కరోనా పరిహారం కోసం నెలలుగా ఎదురుచూపులు

కరోనా పరిహారం కోసం నెలలుగా ఎదురుచూపులు
  • నెలలుగా ఎదురుచూస్తున్న మృతుల కుటుంబాలు
  • పరిహారం కోరుతూ 32,844 దరఖాస్తులు
  • 2,813 అప్లికేషన్లు రిజెక్ట్

హైదరాబాద్, వెలుగు: కరోనా మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అందజేయడంలో రాష్ట్ర సర్కార్ జాప్యం చేస్తోంది. పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లోనే డబ్బులు చెల్లించాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయడం లేదు. కుటుంబసభ్యులను కోల్పోయి, దవాఖాన్ల బిల్లులతో అప్పులపాలైన వేల కుటుంబాలు పరిహారం కోసం ఎదురుచూస్తున్నాయి. కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని గతేడాది అక్టోబర్‌‌‌‌లో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచించింది. మన రాష్ట్రంలో నవంబర్ నుంచి మీ సేవల ద్వారా అప్లికేషన్లు తీసుకునే ప్రక్రియ మొదలైంది. నష్టపరిహారం కోరుతూ మృతుల కుటుంబాల నుంచి ఇప్పటి వరకు 32,844 అప్లికేషన్లు వచ్చాయి. ఈ అప్లికేషన్లను పరిశీలించిన హెల్త్, రెవెన్యూ అధికారులు ఇందులో 28,526 దరఖాస్తులు జెన్యూన్ అని నిర్ధారించారు. ఇంకో 1,505 అప్లికేషన్లు ఆఫీసర్ల పరిశీలనలో ఉన్నాయి. అధికారులు అప్రూవ్ చేసిన 28,526 దరఖాస్తుల్లో ఇప్పటి వరకు 8,500 కుటుంబాలకు మాత్రమే పరిహారం డబ్బులు అందగా, సుమారు 19 వేల కుటుంబాలు ఇప్పటికీ డబ్బుల కోసం నిరీక్షిస్తున్నాయి. పరిహారం ఎందుకు ఆలస్యమవుతున్నదో బాధితులకు చెప్పేవారు లేక, మీసేవ సెంట్లరు, మండల రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు.

9 శాతం రిజెక్ట్‌‌ 
డెత్‌‌ సర్టిఫికెట్‌‌లో కొవిడ్ అని లేదన్న కారణంతోనో, కొవిడ్ పాజిటివ్ సర్టిఫికెట్ లేదన్న కారణంతోనో పరిహారం కోసం వచ్చిన దరఖాస్తులను రిజెక్ట్ చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. కానీ, మన రాష్ట్రంలో వందలకొద్దీ దరఖాస్తులను ఆఫీసర్లు రిజెక్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకూ పరిశీలన పూర్తయిన 31,339 అప్లికేషన్లలో సుమారు 9 శాతం (2,813) అప్లికేషన్లను రిజెక్ట్ చేశారు. తాము అన్ని ఆధారాలతో పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, రిజెక్ట్ చేశారని బాధితులు వాపోతున్నారు. తమ వారివి కోవిడ్ మరణాలే అయినప్పటికీ, ఇందుకు అవసరమైన ఆధారాలు లేక దరఖాస్తు చేసుకోలేకపోతున్నామని మరికొందరు చెబుతున్నారు. ఈ పరిస్థితికి ఒకరకంగా రాష్ట్ర సర్కారే కారణం అని బాధితులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా మృతులపై మొదట్నుంచి సర్కార్ తప్పుడు లెక్కలు ప్రకటిస్తూ వచ్చింది. కరోనాతోనే చనిపోయినప్పటికీ, ఇతర కారణాలతో చనిపోయినట్టు డెత్‌‌ సర్టిఫికెట్లు ఇచ్చింది. కొంతమందికి అవి కూడా ఇవ్వలేదు. టెస్టుల రిపోర్టులు ఇవ్వకపోవడం, అసలు టెస్టులే చేయకపోవడం వంటి అనేక కారణాలతో బాధితుల వద్ద ఆధారాలు లేకుండా పోయాయి. ఇలాంటి వాళ్లు ఇప్పుడు ఆధారాల కోసం దవాఖాన్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికీ దొంగ లెక్కలతో రాష్ట్రంలో కరోనా మరణాలను తప్పుగా ప్రకటిస్తున్నారని మీడియా రిపోర్ట్‌‌ చేసినా, ఒక్క లెక్క కూడా తప్పు చెప్పడం లేదంటూ రాష్ట్ర సర్కార్ బుకాయించింది. తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఎదురుదాడికి దిగింది. మృతుల కుటుంబాల నుంచి నష్టపరిహారం కోసం దరఖాస్తులు వెల్లువెత్తడంతో రాష్ట్ర సర్కార్ చెప్పినవన్నీ అబద్ధపు లెక్కలేనని తేలిపోయింది. అయినా, ఇప్పటికీ కొవిడ్‌‌ బులెటిన్‌‌లో అవే తప్పుడు లెక్కలను చూపిస్తోంది. 

ఫీజులు కట్టలేకపోతున్న
మాది భైంసా పట్టణం కిసాన్ గల్లీ. నాకు ఇద్దరు పిల్లలున్నరు. నా భర్త సాయినాథ్ కరోనాతో చనిపోయి ఏడాది అయింది. రూ.50 వేల సాయం కోసం దరఖాస్తు చేసి నాలుగు నెలలైంది. ఇప్పటిదాకా పైసలు రాలేదు. పిల్లల చదువులకు ఫీజులు కట్టేందుకు కూడా డబ్బులు లేవు. ప్రభుత్వం ఆ సాయం చేస్తే, చదువులకన్నా సాయమైతది.
- విజయలక్ష్మి, నిర్మల్

రిపోర్టులు పెట్టినా రిజెక్ట్
నా భర్త మల్లేశం పోయినేడాది జనవరిలో కరోనాతో చనిపోయిండు. నష్టపరిహారం కోసం నవంబర్‌‌‌‌లో దరఖాస్తు చేసుకున్నం. దరఖాస్తు రిజెక్ట్ అయినట్టు డిసెంబర్‌‌‌‌ 23న మెసేజ్ వచ్చింది. దవాఖానలో చికిత్స తీసుకున్నప్పటి రిపోర్టులు కూడా పెట్టినం. ఎందుకు రిజెక్ట్ చేసిన్రో తెల్వదు. ఇక్కడి ఆఫీసర్లను అడిగితే మళ్లీ దరఖాస్తు చేయమన్నరు. రిజెక్ట్ అయిన తెల్లారే మళ్లీ చేసినం. ఇప్పటివరకూ పైసలు రాలేదు.
- పులి పద్మ, కొడిమ్యాల, జగిత్యాల జిల్లా

కొత్తగూడెం జిల్లా చండ్రుగొండకు చెందిన సిరికొండ సీతారాములు నిరుడు జూన్​లో కరోనాతో చనిపోయాడు. ఆయనకు భార్య సీతమ్మ, ముగ్గురు పిల్లలున్నారు. సీతారాములు మృతితో ఆ  కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. అప్పులు తీర్చడం, కుటుంబ పోషణ భారమవడంతో సీతమ్మతో పాటు పిల్లలు కూడా కూలి పనికి వెళ్తున్నారు. 50 వేల పరిహారం కోసం 3 నెలల కిందే దరఖాస్తు చేసినా, ఇప్పటికీ పైసలు అందలేదని సీతమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.

నాలుగు నెలలైతంది
నా భర్త గోపి ఎలక్ట్రీషియన్‌‌. నిరుడు జూన్‌‌ లో కరోనాతో చనిపోయిండు. నాకు ఇద్దరు చిన్న పిల్లలున్నరు. ఆయన చనిపోవడంతో ఇప్పుడు నేను కూలీ పనికి పోవాల్సివస్తోంది. సర్కారు నుంచి 50 వేలు వస్తయని చెప్తే, మీసేవలో అప్లై చేసిన. నాలుగు నెలలైతున్నా డబ్బులు రాలేదు. ఆఫీసర్లు స్పందించి డబ్బులు ఇప్పిస్తే ఆసర అయితయి.
- నాగమణి, ముల్కలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా