ఫైనాన్స్​ ఫ్లోరు.. ‘ఫైవ్​స్టార్’ జోరు!

ఫైనాన్స్​ ఫ్లోరు.. ‘ఫైవ్​స్టార్’ జోరు!

హైదరాబాద్, వెలుగు:  బీఆర్కే భవన్ (తాత్కాలిక సెక్రటేరియెట్)లో ఆర్థిక శాఖ పేషీ రెనోవేషన్  పనులు భారీగా సాగుతున్నాయి. ఫైనాన్స్​ డిపార్ట్​మెంట్​ ఉన్న 8వ ఫ్లోర్  మిగతా ఫ్లోర్లతో పోలిస్తే చాలా రిచ్​గా తయారవుతోంది. ఈ శాఖలో ‘ఫైవ్​స్టార్’ స్థాయిలో భారీగా ఖర్చుపెట్టి రెనోవేషన్​ చేస్తున్నారని, మిగతా శాఖలకు మాత్రం వివక్ష చూపుతున్నారని సెక్రటేరియెట్​ ఉద్యోగులు అంటున్నారు. మాంద్యం కారణంగా ఖర్చులు తగ్గించుకోవాలని ఓ వైపు సీఎం కేసీఆర్  చెబుతున్నా అధికారులు భారీగా ఖర్చు పెడుతున్నారని విమర్శిస్తున్నారు. వాస్తవానికి పాత సెక్రటేరియెట్లోని ఫైనాన్స్​ డిపార్ట్​మెంట్​ను ఈ ఏడాది మొదట్లోనే రూ.10 కోట్ల ఖర్చుతో రెనోవేషన్​ చేయించారు. కొద్దినెలలకే దానిని ఖాళీ చేసి బీఆర్కే భవన్​కు రావడంతో ఆ సొమ్మంతా వృథా అయింది. ఇప్పుడు కూడా ఏడాదిన్నర, రెండేళ్ల పాటు మాత్రమే ఉండే చోట భారీ ఖర్చుతో రెనోవేషన్  చేయించాల్సిన అవసరం ఏమిటని ఇతర శాఖల ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. నిధులు విడుదల అధికారం వాళ్ల చేతిలో ఉందనే ఇలా దుబారా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ఆ శాఖకే ఎందుకు ప్రయారిటీ?

మిగతా శాఖల్లో ఉద్యోగులు, అధికారుల క్యాబిన్లు, ఫర్నీచర్  అంతా పాత సెక్రటేరియెట్ నుంచి తెచ్చిన దానినే వినియోగిస్తున్నట్టు ఉద్యోగులు చెబుతున్నారు. ఆర్థిక శాఖలో మాత్రం క్యాబిన్లు, ఫర్నీచర్  చాలా వరకు కొత్తదేనని తెలుస్తోంది. మిగతా పనులు కూడా చాలా రిచ్​గా ఉండేలా చేస్తున్నారని ఉద్యోగులు అంటున్నారు. ‘‘ఇతర శాఖల్లో రెనోవేషన్​ మామూలుగా చేస్తుంటే.. ఫైనాన్స్​ డిపార్ట్​మెంట్లో మాత్రం సాఫ్ట్ వేర్ కంపెనీలా ఆధునీకరిస్తున్నారు. మిగతా శాఖలు ఏదైనా అడిగితే నిధులు లేవంటున్నారు. చేస్తే అన్ని శాఖలను ఇదే విధంగా రెనోవేషన్ చేయాలి.  ఏడాదిన్నర కొనసాగే దానికి ఇంత ఖర్చు దేనికి? ఆర్థిక శాఖ తీరు సరికాదు” అని ఓ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ఉద్యోగ సంఘం నేత మాట్లాడుతూ.. ‘‘అన్ని శాఖలు సమానం కాదా? మిగతా శాఖల్లో మామూలుగా రెనోవేషన్ పనులు చేస్తున్నపుడు ఫైనాన్స్​ డిపార్ట్​మెంట్​కు ఎందుకన్ని హంగులు? ఇది నిధుల దుబారానే” అని పేర్కొన్నారు.