 
                                    - కొట్టుకుపోయిన వడ్లు.. తల్లడిల్లిన రైతులు
వెలుగు నెట్‌వర్క్ : మొంథా తుఫాన్ కారణంగా కురుస్తున్న వానలు రైతులకు గుండెకోతను మిగిల్చాయి. చేతికొచ్చిన పంట కండ్ల ముందే దెబ్బతినడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పత్తి, వరి, సోయా తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరి పంట నేలవాలగా.. పత్తికాయలు తడిసి రాలిపోయాయి. కొన్ని చోట్ల ఏరేందుకు సిద్ధంగా ఉన్న పత్తి రంగు మారింది.
చాలా చోట్ల ఆరబెట్టిన వడ్లు వాన నీటిలో కొట్టుకుపోగా.. మరికొన్ని చోట్ల ధాన్యం మొలకెత్తింది. కోతలు పూర్తై కల్లాల్లో నిల్వ చేసిన సోయా వానకు తడిసి మొలకలు వస్తున్నాయి.
నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో 90 వేల ఎకరాల్లో వరి దెబ్బతిన్నట్లు ఆఫీసర్లు అంచనా వేశారు. నల్గొండ జిల్లాలోని 310 గ్రామాల్లో 35,487 ఎకరాల్లో, సూర్యాపేట జిల్లాలోని 235 గ్రామాల్లో 54,006 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని తేల్చారు. మొత్తం 30,359 మంది రైతులు నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది.
యాదాద్రి జిల్లాలో 706.3 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అగ్రికల్చర్ ఆఫీసర్లు ప్రాథమికంగా అంచనా వేశారు. జిల్లాలోని 54 గ్రామాలకు చెందిన 430 మంది రైతుల పంట నష్టపోయినట్లు చెప్పారు.
ఖమ్మం జిల్లాలో 43,104 రైతులకు చెందిన 62,400 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. 36,893 ఎకరాల్లో వరి, 22,574 ఎకరాల్లో పత్తి, 2,923 ఎకరాల్లో మిర్చి, పది ఎకరాల్లో కంది పంటకు నష్టం జరిగిందని గుర్తించారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 1,452 ఎకరాల్లో పంట నష్టం జరిగింది.
జనగామ జిల్లాలో 25,005 ఎకరాల్లో పంట నష్టం జరుగగా.. 18,320 ఎకరాల్లో వరి, 6,445 ఎకరాల్లో పత్తి, 240 ఎకరాల్లో మక్కజొన్నకు నష్టం జరిగింది. హనుమకొండ జిల్లావ్యాప్తంగా 33,348 ఎకరాల్లో వరి దెబ్బతినగా.. 750 ఎకరాల్లో పత్తి, 620 ఎకరాల వరకు మక్కకు నష్టం జరిగింది.
ధర్మసాగర్ మండలం సోమదేవరపల్లిలో భలే రావు అనే రైతు కల్లంలో ఆరబోసుకున్న 14 ట్రాక్టర్ల వరి ధాన్యం వరదకు కొట్టుకుపోయింది. మానుకోట జిల్లాలో 16,617 ఎకరాల్లో వరి, 8,782 ఎకరాల్లో పత్తి, 65 ఎకరాల్లో మక్కలు, 565 ఎకరాల్లో మిర్చి పంటలు దెబ్బతిన్నాయి.
కరీంనగర్ జిల్లాలో 29,797 మంది రైతులకు చెందిన 34,127 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు తెలిసింది. ఇందులో 30 వేల ఎకరాల్లో వరి, 3,512 ఎకరాల్లో పత్తి దెబ్బతింది. ఏరేందుకు సిద్ధంగా ఉన్న పత్తి తడవడంతో పాటు చేన్లలో నీరు నిలిచి పంట పూర్తిగా దెబ్బతింది. జగిత్యాల జిల్లాలో 19,128 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 17,982 ఎకరాల్లో వరి, 1,146 ఎకరాల్లో పత్తి దెబ్బతింది.
రాజన్నసిరిసిల్ల జిల్లాలో 178 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. కస్బెకట్కూర్, చింతలపల్లి గ్రామాల్లొని కోనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొట్టుకుపోయింది. పెద్దపల్లి జిల్లాలో 196 మంది రైతులకు చెందిన 271 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది.
నిర్మల్ జిల్లాలో ఆరు బయట నిల్వ చేసిన సోయా తడిసి ముద్దయింది. మెదక్ జిల్లా పాపన్నపేటలో కొనుగోలు కేంద్రంలోని వడ్లు తడిసి మొలకలు వచ్చాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలోని 170 గ్రామాల్లో 33,559 ఎకరాల్లో వరి, పత్తి, వేరుశనగ పంటలు దెబ్బతిన్నాయి. వరి 10,585 ఎకరాలు, పత్తి 18,647 ఎకరాలు, వేరుశనగ 2,674 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు ఆఫీసర్లు అంచనా వేశారు.

 
         
                     
                     
                    