- నీతి నిజాయితీకి కట్టుబడి ఉండాలి: డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడి
- పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్
- తెలంగాణ ఏర్పడ్డాక 112 మందితో తొలి డీఎస్పీ బ్యాచ్
హైదరాబాద్, వెలుగు: పోలీసులకు నైతిక విలువలే పునాది అని, రాజ్యాంగంపై ప్రమాణం చేసి విధుల్లో చేరుతున్నందున నీతి, నిజాయితీకి కట్టుబడి పనిచేయాలని డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. నాలుగు కోట్ల ప్రజలకు సేవ చేసేందుకు సుమారు 90 వేల మంది పోలీసులు ఉండగా.. ప్రతిరోజూ కనీసం 50 మంది కన్నీళ్లు తుడిచే అవకాశం పోలీస్ యూనిఫామ్‌కు ఉందని పేర్కొన్నారు.
ఈ మేరకు ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడటం ప్రధాన బాధ్యతగా గుర్తించాలని సూచించారు. రాజేంద్రనగర్‌లోని రాజా బహద్దూర్ వెంకటరామిరెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీలో సోమవారం జరిగిన మొదటి బ్యాచ్ డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ట్రైనింగ్ పూర్తి చేసుకున్న 38 మంది మహిళా డీఎస్పీలు సహా మొత్తం 112 మంది ప్రొబేషనరీ డీఎస్పీలకు దిశానిర్దేశం చేశారు. ట్రైనింగ్‌లో ఆల్‌రౌండర్‌గా నిలిచిన వరంగల్‌కు చెందిన నేహా అగర్వాల్ సహా ఇండోర్, అవుట్‌డోర్ ట్రైనింగ్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆరుగురికి ట్రోఫీలు అందించారు.
అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్‌తో కలిసి డీఎస్పీలకు పలు సూచనలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీజీపీఎస్సీ ద్వారా ఎంపికైన మొదటి డీఎస్పీ బ్యాచ్‌లో ఏకంగా 112 మంది ఎంపిక కావడం గర్వకారణమన్నారు.
నాయకత్వానికి పది లక్షణాలు
పోలీస్ యూనిఫామ్ ధరించే అవకాశం అందరికీ రాదని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. యూనిఫామ్ మర్యాద, గౌరవం, ప్రతిష్టలను ఎల్లప్పుడూ కాపాడాలని సూచించారు. రాజ్యాంగానికి విధేయులుగా ఉంటూ నిజాయితీగా, నిర్భయంగా, రాగద్వేషాలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తామని అందరూ ప్రమాణం చేశారని, ఇది జీవితాంతం మార్గదర్శకంగా ఉండాలని పేర్కొన్నారు.
నాయకత్వ లక్షణాలను విధుల్లో నిరూపించుకోవాలన్నారు. ధైర్యం, దార్శనికత, నైతిక విలువలు, నిష్పాక్షికత, బృంద స్ఫూర్తి, సంభాషణ నైపుణ్యాలు, కష్టపడే తత్వం, సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆలోచనలు, వినయం.. ఈ పది లక్షణాలను ప్రతి అధికారీ అలవర్చుకోవాలని సూచించారు.
విధుల నిర్వహణలో నైతిక విలువలను ఎట్టిపరిస్థితుల్లోనూ విస్మరించరాదని స్పష్టం చేశారు. సమస్యలకు కొత్త పద్ధతుల్లో పరిష్కారాలు కనుగొనాలని చెప్పారు. ప్రస్తుతం మాదకద్రవ్యాలు, సైబర్ క్రైమ్స్, ఆర్గనైజ్డ్ క్రైమ్స్ ప్రధాన సమస్యలుగా మారాయని తెలిపారు.
ట్రైనింగ్‌లోనే యూపీఎస్సీలో ర్యాంకులు..
గతంలో పోలీసు శాఖలో ఎస్సైలుగా పనిచేసిన నలుగురు ప్రస్తుతం డీఎస్పీలుగా ఎంపికయ్యారని అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్ అన్నారు. శిక్షణ పొందుతూనే 2026 యూపీఎస్సీ పరీక్షల్లో ప్రొబేషనరీ డీఎస్పీలు జి.సృజన 55వ ర్యాంకు, డి.ప్రవీణ్‌కుమార్ 795వ ర్యాంకు సాధించారని తెలిపారు. ఈ ఏడాది 112 సంఖ్యకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందన్నారు.
ఈ క్రమంలోనే 112 మంది డీఎస్పీలు ప్రజాసేవలోకి అడుగుపెట్టడం విశేషమన్నారు. వీరిలో 74 మంది పురుషులు, 38 మంది మహిళలు ఉన్నారని తెలిపారు. మల్టీజోన్-1 నుంచి 51 మంది, మల్టీజోన్-2 నుంచి 61 మంది ఎంపికయ్యారని తెలిపారు. ఈ బ్యాచ్‌లో గతంలో రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసినవారు 45 మంది, కేంద్ర ప్రభుత్వంలో పనిచేసినవారు 12 మంది ఉండగా.. 55 మంది కొత్తగా చేరుతున్నారని వివరించారు.
బాధితులకు అన్ని విధాలా సహకరిస్తా..
మాది ములుగు జిల్లా మల్లేపల్లి గ్రామం. అమ్మనాన్నలు చదువుకోలేదు, కానీ నన్ను బాగా చదివించారు. నేను చిన్నతనం నుంచి తెలుగు మీడియంలోనే చదువుకున్నాను. జీవితంలో విజయం సాధించాలనే పట్టుదల ఉండాలి.
కిరణ్ బేడీతో పాటు మరికొందరు మహిళా పోలీస్ అధికారులను స్ఫూర్తిగా తీసుకున్నాను. మొదటి ప్రయత్నంలోనే గ్రూప్-1లో మంచి ర్యాంక్ సాధించాను. అవుట్‌డోర్ ట్రైనింగ్‌లో అనేక విషయాలు నేర్చుకున్నాం. విధి నిర్వహణలో నా పరిధిని దాటి ఎలాంటి పనులూ చేయను. న్యాయం కోసం వచ్చే బాధితులకు అన్ని విధాలా సహకరిస్తాను.
- అల్లెపు మౌనిక, ప్రొబేషనరీ డీఎస్పీ-
