హక్కులు హరిస్తారా : అమెరికాలో టిక్ టాక్ బ్యాన్ చేసిన రాష్ట్రం ఇదే..

హక్కులు హరిస్తారా : అమెరికాలో టిక్ టాక్ బ్యాన్  చేసిన రాష్ట్రం ఇదే..

భూ మండలాన్ని ఊపేస్తున్న టిక్ టాక్ యాప్ ను ఒక్కొక్క దేశం నిషేధిస్తూ వస్తుంది. ఫస్ట్ టైం అమెరికాలోని ఓ రాష్ట్రం పూర్తిగా బ్యాన్ చేసింది. అదే మోంటానా స్టేట్. దీనికి సంబంధించి మే 17వ తేదీ బుధవారం ఆ రాష్ట్ర ప్రభుత్వం సంతకం కూడా చేసేసింది. భద్రతా సమస్యలను కారణంగా చూపిస్తూ.. నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది మోంటానా ప్రభుత్వం. 

2024 జనవరి నుంచి నిషేధం అమలు :

టిక్ టాక్ బ్యాన్ వార్త కలకలం రేపింది. ఒక్కసారిగా యాప్ ను మాయం చేస్తే ప్రజల నుంచి నిరసనలు వ్యక్తం అయ్యే అవకాశాలు ఉండటంతో.. గడువు విధించింది. 2024, జనవరి ఒకటో తేదీ నుంచి పూర్తిగా నిషేధం అమల్లో ఉంటుందని.. టిక్ టాక్ యూజర్లు అందరూ ప్రత్యామ్నాయం చూసుకోవాలని మోంటానా రాష్ట్రం నెటిజన్లకు సూచించింది. నిషేధం అమలు అనేది చాలా కష్టం అని.. ప్రస్తుతం ఉన్న డిజిటల్ టెక్నాలజీ వల్ల దాన్ని అమలు చేయటం సవాల్ తో కూడిన వ్యవహారంగా మోంటానా సైబర్ సెక్యూరిటీ నిపుణులు ప్రకటించటం విశేషం. 

నిషేధం ఎందుకు :

టిక్ టాక్ వల్ల రాష్ట్ర భద్రతకు ముప్పు వాటిల్లుతుందని.. ఇక్కడి సమాచారం విదేశాల్లోని శత్రువులకు చేరుతుందని.. అమెరికా దేశంలోని మోంటానా ప్రజల వ్యక్తిగత భద్రత, వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఉందని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగానే టిక్ టాక్ ను పూర్తిగా నిషేధించటం జరిగిందని వెల్లడించింది. అమెరికా పౌరుల వ్యక్తిగత సమాచారం చైనాకు చేరకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది ప్రభుత్వం. టిక్ టాక్ అనేది చైనాకు చెందిన వ్యాపారవేత్తల నిధులతో నడుస్తుందని.. మోంటానా పౌరులకు సంబంధించి రహస్యంగా ఉండాల్సిన సమాచారం టిక్ టాక్ ద్వారా చైనాకు చేరుతుందని గుర్తించినట్లు వెల్లడించింది ప్రభుత్వం. 

ఈ కారణాలతో అమెరికాలో దేశంలోని మోంటానా రాష్ట్రం టిక్ టాక్ ను పూర్తి నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై టిక్ టాక్ యాజమాన్యం స్పందించింది. ఇది ప్రజల హక్కులను కాలరాయటమే అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.