- నిరుడు కంటే 11 లక్షలు తగ్గిన సాగు
- వర్షాల్లేకపోవడమే కారణం : వ్యవసాయశాఖ నివేదిక
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలం సీజన్లో బుధవారం నాటికి 42.76 లక్షల ఎకరాల్లో పంటలు సాగైనట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. ఈ సీజన్ సాధారణ సాగు విస్తీర్ణం 1.24 కోట్ల ఎకరాలు కాగా, కోటిన్నర ఎకరాల్లో పంట సాగు చేయాలని వ్యవసాయ శాఖ టార్గెట్‌గా పెట్టుకుంది. బుధవారం నాటికి టార్గెట్‌లో కేవలం 42.76 లక్షల ఎకరాల్లోనే పంటలు వేశారు. నిరుడు ఈ టైమ్‌కు 53.79 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. గతేడాది కంటే ఈఏడాది ఏకంగా 11 లక్షల ఎకరాల సాగు తగ్గింది. వర్షాలు ఆలస్యం కావడమే దీనికి కారణం. చెరువుల్లోంచి నీళ్లు విడుదల చేయకపోవడంతో చాలా చోట్ల ఇంకా ఇప్పటికీ వరి నార్లు పోయలేదు.
రాష్ట్రంలో ఎక్కువగా సాగయ్యే పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 50.59 లక్షల ఎకరాలు కాగా, ఈయేడు 75లక్షల ఎకరాల్లో సాగు చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఇప్పటిదాకా 31.91 లక్షల ఎకరాల్లోనే పత్తి విత్తనాలు వేశారు. ఇక వరి సాగు విస్తీర్ణం 49.86 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటి దాకా 2.95 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం 9.43 లక్షలు ఎకరాలు కాగా, ఇప్పటిదాకా 2.88 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది. సోయాబీన్ సాగు విస్తీర్ణం 4.13 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 3.19 లక్షల ఎకరాల్లో, మొక్కజొన్న సాగు విస్తీర్ణం 7.13 లక్షల ఎకరాలు కాగా, 1.68 లక్షల ఎకరాల్లో సాగైనట్లు వ్యవసాయశాఖ తన వీక్లీ రిపోర్ట్‌లో పేర్కొంది.
