వానాకాలం రైతుబంధు కంప్లీట్.. 68.99 లక్షల మందికి సాయం

వానాకాలం రైతుబంధు కంప్లీట్.. 68.99 లక్షల మందికి సాయం
  • రూ.7,624 కోట్లు పంపిణీ చేసిన సర్కార్

హైదరాబాద్‌‌, వెలుగు: వానాకాలం రైతు బంధుకు సంబంధించి రూ.7,624.74 కోట్లు రైతుల ఖాతాల్లోకి చేరాయి. రాష్ట్ర వ్యాప్తంగా 68.99 లక్షల మంది రైతులకు సంబంధించిన 1.52 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయాన్ని సర్కార్ అందించింది. జూన్‌‌ 26న రైతు బంధు పంపిణీ ప్రారంభించారు. మొత్తం 57 రోజుల పాటు కొనసాగింది. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 5.80 లక్షల మంది రైతులకు రూ.609.67 కోట్లు అందాయి. అత్యంత తక్కువగా మేడ్చల్ మల్కాజ్​గిరి జిల్లాలో 35,879 మంది రైతులకు రూ.33.60 కోట్లు అందించామని వ్యవసాయ శాఖ వెల్లడించింది.

ఇప్పటి దాకా రూ.72,815 కోట్లు ఇచ్చాం: మంత్రి నిరంజన్‌‌రెడ్డి

రైతుబంధు కింద ఇప్పటి దాకా రూ.72,815.09 కోట్లు ఇచ్చామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌‌ రెడ్డి తెలిపారు. ఇది ఒక రికార్డు అని స్పష్టం చేశారు. ప్రతి ఏటా రెండు సీజన్​లకు పెట్టుబడి సాయం అందిస్తూ.. మొత్తం 11 విడతలు విజయవంతంగా పూర్తి చేసుకున్నామని తెలిపారు. దేశంలో ఉచిత కరెంట్, సాగునీళ్లు, రైతుబంధు, రైతు బీమా స్కీమ్​లతో పాటు 100 శాతం పంటలు కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.