
న్యూఢిల్లీ: గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ భారతదేశానికి ‘బీఏఏ3’ స్థాయి లాంగ్‌టెర్మ్ రేటింగ్‌ను, ‘స్టేబుల్’ ఔట్‌లుక్‌ను ఇచ్చింది. దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడం, గ్లోబల్‌గా మంచి స్థాయిలో ఉండడంతో ఈ రేటింగ్ ఇచ్చింది. మూడీస్ ప్రకారం, భారతదేశం పెద్ద ఆర్థిక వ్యవస్థలో అత్యంగా వేగంగా వృద్ధి సాధిస్తోంది. విదేశీ పెట్టుబడులపై ఆధారపడకుండా స్థిరంగా కొనసాగుతోంది. అయితే, భారత ప్రభుత్వానికి ఉన్న అధిక అప్పు భారం, పన్నుల ఆదాయంలో తగ్గుదల, వ్యయ నియంత్రణలో లోపాలు వంటి అంశాలు రేటింగ్‌ను పరిమితం చేశాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఇండియా జీడీపీ వృద్ధి 6.5 శాతానికి తగ్గినప్పటికీ, జీ20 దేశాల్లో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందని మూడీస్ తెలిపింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా 6.5శాతం వృద్ధి ఉంటుందని పేర్కొంది. అమెరికా విధించిన 50శాతం దిగుమతి సుంకాలు తాత్కాలికంగా ప్రభావితం చేయొచ్చని, లాంగ్‌టెర్మ్‌లో ఎగుమతులపై ఆధారపడే తయారీ రంగంపై తీవ్ర ప్రభావం ఉంటుందని మూడీస్ హెచ్చరించింది. అయితే, వీసా విధానాలు, ఔట్‌సోర్సింగ్‌పై లెవీలు వంటి ఇతర యూఎస్ విధానాలు రెమిటెన్సులు, సేవల ఎగుమతులపై పెద్దగా ప్రభావం చూపవని, అందువల్ల కరెంట్ అకౌంట్ లోటు విస్తరించే ప్రమాదం తక్కువే అని పేర్కొంది.
దేశీయ మార్కెట్ స్థిరంగా ఉండడం, అధిక జనాభా వంటి అంశాల వల్ల డిమాండ్ ఆధారిత వృద్ధిని ఇండియా కొనసాగించగలదని మూడీస్ విశ్వాసం వ్యక్తం చేసింది. ‘‘తాజా రేటింగ్ నుంచి అప్‌గ్రేడ్ కావాలంటే, ఇండియా ఆదాయాన్ని పెంచే స్థిరమైన పన్ను విధానాలను అమలు చేయాలి. దవ్యలోటు తగ్గించుకోవాలి. ఖర్చులను కంట్రోల్లో పెట్టాలి. ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేందుకు అనుకూలమైన సంస్కరణలు తీసుకురావాలి” అని వివరించింది. ఇటీవల ఎస్ అండ్ పీ, ఆర్ అండ్ ఐ, మార్నింగ్‌స్టార్ డీబీఆర్‌ఎస్ వంటి ఇతర రేటింగ్ సంస్థలు కూడా భారత రేటింగ్‌ను మెరుగుపరిచాయి.