ఐ బొమ్మ రిటర్న్స్.. మళ్లీ ప్రత్యక్షమైన పైరసీ వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌.. ఎవరి పని..?

ఐ బొమ్మ రిటర్న్స్.. మళ్లీ ప్రత్యక్షమైన పైరసీ వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌.. ఎవరి పని..?
  • కొత్త సిరీస్‌‌‌‌‌‌‌‌లు, సినిమాలతో ఐ బొమ్మ, బప్పం టీవీ దర్శనం
  • రవి విడుదల తర్వాత వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌ మళ్లీ కనిపించడంపై అనుమానాలు
  • మూవీ రూల్జ్‌‌‌‌‌‌‌‌లో కూడా స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఐబొమ్మ పైరసీ వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌ మళ్లీ దర్శనమిచ్చింది. తెలుగు సినిమాలు, సిరీస్‌‌‌‌‌‌‌‌లను అక్రమంగా ప్రసారం చేసే ఐ బొమ్మ, బప్పం టీవీ వెబ్‌‌‌‌‌‌‌‌సైట్లు ఇటీవల మళ్లీ యాక్టివ్‌‌‌‌‌‌‌‌ అయ్యాయి. ఐ బొమ్మ రవి అరెస్ట్‌‌‌‌‌‌‌‌తో కొన్ని నెలలుగా యాక్సెస్ కాకుండా ఉన్న ఈ సైట్లు తాజాగా కొత్త డొమైన్‌‌‌‌‌‌‌‌లతో తిరిగి అందుబాటులోకి వచ్చాయి. అదే సమయంలో మరో పైరసీ వెబ్‌‌‌‌‌‌‌‌సైట్ మూవీ రూల్జ్​కూడా యాక్టివ్ అయింది.

దీంతో ఇటీవల విడుదలైన కొత్త తెలుగు సినిమాలు గాయపడ్డ సింహం, ఇట్స్ ఒకే గురు, సరదా, పాపం ప్రతాప్ వంటి తెలుగు సినిమాలతో పాటు తమిళ సినిమాలు వెబ్ సిరీస్‌‌‌‌‌‌‌‌లు దర్శనమిస్తున్నాయి. దీంతో సినిమా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఓటీటీ సంస్థల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పైరసీ కారణంగా సినిమా రంగానికి రూ.కోట్ల నష్టం జరుగుతుందని, రవి అరెస్టుతో అంతా అయిపోయిందనుకుంటే మళ్లీ పైరసీ వెబ్‌‌‌‌సైట్స్‌‌‌‌​ఓపెన్‌‌‌‌ కావడంతో బెంబేలెత్తుతున్నారు.

అనేక డొమైన్లను బ్లాక్ చేసి..
గతంలో ఈ తరహా పైరసీ వెబ్‌‌‌‌సైట్లను సైబర్ క్రైమ్ పోలీసులు బ్లాక్‌‌‌‌ చేశారు. అనేక డొమైన్లను బ్లాక్ చేశారు. సర్వర్లను సీజ్ చేశారు. నిర్వాహకులను గుర్తించి కేసులు నమోదు చేయడం వంటి చర్యలతో కొంతకాలం ఈ సైట్లు పనిచేయకుండా పోయాయి. అయితే, నిర్వాహకులు కొత్త డొమైన్‌‌‌‌లు, మిర్రర్ సైట్లు సృష్టిస్తూ మళ్లీ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయి.

పైరసీ వెబ్‌‌‌‌సైట్లను మళ్లీ ఎవరు ప్రారంభించారనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఈ తరహా పైరసీ సైట్లతో సంబంధం ఉన్న వ్యక్తుల్లో ఒకరైన రవి పాత్ర ఉందా? లేక ఇంకెవరైనా సృష్టించారా? అనే విషయం నిర్ధారణ కాలేదు. ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు ఈ వెబ్‌‌‌‌సైట్ల వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించే దిశగా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగిస్తూ తరచూ డొమైన్ల పేర్లు మార్చడం, సర్వర్లను విదేశాలకు మారుస్తుండటంతో ఈ పైరసీ వెబ్‌‌‌‌సైట్లు మళ్లీమళ్లీ దర్శనమిస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు. 

కట్టడి అయ్యేనా!
సినిమా పైరసీని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకురావాలని భావిస్తోంది. థియేటర్లలో సినిమా రికార్డ్ చేసి ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో విడుదల చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ కఠిన శిక్షలు విధించేలా కొన్ని నిబంధనలు రూపొందించనున్నది. అయినా, టెక్నాలజీ సాయంతో పైరసీ వెబ్‌‌‌‌సైట్లు తరుచూ కొత్త రూపంలో ప్రత్యక్షమవుతున్నాయి. వీటిని పూర్తిగా నియంత్రించడం సవాలుగా మారింది. 

దీంతో ఈ వెబ్‌‌‌‌సైట్లలో ఉన్న కంటెంట్‌‌‌‌ను చూసినా లేదా డౌన్‌‌‌‌లోడ్ చేసినా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సైట్లలో ఉన్న ప్రకటనలు, లింకులు క్లిక్ చేస్తే మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లలో మాల్వేర్ లేదా వైరస్‌‌‌‌లు చేరే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.