
- కామారెడ్డి జిల్లాలో 5,17,677 ఎకరాల్లో ఆయా పంటల సాగు
- 61 శాతం వరి సాగుకానున్నట్లు అంచనా
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో వానకాలం యాక్షన్ ప్లాన్ రెడీ అయ్యింది. 5,17,677 ఎకరాల్లో ఆయా పంటలు సాగు కానుండగా, 61 శాతం వరి సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా. ప్రధానంగా నిజాంసాగర్, పోచారం ప్రాజెక్టులతో పాటు, చెరువులు, కుంటలు, బోర్ల కింద అధికంగా వరి సాగు చేయనున్నారు. వర్షాధారంపై మక్క, పత్తి, సోయా, పప్పు దినుసుల పంటలు సాగు చేస్తారు. ఆయా పంటల సాగుకు అనుగుణంగా మార్కెట్లో విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఎరువులు బఫర్ గోడౌన్లో నిల్వ ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. జుక్కల్, మద్నూర్, గాంధారి, సదాశివనగర్, రాజంపేట, తాడ్వాయి మండలాల్లో ప్రధానంగా సోయా, పత్తి, పప్పుదినుసుల పంటలు వేస్తారు.
ఎరువుల సరఫరా
పంటల సాగు డిమాండ్‌కు అనుగుణంగా ఎరువులు అందుబాటులో ఉంచేందుకు అధికారులు ప్లాన్ చేశారు. విత్తనాలు వేసేటప్పుడు, పంటలు ఎదిగేటప్పుడు ఎరువులు అధికంగా అవసరం. సీజన్లో జూన్, జూలై నెలల్లో అధిక మొత్తంలో ఎరువుల వినియోగం ఉంటుంది. ఆయా నెలల వారీగా డిమాండ్‌కు అనుగుణంగా సప్లయ్ చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.