ఇవాళ్టి నుంచి తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 11 గంటల 30 నిమిషాలకు ఉభయ సభలు ప్రారంభమవుతాయి. సభ ప్రారంభం కాగానే కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నతోపాటు ఇటీవల చనిపోయిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం పాటిస్తారు. అనంతరం సభ వాయిదా పడనుంది. ఆ తర్వాత స్పీకర్ అధ్యక్షతన జరిగే బీఏసీలో సమావేవాల నిర్వహణ తేదీలు, ఎజెండా ఖరారు చేస్తారు.
ఇటీవల రాష్ట్రంలో కురిసిన వర్షాలు, చేపట్టిన సహాయ చర్యలపై చర్చ జరగనుంది. శాసనమండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. ప్రభుత్వం 4-5 బిల్లులను పెట్టనున్నట్టు తెలిసింది. వీటిపై బీఏసీలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వనున్నది. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులైనా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఈసారి చర్చించాల్సిన అంశాలు మరీ ఎక్కువగా లేవని అధికారవర్గాలు చెప్తున్నాయి.
ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ.. ఇటీవల మంత్రివర్గం ఆమోదించింది. దీనికి సంబంధించిన బిల్లును సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. అదేవిధంగా గవర్నర్ తిప్పి పంపిన బిల్లులను కూడా తిరిగి సభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బిల్లులపై చర్చించి, వీటి ప్రాముఖ్యాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లనున్నారు. బిల్లులను గవర్నర్ ఆమోదించకపోవడం వల్ల నష్టాలు కలిగాయని సభావేదికగా ప్రజలకు వివరించనున్నారు.
శాసనసభ సమావేశాల్లో విశ్వవిద్యాయాల కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లు ప్రవేశపెట్టడం లేదని తెలిసింది. దాన్ని గవర్నర్ కొద్ది నెలల క్రితం రాష్ట్రపతి పరిశీలనకు పంపింది. దానిపై రాష్ట్రపతి నుంచి ఏ సమాచారం రానందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లును మాత్రం తిరిగి ప్రవేశపెట్టనున్నారు.

