వేదాద్రిపురంలో ఉండే నందనుడు తనకు డబ్బులేదని బాధ పడేవాడు. డబ్బు సంపాదించడానికి న్యాయ మార్గంలోనే అనేక చిన్న పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఒకరోజు వాడు హనుమంతుని గుడి వైపు వెళ్తుండగా ఓ ధనవంతుడు అన్నదానం చేస్తూ కనబడ్డాడు. ఎంతో మంది భక్తులు వరుసలో నిలబడి ఆయన అందించే భోజన పళ్లాలను ఆనందంగా అందుకుంటున్నారు.
నందనుడు కూడా గుడిలోనికి వెళ్లి వరుసలో నిల్చుని ఒక పళ్లెం తీసుకున్నాడు. భోజనం తింటుండగా చుట్టుపక్కల వాళ్లు దాత గురించి పొగడడం వినిపిస్తోంది. ‘‘డబ్బున్నా పెట్టే మనసు ఉండాలి కదా.. ఈయన చాలా మంచివాడు. కడుపునిండా రుచికరమైన భోజనం పెట్టాడు’’ అని దీవిస్తున్నారు. ఆ మాటలు వింటున్న నందనుడికి తనకు కూడా డబ్బు ఉంటే తను కూడా అన్నదానం, ధార్మిక కార్యక్రమాలు చేసి ఉండే వాడిని కదా అనుకున్నాడు మనసులో. ‘‘ఇతరుల పొగడ్తల కోసం కాకపోయినా నా సంతృప్తి కోసం ప్రజలకు ఏదైనా సాయం చేసేవాడిని. కానీ నా సంపాదన జీవితాన్ని నెట్టుకురావడానికే సరిపోతుంది.
అలాంటిది దానధర్మాల గురించి ఆలోచించే స్థోమత నాకు లేదు’’ అనుకుని నిట్టూరుస్తూనే తినడం ముగించాడు. ఒకరోజు ఆ గుడికి సోమయాజులు అనే ప్రవచన కర్త వచ్చాడు. అనేక ఆధ్యాత్మిక విషయాలు బోధించసాగాడు. ఆ రోజు నందనుడి పుట్టినరోజు కావడంతో దండం పెట్టుకోవడానికి గుడికి వెళ్లాడు. అక్కడ జరుగుతున్న ప్రవచన కార్యక్రమంలో కూర్చున్నాడు. ప్రవచన కర్త సోమయాజులు ప్రసంగాలలో దాన గుణం గురించి వివరించాడు.
ప్రసంగం అంతా అయిపోయాక నందనుడు ఆయన దగ్గరకు వెళ్లి వినయంగా నమస్కరించి పరిచయం చేసుకుని, ‘‘తమరు దానగుణం గురించి చాలా గొప్పగా వివరించారు. కానీ దాన ధర్మాలు చెయ్యాలంటే ధనం ఉండాలి కదా! కేవలం ధనవంతులు మాత్రమే దానధర్మాలు చేయగలుగుతున్నారు. నాబోటి డబ్బు లేని వారి సంగతేమిటి? దానం చెయ్యాలని ఉన్నా ధనం లేక దానం చేయలేక పోతున్నాను” అన్నాడు నందనుడు.దానికి సోమయాజులు చిరునవ్వుతో ఈ విధంగా చెప్పాడు.
‘‘చూడు నాయనా! దానం చేయాలంటే కేవలం డబ్బు మాత్రమే ఉండాలని లేదు. భగవంతుడు కొందరికి డబ్బు, ఇంకొందరికి విద్య.. ఒక్కొక్కరికి ఒక్కోటి ఇస్తాడు. ఇలా ఇచ్చిన వాటిలో ప్రజలకు ఏం పనికొస్తాయో వాటిని దానం చేయాలి. భగవంతుడు నీకు మంచి మనసు, ఆలోచనలు ఇచ్చాడు.. అదే నీ దగ్గర ఉన్న ధనం! శక్తి మేర ఇతరులకు సాయపడే ధనం ఇచ్చాడు. నీకిచ్చిన ఆ ధనాన్ని నువ్వు ఎలా ఉపయోగించాలో బాగా ఆలోచించి చూడు నీకే తెలుస్తుంది. అప్పుడు నువ్వు కూడా సమాజంలో గొప్ప దాతగా పేరు తెచ్చుకుంటావు.
ఉదాహరణకు.. ఏదైనా ఆసుపత్రికి వెళ్లి తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగికి నీకు చేతనైనంత సాయం చేయి. సాంత్వన కలుగచేసే నాలుగు మంచి మాటలు చెప్పు. దానిని మంచి మాట దానం అనొచ్చు.పేద పిల్లలకు నీకు వచ్చిన చదువు చెప్పు. అది విద్యాదానం అవుతుంది. నీకు చదువు వచ్చు కాబట్టి భాగవతం, రామాయణం వంటి పుస్తకాలు బాగా చదువుకుని వాటిలోని విశేషాల్ని ఏ దేవాలయంలోనో, వృద్ధాశ్రమాల్లోనో చెబితే అది పురాణ ప్రవచన దానం అవుతుంది.
ఇప్పుడు నేను చెప్పిన వాటికి ధనం అక్కరలేదు. కేవలం నీ ఆలోచనలు, మంచి బుద్ధి మాత్రమే చాలు. ఇంకా ఆలోచిస్తే ధనం లేకుండా చేసే దానాలు నీకు స్ఫురించవచ్చు. ఇలా నువ్వు నేను చెప్పినవి చేస్తుంటే నీ మంచితనం గమనించిన ఎవరైనా ధనవంతులు నీకు కొంత ధన సాయం చేయొచ్చు. నేను చెప్పేదేమిటంటే నువ్వు చేసే ఈ మంచి పనులకు ధనంతో ముడి పెట్టకు, ఆలోచించు” అని వివరించాడు .. ప్రవచన కర్త.
ఆయన చెప్పిన మాటలు విన్నాక నందనుడిలో ఒక విధమైన చైతన్యం వచ్చింది. ఆయన చెప్పినట్టు తనకు తెలిసిన విషయాల్లో, చదువులో కృషి చేస్తూ అవసరం ఉన్న వారికి ఇంకా తనకు తెలిసిన వృద్ధాశ్రమాల్లో, దేవాలయాల్లో తను నేర్చుకున్నవి బోధిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. అతని మంచితనం చూసి మంచి జీతంతో తన కార్యాలయంలో నందనుడికి ఉద్యోగం ఇచ్చాడు ఓ ధనవంతుడు. అంతేకాకుండా తాను చేసే సేవా కార్యక్రమాలకు ధనసాయం కూడా చేసేవాడు. మనం మంచి పనులు చేస్తుంటే మనకు మంచి జరిగి తీరుతుంది.
- -కంచనపల్లి వేంకట కృష్ణారావు-
