- ఏప్రిల్, మే నెలల్లో కలిపి 90 వేల టన్నులు కట్
- కోటా తగ్గడంతో బఫర్ స్టాక్ ఏర్పాటుకు ఇబ్బందులు
- జూన్ నాలుగో వారం నుంచి పెరగనున్న యూరియా డిమాండ్
- ఆర్ఎఫ్సీఎల్లో ఉత్పత్తయ్యే మొత్తం యూరియాను తెలంగాణకే కేటాయించాలంటున్న రాష్ట్ర ప్రభుత్వం
- ఈ మేరకు త్వరలో మరోసారి లేఖ రాయాలని నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: వానాకాలం సీజన్ ప్రారంభం అవుతున్న టైంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం షాక్ ఇచ్చింది. రాష్ట్రానికి రావాల్సిన యూరియా కోటాలో భారీగా కోత విధించింది. సాధారణంగా రాష్ట్రంలో సాగయ్యే వరి, పత్తి, ఇతర పంటలకు యూరియా అవసరం ఎక్కువ. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లాల్లో ముందస్తు నిల్వలు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ, కేంద్రం సరఫరా తగ్గించడంతో ఏప్రిల్, మే కోటాలో లోటు రావడంతో బఫర్ స్టాక్ ప్రక్రియ నిలిచిపోయింది.
జూన్ నాలుగో వారం నుంచి జులై మొదటి వారం వరకు ఎరువుల అమ్మకాలు పెరగనున్న నేపథ్యంలో కోటాను తగ్గించొద్దంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఇప్పటికే కేంద్రానికి లేఖ రాయగా.. సీఎం రేవంత్‌రెడ్డి సైతం మరోసారి లెటర్ రాయాలని నిర్ణయించారు. రామగుండంలో ఉత్పత్తి అయ్యే యూరియాను పూర్తి స్థాయిలో తెలంగాణకే కేటాయించాలని కోరనున్నట్లు సీఎంవో వర్గాలు వెల్లడించాయి.
రెండు నెలల్లో 90 వేల మెట్రిక్ టన్నుల లోటు కేంద్రం కోటా తగ్గించడంతో ఏప్రిల్, మే నెలల్లో భారీ లోటు ఏర్పడింది. ఏప్రిల్‌లో రాష్ట్ర అవసరాల కోసం 2 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్‌ఎంటీ) యూరియా కావాలని కోరగా.. కేంద్రం మాత్రం 1.53 ఎల్‌ఎంటీలు మాత్రమే సరఫరా చేసింది. మే నెలలోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. ఈ నెలలో 2 ఎల్‌ఎంటీల యూరియా అవసరానికిగానూ ఇప్పటివరకు కేవలం 1.67 ఎల్‌ఎంటీలు మాత్రమే డిస్పాచ్ అయింది. రెండు నెలల్లో కలిపి సుమారు 90 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా నిలిచిపోయింది. దీని ప్రభావం వానాకాలం పంటల సాగుపై పడేలా కనిపిస్తోంది.
ఆర్‌ఎఫ్‌సీఎల్ ఉన్నా తప్పని తిప్పలు
పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ కంపెనీలో అధునాతన సాంకేతికతతో ఏటా 12 నుంచి 13 లక్షల మెట్రిక్ టన్నుల వేప పూత పూసిన యూరియా ఉత్పత్తి అవుతోంది. సొంత రాష్ట్రంలోనే ఇంత భారీ స్థాయిలో యూరియా ఉత్పత్తి అవుతున్నప్పటికీ, కేంద్రం కోతల కారణంగా తెలంగాణ రైతులకు తిప్పలు తప్పడం లేదు. సాధారణంగా తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం, యాసంగి రెండు సీజన్లలో కలిపి సగటున దాదాపు 20 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుంది. అందులో సగానికిపైగా అవసరాలను తీర్చగల సామర్థ్యం ఒక్క ఆర్‌ఎఫ్‌సీఎల్ ప్లాంట్‌కే ఉంది. అయినా ఆర్‌ఎఫ్‌సీఎల్ ఉత్పత్తిని కేంద్రం పూల్ పరిధిలోకి తీసుకుని ఇతర రాష్ట్రాలకు కూడా కేటాయిస్తుండడంతో స్థానికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
యూరియా మొత్తం రాష్ట్రానికే కేటాయించేలా..
రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు, పెరుగుతున్న సాగు విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకుని రామగుండంలో ఉత్పత్తి అయ్యే యూరియా మొత్తాన్ని తెలంగాణకే కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రాన్ని కోరింది. దీంతో పాటు ఏప్రిల్ నెలకు సంబంధించిన పెండింగ్ 0.47 ఎల్‌ఎంటీలతో పాటు జూన్ నెలకు రావాల్సిన 2 లక్షల మెట్రిక్ టన్నులు కలిపి మొత్తం 2.47 లక్షల మెట్రిక్ టన్నులను విడుదల చేయాలని మంత్రి తుమ్మల కేంద్ర మంత్రి నడ్డాకు విజ్ఞప్తిచేశారు. కానీ కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడం, వానాకాలం సీజన్ ఊపందుకుంటుండడంతో ఎరువుల కోసం ఇబ్బందులు ఎదురుకాకముందే కేంద్రంపై ఒత్తిడి పెంచాలని, స్టాక్‌ను కేటాయించాలని కోరుతూ మరోసారి లెటర్ రాయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
