వానకాలం పంటల ప్రణాళిక ఖరారు

వానకాలం పంటల ప్రణాళిక ఖరారు
  • మానుకోట జిల్లాలో 4,22,641 ఎకరాలు,
  • జనగామ జిల్లాలో 3,49,930 ఎకరాల్లో సాగు అంచనా
  • ఈసారి వరి సాగుకే మొగ్గు చూపుతున్న అన్నదాతలు
  • రైతుల కోసం ఎరువులు, విత్తనాలను సిద్ధంగా ఉంచామంటున్న ఆఫీసర్లు

మహబూబాబాద్, వెలుగు: వానాకాలం సీజన్​లో పంటల ప్రణాళికను వ్యవసాయశాఖ ఆఫీసర్లు రూపొందించారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా రైతులు వరి సాగుకే మొగ్గు చూపనున్నారు. ఈ వానాకాలం ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా సాగు చేసే అవకాశాలు ఉన్నాయని, ఈ మేరకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సిద్ధం చేసినట్లు అధికారులు చెబుతున్నారు.జిల్లాలో 4,22,641 ఎకరాల్లో వివిధ రకాల పంటలను  సాగు చేస్తారనే అంచనాను వేశారు. ప్రధానంగా వరి 2,21,282  ఎకరాల్లో  సాగు చేస్తారని అంచనా వేశారు. గతంలో మాదిరిగానే ఈ ఏడు వర్షాలు సమృద్దిగా కురుస్తాయనే అంచనాతో రైతులు వరి పంట  సాగు వైపు మొగ్గు చూపనున్నారు. రికార్డు స్థాయిలో వరి పంటను  రైతులు సాగు చేయనున్నారు.

మహబూబాబాద్ జిల్లాలో 4,22,641 ఎకరాల్లో సాగు అంచనా.. 

వానకాలం సీజన్​లో మహబూబాబాద్​ జిల్లాలో 4,22,641 ఎకరాల్లో రైతన్నలు పంటలు సాగు చేయనున్నారని అధికారులు అంచనా వేశారు. ఇందులో ప్రధానంగా వరి 2,21,282 ఎకరాల్లో, పత్తి 84,854, మొక్క జొన్న 58,361, మిరప 52,249, కంది 750, పెసర 4,555, మినుములు 10, వేరుశనగ 41, పసు పు 463, నువ్వులు 52, ఇతర ఆహారేతర పంటలు 33,274 ఎకరాల్లో సాగు చేస్తారని ఆఫీసర్లు అంచనాలు రూపొందించారు.

జనగామలో 3,49,930 ఎకరాల్లో సాగు అంచనా.. 

వానకాలం సీజన్​లో జనగామ జిల్లాలో సాగు విస్తీర్ణం పెరిగింది. మొత్తం 3,49,930 ఎకరాల్లో రైతులు వివిధ పంటలను సాగుచేయనున్నారు. ఇందులో వరి 2,15,000, పత్తి 1,25,000, మొక్కజొన్న 3670, కంది 3,500, పెసర 700, మినుములు 20, వేరుశనగ 100, పసుపు 463, నువ్వులు 30, పొగాకు 500, కూరగాయలు 1,010, ఫ్రూట్స్ 400 సాగు చేస్తారనే అంచనాలు రూపొందించారు.

మహబూబాబాద్ జిల్లాలో విత్తనాల అవసరం..క్వింటాళ్లలో..

వరి 44,256, పత్తి 1,69,708 ప్యాకెట్లు, మొక్కజొన్న 4,669, మిరప 522.49, కంది30, పెసర 182.2, మినుములు 0.4 క్వింటాళ్లు, వేరుశనగ 21, పసుపు 2,315, నువ్వులు 1.04 క్వింటాళ్లు అవసరం కానున్నాయి.

ఎరువులు.. మెట్రిక్ టన్నుల్లో..

మహబూబాబాద్ జిల్లాలో యూరియా 54,198.975, డీఏపీ 10,526. 993, ఎంవోపీ 5,119.540, ఎస్ఎస్ పీ 1,390. 493, కాంప్లెక్సు 34,762. 331 ఎరువులు అవసరమవుతాయని అంచనా వేశారు. 

మేలు రకాలైన విత్తనాలను  ఎంచుకోవాలి

రైతులు వానకాలం పంటల సాగులో మేలు రకాలైన, నాణ్యమైన విత్తనాలను ఎంచుకోవాలి. విత్తనాల కొనుగోలు సమయంలో తప్పనిసరిగా షాపు యజమాని నుంచి రసీదును పొందాలి. నకిలీ విత్తనాల గుర్తింపు కోసం జిల్లాలో టాస్క్ ఫోర్స్ బృందాలతో విస్తృతంగా తనిఖీలను చేపట్టడం జరుగుతుంది. రైతులకు కావలసిన అన్ని రకాల విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయి. గ్రామాల్లో సలహాలు, సూచనలు, సాంకేతిక సహయం అందించడానికి ఏఈవోలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రైతులు జాగ్రత్తలు పాటిస్తూ అనుకూలమైన పంటలను సాగు చేసి అధిక దిగుబడులను పొందాలని కోరారు.- విజయ నిర్మల, జిల్లా వ్యవసాయ అధికారిణి, మహబూబాబాద్​