వానాకాలం.. వ్యాధుల కాలం.. ఎవరికి రిస్క్.. ఏం చేస్తే సేఫ్.. ?

 వానాకాలం.. వ్యాధుల కాలం..  ఎవరికి రిస్క్.. ఏం చేస్తే సేఫ్.. ?

‘‘హాచ్​... హాచ్​.. అమ్మా! జలుబు చేసింది. జ్వరం వచ్చేలా ఉంది’’ ‘‘అబ్బబ్బా! సాయంత్రం అయితే చాలు.. దోమలు తెగ కుట్టేస్తున్నాయి. తెలిసినవాళ్లకు మొన్న దోమకాటు వల్ల మలేరియా వచ్చిందట!’’ వానాకాలంలో ఎవరో ఒకరి ఇంట్లో వినిపించే మాటలే ఇవి. సీజన్స్ మారేకొద్దీ వాతావరణంలో మార్పులు రావడం సహజం. అయితే వాటితోపాటు కొన్ని వ్యాధులు కూడా సీజనల్​గా దాడిచేస్తుంటాయి. మరి ఈ సీజన్​లో వచ్చే ఆ వ్యాధులు ఏంటి? వాటినెలా నివారించాలి? ఏఏ జాగ్రత్తలు పాటించాలి? 

వానాకాలంలో రకరకాల వ్యాధులు వ్యాపిస్తుంటాయి. ముఖ్యంగా శ్వాస సంబంధిత, దోమకాటు, కలుషిత ఆహారం వల్ల వచ్చే వ్యాధులు వస్తుంటాయి. ఇవి కాకుండా టీనియా వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఇబ్బంది పెడుతుంటాయి. కాబట్టి వానాకాలంలో ఎంత శుభ్రంగా ఉంటే అంత మంచిది అంటున్నారు ఎక్స్‌‌పర్ట్స్‌‌.

మొదటి రకం 

తుమ్ములు, దగ్గు, జ్వరం. వీటినే రెస్పిరేటరీ ట్రాక్ట్ డిసీజెస్​ అంటారు. ఇవి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంటాయి. ఇంట్లో ఎవరికైనా జలుబు ఉంటే వాళ్లు తుమ్మినప్పుడు వచ్చే తుంపరలు గాల్లో కలిసి ఇతరులకు చేరతాయి. ఇలాగే దగ్గినప్పుడు, జ్వరంగా ఉన్నప్పుడు వాళ్ల శ్వాస పీల్చడం వంటి వాటి ద్వారా చాలా కామన్​గా వ్యాపిస్తుంటాయి. వీటిలో ఫ్లూ, స్వైన్​ ఫ్లూ, ఇన్​ఫ్లుయెంజా అనే రకాలు ఉన్నాయి. 

జాగ్రత్తలు :శ్వాసకు సంబంధించిన ఈ వ్యాధులు వ్యాపించకుండా ఉండాలంటే కొవిడ్​లో పాటించినట్లుగా మాస్క్​ పెట్టుకోవాలి. సోషల్ డిస్టెన్స్ పాటించాలి. పిల్లల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆ రోజు స్కూల్​కు పంపొద్దు. ఎందుకంటే వాళ్లు ఈజీగా ఎఫెక్ట్ అవుతారు. వాళ్ల ద్వారా ఇతర పిల్లలకు అటాక్ అవుతుంది. 

రెండో రకం 

దోమకాటు వల్ల వచ్చే వ్యాధులు. వానాకాలంలో దోమలు ఎక్కువగా వస్తుంటాయి. ఇంటి పరిసరాల్లో చెత్త, చెదారం, తేమ, పూల కుండీల్లో నీళ్లు నిల్వ ఉన్నట్లయితే దోమలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. ఆ దోమలు ఉదయం, సాయంత్రం వేళల్లో మనుషులపై దాడి చేస్తాయి. ఇవి కుట్టడం ద్వారా మలేరియా, డెంగీ, చికెన్ గున్యా వంటి వైరల్ ఫీవర్లు వస్తాయి. 

జాగ్రత్తలు : ఇంట్లో ఎక్కడైనా మూలల్లో లేదా పూల కుండీల్లో నీళ్లు నిల్వ ఉంచొద్దు. దోమ తెరలు, మస్కిటో రెపెల్లెంట్స్ వంటివి  వాడాలి. ఇంటి ఆవరణలో, ఇతర పరిసరాల్లో తేమ లేకుండా పొడిగా ఉండేలా చూసుకోవాలి. అవసరమైతే బ్లీచింగ్​, దోమల మందు వంటివి చల్లాలి.

మూడో రకం 

వానాకాలంలో ఎక్కువగా వచ్చే వ్యాధుల్లో ఫుడ్​ అండ్ వాటర్ బర్న్ డిసీజెస్ కూడా ఉన్నాయి. కలుషిత ఆహారం, నీటి ద్వారా టైఫాయిడ్, గ్యాస్ట్రో ఎంటరైటిస్ వంటి హెల్త్‌ ప్రాబ్లమ్స్‌ వస్తాయి.  

జాగ్రత్తలు : ఈ వ్యాధులకు దూరంగా ఉండాలంటే నీటిని ఫిల్టర్ చేసుకుని తాగాలి. ఫిల్టర్ లేకపోతే వేడి చేసుకుని చల్లారిన తర్వాత తాగాలి. అలాగని వేడి వేడి నీళ్లు తాగకూడదు. చల్లారిన తర్వాతే తాగాలి. వేడిగా తాగితే జీర్ణ సమస్యలు వచ్చే చాన్స్ ఉంది. 

రిస్క్ ఎవరికి? ఏం చేయాలి?

ఈ సీజన్​లో వచ్చే వ్యాధులకు ఎక్కువగా చిన్నపిల్లలు, వృద్ధులు ఎఫెక్ట్ అవుతారు. పిల్లలకు ఎందుకంటే.. వాళ్లు జాగ్రత్తలు సరిగా పాటించలేరు. పైగా ఇప్పుడు స్కూల్స్ మొదలయ్యాయి. కాబట్టి బయటికి వెళ్లినప్పుడో, వచ్చేటప్పుడో.. ఏదో ఒక టైంలో వర్షంలో తడుస్తుంటారు. దానివల్ల జలుబు, జ్వరం వంటివి చుట్టుముట్టేస్తాయి. ఒకరికి వచ్చిందంటే తోటి పిల్లలకు ఈజీగా వ్యాపిస్తుంటుంది. ఇలాంటప్పుడు పిల్లలకు ఫ్లూ వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది.

పెద్దవాళ్లలో ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండడం వల్ల.. మనవళ్లు, ఇతరుల నుంచి వాళ్లకు వ్యాపి స్తుంటాయి. డయాబెటిస్, బ్లడ్ ప్రెజర్, కిడ్నీ, హార్ట్ సంబంధిత వ్యాధులు ఉన్నవాళ్లు ఎఫెక్ట్ అయితే ఇంకా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి వాళ్లు ఫ్లూ, నూమోకోకల్ అనే రెండు వ్యాక్సిన్లు తీసుకోవాల్సి ఉంటుంది. తద్వారా రెస్పిరేటరీ ట్రాక్​ డిసీజెస్ రాకుండా నివారించొచ్చు.

వ్యాక్సిన్ ఎప్పుడు తీసుకోవాలి? ఎందుకు?

ఫ్లూ వ్యాక్సిన్ అనేది యూనివర్సల్​గా పిల్లలకు ఇస్తుంటారు. నూమోకోకల్ వ్యాక్సిన్​ ఒక్కసారి తీసుకుంటే సరిపోతుంది. వ్యాక్సిన్స్​ వానాకాలం మొదట్లోనే వేయించుకోవాలి. అంటే మే నుంచి జూన్​ మధ్యలోనే తీసుకోవాలి. వ్యాక్సిన్​ తీసుకోవడం వల్ల ఇతర జబ్బులు ఉన్నవాళ్లకు ఈ సీజనల్​గా వచ్చే సమస్యలు తీవ్రత చూపించవు. తీవ్రత పెరగకుండా ఉండేందుకువ్యాక్సిన్స్ తీసుకోవడం తప్పనిసరి.

యాంటీబయాటిక్స్ వద్దు!

మామూలుగా సీజనల్​గా వచ్చే అనారోగ్య సమస్యలు ఐదారు రోజుల్లోనే తగ్గిపోతాయి. కాబట్టి జలుబు, దగ్గు, జ్వరం ఇలా ఏవైనా వచ్చినప్పుడు ఎప్పుడూ వాడే మందులు, సిరప్​లు వాడితే చాలు. కానీ.. కొందరు యాంటీబయాటిక్స్​ కూడా వాడుతుంటారు. అయితే.. నాలుగైదు రోజుల కంటే ఎక్కువ ఉంటేనే యాంటీబయాటిక్స్​ గురించి ఆలోచించాలి. అప్పటికీ మెడికల్ షాప్​కి వెళ్లి సొంతంగా కొనుక్కోకూడదు. డాక్టర్ సూచిస్తేనే వాడాలి.

అంతేకాదు..  డాక్టర్​ చెప్పిన కోర్స్​ పూర్తి చేయాలి. మధ్యలో వదిలేయకూడదు. నిజానికి విదేశాల్లో యాంటీబయాటిక్స్ ఓవర్​ ది కౌంటర్ దొరకవు. మన దగ్గర దొరుకుతున్నా యని చాలామంది విచ్చలవిడిగా వాడుతున్నారు. అలా వాడడం వల్ల వ్యాధి వచ్చినప్పుడు ఆ యాంటీబయాటిక్ వాడినా ఎఫెక్టివ్‌గా పనిచేయదు. 

- డాక్టర్ శశాంక్​ మాడభూషణ సీనియర్ కన్సల్టెంట్, ఇంటర్నల్ మెడిసిన్ కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్​

మరిన్ని వార్తలు