలోని నేషనల్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌‌కు పంపిస్తామన్నారు. అప్పటిదాకా ఫీవర్‌‌‌‌ హాస్పిటల్‌‌లోనే ఉంచి ట్రీట్‌‌మెంట్ అందిస్తామన్నారు. ఈ వ్యక్తితో నేరుగా కాంటాక్ట్ అయిన ఆరుగురిని గుర్తించామని, వాళ్లెవరికీ మంకీపాక్స్‌‌ సింప్టమ్స్‌‌ లేవని డీహెచ్ ప్రకటించారు. అయినప్పటికీ వారిని ఐసోలేట్ చేశామన్నారు. 

టెస్టింగ్‌‌కు 5 రకాల శాంపిల్స్‌‌: ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్‌‌ 
30 బెడ్లతో మంకీపాక్స్ వార్డును ఏర్పాటు చేశామని ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్‌‌ శంకర్ తెలి పారు. ఇందులో మంకీపాక్స్‌‌ అనుమానితుల కోసం, కన్ఫామ్‌‌ అయిన కేసుల కోసం వేర్వేరుగా వార్డులు విభజించామన్నారు. మంకీపాక్స్‌‌ టెస్టులు చేసేందుకు గాంధీ హాస్పిటల్‌‌లో ల్యాబ్‌‌ ఇంకా అందుబాటులోకి రాలేదన్నారు. మంకీపాక్స్‌‌ టెస్టింగ్‌‌ కరోనా తరహాలో ఉండదని, ఐదు రకాల శాంపిల్స్​తో టెస్టు చేయాల్సి ఉంటుందన్నారు. అనుమానితుని బ్లడ్‌‌, యూరిన్‌‌, స్వాబ్‌‌, స్కిన్‌‌, దద్దుర్లలోని చీమును సేకరించి టెస్టింగ్‌‌కు పంపించాల్సి ఉంటుందని తెలిపారు. మంకీ పాక్స్​కు ప్రత్యేక ట్రీట్‌‌మెంట్ లేదని, పోచమ్మ తల్లిలాగే ఈ వ్యాధి కూడా దానంతట అదే తగ్గిపోతుందన్నారు. ఇందుకు 3 వారాల సమయం పడుతుందన్నారు. వైరస్ సోకిన వ్యక్తికి ఉండే సింప్టమ్స్​ను బట్టి ట్రీట్‌‌మెంట్ ఇస్తామన్నారు. దద్దుర్లతో మంట రాకుండా క్యాలడ్రిల్ లోషన్ రాస్తామని, ఫీవర్ ఉంటే పారాసిటమాల్ ఇస్తామని వివరించారు. మంకీపాక్స్‌‌ లక్షణాలు ఉన్నట్లు ఎవరికైనా అనుమానాలుంటే 9030227324 నంబర్‌‌‌‌కు ఫోన్ చేయాలని ఆఫీసర్లు సూచించారు.

గాలి ద్వారా సోకదు
కరోనా  తరహాలో గాలి ద్వారా మంకీపాక్స్ సోకదని ఇటీవల ఐసీఎంఆర్ విడుదల చేసిన గైడ్‌‌లైన్స్‌‌లో ఉంది. వైరస్ సోకిన వ్యక్తిని నేరుగా తాకడం, అతను వాడిన వస్తువులు వాడడం, దగ్గరగా ఎదురుదెరుగా ఉండి మాట్లాడేటప్పుడు తుప్పర్లు పడిన సందర్భాల్లోనే ఈ వ్యాధి ఒకరి నుంచి ఇంకొకరికి సోకుతుందని ఐసీఎంఆర్ వెల్లడించింది. మంకీపాక్స్‌‌ సోకిన తర్వాత 6 నుంచి 13 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడుతాయని, కొంత మందిలో 21 రోజుల దాకా పట్టొచ్చని గైడ్‌‌లైన్స్​లో పేర్కొంది.