
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం అమలుపై జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే చేపట్టిన లక్ష ఇండ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. ఈ నేపథ్యంలో మరో లక్ష డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి స్థల సేకరణను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పురోగతిపై ఇంజినీర్లు, కాంట్రాక్టర్లతో మేయర్ బొంతు రామ్మోహన్ సమీక్ష చేశారు. ఇందులో కమిషనర్ ఎం.దానకిశోర్, చీఫ్ ఇంజినీర్ సురేష్ కుమార్ పాల్గొన్నారు.
స్థల సేకరణకు కలెక్టర్లకు లేఖలు
ఎన్నికలు ముగిసినందున డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని మేయర్ ఆదేశించారు. గ్రేటర్‌లో మొదటి దశలో చేపట్టిన ఇండ్లలో ఇప్పటికే పలు కాలనీల్లో నిర్మాణం పూర్తవగా, మిగిలిన వాటికి సంబంధించి గడువు పెట్టుకొని సకాలంలో కంప్లీట్ చేయాలని సూచించారు. రెండో దశలో కనీసం లక్ష డబుల్ బెడ్‌రూం ఇండ్లను కొత్తగా చేపట్టడానికి భూసేకరణకు సంబంధిత కలెక్టర్లను కోరాలని, అవసరమైతే రెండు లక్షల ఇండ్ల నిర్మాణాలకు స్థల సేకరణకు లేఖలు రాయాలని పేర్కొన్నారు.
త్వరలోనే ఉన్నతస్థాయి సమీక్ష
డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణంపై త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగే అవకాశం ఉందని వెల్లడించారు. వచ్చే నాలుగేళ్ల వరకు ఏవిధమైన ఎన్నికలు లేనందున డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణంతో పాటు అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పన, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగించనున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికే దాదాపు 10వేల ఇండ్లు పూర్తి అయినందున, వీటిని లబ్ధిదారులకు అందించేంత వరకు ఆయా కాలనీల భద్రతకు సెక్యూరిటీ కల్పించాలని, అవసరమైతే ప్రహరీలను నిర్మించాలని ఆదేశించారు.
వచ్చే 6 నుంచి 9 నెలలోపు మిగిలిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేయాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పలువురు కాంట్రాక్టర్లు లేవనెత్తిన సమస్యలను పరిష్కరించనున్నట్టు మేయర్ తెలిపారు. ముఖ్యంగా ఇసుక పంపిణీ సమస్యపై సిరిసిల్ల కలెక్టర్‌తో పాటు మైనింగ్ విభాగం డైరెక్టర్‌లతో మేయర్ ఫోన్ లో మాట్లాడి సమస్యకు పరిష్కారం సాధించారు.
బిల్లుల చెల్లింపులో జాప్యం లేదు : జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్
డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలకు బిల్లుల చెల్లింపులో జాప్యం లేకుండా వెంటనే చెల్లిస్తున్నట్టు కమిషనర్ ఎం.దానకిశోర్ స్పష్టం చేశారు. ఇప్పటికే రూ. 3,710 కోట్లను చెల్లించామని, మరో రూ. 190 కోట్లను చెల్లించ డానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికీ వివిధ కారణాలతో నిర్మాణం చేపట్టని 2,055 ఇండ్ల నిర్మాణాలకు కేటాయించిన స్థలాలకు ప్రత్యామ్నయంగా జవహర్‌నగర్, దుండిగల్, డి పోచంపల్లిలోని ఖాళీ స్థలాలను కేటాయించాల్సిందిగా సంబంధిత కలెక్టర్లను కోరామని తెలిపారు.
ఒక వెయ్యి కన్నా అధికంగా డబుల్ బెడ్‌రూం ఇండ్లు ఉన్న కాలనీల వద్ద తప్పనిసరిగా పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు విద్యాశాఖను కోరాలని సూచించారు. కొల్లూరు లాంటి మెగా హౌసింగ్ కాలనీ వద్ద ఉన్నత పాఠశాలతో పాటు కళాశాలలు కూడా ఏర్పాటు చేసేందుకు విద్యాశాఖను కోరనున్నట్టుపేర్కొన్నారు. ఈ డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ కాలనీల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, అప్రోచ్ రోడ్లు, ఇతర సదుపాయాల కల్పనకు తగు చర్యలు చేపట్టేందుకు చీఫ్ సెక్రటరీతో త్వరలో జరిగే సమీక్షలో స్పష్టమైన సూచనలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఫినిషింగ్ వర్క్ మినహా 45,000 పూర్తి
జీహెచ్ఎంసీ పరిధిలో తొలివిడత 108 సైట్లలో 97,915 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. వీటికి రూ.8,500 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. 44 సైట్లలో 9,188 కుటుంబాలను ఖాళీ చేయించి భూమి సేకరించారు. ఇందులో పదివేల ఇండ్లను పంపిణీ చేసేందుకు పూర్తిచేశారు. కాగా భూ వివాదాల కారణంగా 2,000 ఇండ్లు అసలు శంకుస్థాపన కూడా చేయలేదు. మిగిలిన వాటిని వచ్చే డిసెంబర్ నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తంగా 45,000 ఇండ్లు ఫినిషింగ్ వర్క్ మినహా దాదాపు పూర్తయ్యాయి. ఈ జూన్ నాటికి 90 వేల ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా వరుస ఎన్నికలతో ఆలస్యమైంది. ఇప్పటికే ఐడీహెచ్ కాలనీ, నాచారంలో 572 ఇండ్ల ను లబ్ధిదారులకు అందజేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు ఇండ్లను లబ్ధిదారులకు అందజేస్తారు.