సోమయ్య, రాజయ్య అన్నదమ్ముల పిల్లలు. వాళ్లది వెంకటాపురం. గొప్ప స్థితిమంతులు కాకపోయినా, ఆర్థికంగా ఏ లోటూ లేనివాళ్లు. సోమయ్య కొడుకు విశ్వనాథం, రాజయ్య కొడుకు గోవిందరావు. వీళ్లద్దరినీ సమీపంలోనే ఉన్న చిన్న టౌన్‌లోని ఒక కాన్వెంట్లో చేర్పించారు. ప్రతిరోజూ ఆ ఊరికి స్కూల్ బస్ వస్తుంది. విశ్వనాథం, గోవిందరావులు పోటాపోటీగా చదివేవారు. అలా కలిసి మెలిసి ఉంటూ స్కూల్ చదువు పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత కూడా వాళ్లు అలానే కలిసి పెద్ద చదువులు చదవాలని కోరుకున్నారు తండ్రులిద్దరూ. అందుకని ఒకే కాలేజీలో చేర్పించారు. అది సిటీ కావడంతో వాళ్లు హాస్టల్స్‌లో ఉంటూ చదువుకునేవాళ్లు.
ఇద్దరికీ మంచి ర్యాంకులు వచ్చాయి. ఇక భవిష్యత్ ప్రణాళిక గురించి ఆలోచనలో పడ్డారు. ఇద్దరూ బాగా చదివే స్టూడెంట్స్ అయినప్పటికీ వాళ్ల ఆలోచనలు మాత్రం వేరుగా ఉన్నాయని అప్పుడే అర్థం చేసుకున్నారు. విశ్వనాథానికి ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కోరిక ఉండేది. అయితే, గోవిందరావుకు ఉద్యోగం మీద ఆసక్తి లేదు. ఒక వ్యాపారం పెట్టుకోవాలనేది అతని కోరిక. గోవిందరావుకు అతని తండ్రి రాజయ్య పదేపదే చెప్పి చూశాడు. ‘ఈ వ్యవసాయమే కాదు, ఏ వ్యాపారమూ నువ్వు చేయలేవు’ అని. విశ్వనాథం లాగే ఏదైనా ఉద్యోగానికి ప్రయత్నాలు చేయమని కొడుక్కి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు.
కానీ, గోవిందరావు ‘ఉద్యోగమయితే అరకొర జీతం వస్తుంది. అదే వ్యాపారం అయితే రోజూ వేలకొలదీ సంపాదన చూడొచ్చు’ అని చెప్పాడు. ఇక కొడుకుకు చెప్పి లాభం లేదని, సగం భూమి అమ్మి వ్యాపారం కోసం డబ్బు ఇచ్చాడు రాజయ్య.
ఇటు గ్రూప్స్ కోచింగ్‌లు తీసుకుంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేయసాగాడు విశ్వనాథం. గోవిందరావు మాత్రం సిటీకి మెయిన్ సెంటర్లో ఒక బిజినెస్‌ని స్టార్ట్ చేశాడు. మొదట్లో అతని షాపు కస్టమర్లతో కిక్కిరిసి పోయింది. దాంతో అతని ఆనందానికి అంతు లేకుండా పోయింది.
విశ్వనాథం గ్రూప్స్‌లో సెలెక్ట్ అయి, గెజిటెడ్ స్థాయి ఉద్యోగాన్ని సంపాదించాడు. ఇక ‘నెలకు వచ్చే ఆ అరకొర జీతంతోనే బతుకు’ అంటూ విశ్వనాథాన్ని ఎద్దేవా చేశాడు గోవిందరావు. ఉద్యోగాన్ని ఒక హోదాగా భావించిన విశ్వనాథం తన వృత్తిలో బాధ్యతగా మెలగసాగాడు.
రోజులు గడవసాగాయి. కాలంలో పెనుమార్పులు వచ్చాయి. వ్యాపారాల్లో పోటీతత్వం పెరిగింది. కస్టమర్లు కొత్తను ఒక వింతగా భావించసాగారు. మారుతున్న కాలంతో గోవిందరావు పరుగులు పెట్టలేక పోయాడు. రెండు సంవత్సరాలు విపరీతమైన నష్టాలు వచ్చాయి. అదే సమయంలో ప్రజలు ఆన్లైన్ వైపు మొగ్గు చూపసాగారు. గోవిందరావు ఉద్యోగులకు జీతాలు అతి కష్టంగా ఇవ్వసాగాడు. కొత్త సరుకును తెప్పించలేకపోయాడు. షాపు అద్దె కూడా బకాయిపడ్డాడు.
ఫోన్ల ద్వారా తరచూ విశ్వనాథం, గోవిందరావులు యోగ క్షేమాలు విచారించుకోసాగారు. ఇప్పుడు విశ్వనాథాన్ని చూస్తుంటే గోవిందరావుకు ఎంతో అసూయ కలిగింది. సగం పొలం అమ్మి వ్యాపారాన్ని ప్రారంభిస్తే దివాళా స్థితికి చేరుకుంది. విశ్వనాథం వాళ్ల వ్యవసాయం అంతే ఉంది. అంతేకాకుండా అతను ఈ రోజు ఎంతో మంచి స్థాయిలో ఉన్నాడు. గోవిందరావులో సైతం ప్రతిభ లేకపోలేదు. అయితే, అతను ఉద్యోగాన్ని చిన్న చూపు చూసి ఎండమావుల వెంట పరుగులుపెట్టాడు. పరుగెత్తి పాలు తాగేకంటే, నిలబడి నీళ్లు తాగమన్నారు. ఇప్పుడు దిగులుపడి ఏం ప్రయోజనం? అని ఎంతో బాధ పడసాగాడు గోవిందరావు.
అప్పటినుంచి తన షాపుకి వచ్చే స్టూడెంట్స్ ఎవరైనా ‘నీలాగా బిజినెస్ పెడతాం అంకుల్’ అంటే.. ‘‘ముందు బాగా చదువుకోండి బాబూ. బాగా చదివితే మంచి ఉద్యోగంలో స్థిరపడొచ్చు. నేను మీలాగే చదువుకున్నా.. కానీ, బిజినెస్ మీద ఇంట్రెస్ట్‌తో ఇది మొదలుపెట్టా. అంతవరకు బాగానే ఉంది. కొంతకాలం బాగానే నడిచింది. పెద్ద బిజినెస్ మ్యాన్‌గా పేరు కూడా తెచ్చుకున్నా. అయితే పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. అన్నింటినీ తట్టుకుని నిలబడాలి. అప్పుడే నిజమైన సక్సెస్ చూస్తాం. ఇందులో నేను ఎదగలేకపోయాను.
ఎందుకంటే వ్యాపారం గురించి నాకు పెద్దగా తెలియదు. మానాన్న అందుకే నన్ను ఉద్యోగం చేయమన్నాడు. కానీ, నేను ఆరోజు వినలేదు. ఇప్పుడు అనిపిస్తోంది మనకు సరిపోని జీవితం మనకు అవసరమా? అని. ఉద్యోగం సాధించే అర్హత ఉన్నా కూడా అత్యాశకు పోతే నాలా బాధ పడాల్సి వస్తుంది బాబూ” అని చెప్తుంటాడు.
–పంతంగి శ్రీనివాసరావు–
