కళ్యాణమస్తుకు మరిన్ని ముహూర్తాలు

కళ్యాణమస్తుకు మరిన్ని ముహూర్తాలు
  • గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి
  • హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహక మండలి సమావేశం తీర్మానం

తిరుపతి:  గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహక మండలి తీర్మానించింది. కల్యాణమస్తు సామూహిక వివాహాలకు మరిన్ని ముహూర్తాలు నిర్ణయించాలని పండిత మండలిని కోరింది. తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో శుక్రవారం రాత్రి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. గుడికో గోమాత కార్యక్రమం దేశ వ్యాప్తంగా మరింత వేగంగా అమలు చేయడానికి మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ నుంచి 31 ఆలయాలు గోమాత కోసం దరఖాస్తు చేసుకున్నాయని అధికారులు వివరించారు. ఆలయాల్లో గోవు, దూడకు తగిన వసతి,వాటి పోషణకు అవసరమైన ఏర్పాట్లు పరిశీలించి 10 రోజుల్లో గోవులను అందించాలని అధికారులను ఆదేశించారు. పట్టణాల్లో వీధుల్లో తిరిగే గోవులను గోశాలలకు తరలించి అవసరమైతే వాటి పోషణకు టీటీడీ ద్వారా నిధులు ఇవ్వాలని నిర్ణయించారు. తెలుగు రాష్ట్రాల్లో ముందుగా కళ్యాణ మస్తు వివాహాలు నిర్వహించాలని నిర్ణయించారు.  టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, పాలకమండలి సభ్యులు రామేశ్వరరావు, శివకుమార్, డిపి అనంత,  గోవింద హరి, అదనపు ఈవో  ధర్మారెడ్డి, డిపిపి సభ్యులు పెంచులయ్య, సుబ్బారావు, డిపిపి కార్యదర్శి ఆచార్య రాజగోపాలన్, డిపిపి ప్రత్యేకాధికారి హేమంత్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని శనివారం జరిగే పాలక మండలి సమావేశంలో తీర్మానం చేస్తామని చెప్పారు. దీనివల్ల  గోవధను అరికట్టడానికి అవకాశం  ఏర్పడుతుందని అభిప్రాయ పడ్డారు.

ఇవి కూడా చదవండి

కిలో గన్ పౌడర్ 45 రూపాయలు

అలంపూర్ సరిహద్దులో పోలీసుల తనిఖీలు.. హైదరాబాద్ కారులో 30 లక్షలు పట్టివేత

క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ఎదుట హాజరుకానున్న హృతిక్

4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల