‘మాంటిస్సోరి’ కోటేశ్వరమ్మ కన్నుమూత

 ‘మాంటిస్సోరి’ కోటేశ్వరమ్మ కన్నుమూత

ప్రముఖ విద్యావేత్త, మాంటిస్సోరి విద్యాసంస్థల వ్యవస్థాపకురాలు కోటేశ్వరమ్మ (92) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆదివారం తెల్లవారుజామున విజయవాడలోని ఇంట్లో తుదిశ్వాస విడిచారు. బాలికా విద్యను ప్రోత్సహించడంలో కోటేశ్వరమ్మ గత 50 ఏళ్లుగా విశేషమైన సేవలందించారు. మాంటిస్సోరి విధానంలో కేజీ నుంచి పీజీ వరకు విద్యనందిస్తూ..  బీఈడీ, ఫార్మసీ, లా, ఇంజనీరింగ్ లో మహిళలు చదువుకునేలా  కృషి చేశారు.  కృష్ణా జిల్లా గోసాలలో 1925 సెప్టెంబరు 15న పుట్టిన కోటేశ్వరమ్మ టీచర్ గా కెరీర్ ను ప్రారంభించారు. 1955లో మాంటిస్సోరి స్కూల్ ను స్థాపించారు. ఇంటర్, డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేసి అమ్మాయిలు కేజీ నుంచి పీజీ వరకు ఒకేచోట చదువుకునేలా సంస్థను అభివృద్ధి చేశారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు. 1971లో అప్పటి రాష్ట్రపతి వి.వి.గిరి చేతులమీదుగా, 1980లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి  బెస్ట్ టీచర్ గా అవార్డు అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది. కోటేశ్వరమ్మ మృతి పట్ల విద్యావేత్తలు, ప్రముఖులు సంతాపం తెలిపారు.