మంచి మాట: తస్మాత్ జాగ్రత్త ... పొగడ్తలకు పడిపోతే ఇల్లు గుల్లే..ఎలాగంటే..!

మంచి మాట: తస్మాత్ జాగ్రత్త ... పొగడ్తలకు పడిపోతే  ఇల్లు గుల్లే..ఎలాగంటే..!

పొగడ్తలు ప్రశంసలు.. పని మీద ఇంట్రస్ట్ కలిగిస్తాయి. కానీ ఓన్లీ పొగడ్తల్లో మునిగిపోతే.. మనమే మునిగిపోతాం. పొగడ్తలను ఎక్కడ వరకూ తీసుకోవాలో అనే విషయం మీకు తెలిసి ఉండాలి.  అలా కాకుండా పొగడ్తలకు పడిపోతే ఇల్లు గుల్లే అవుతుంది.

నువ్వు చాలా అందంగా ఉన్నావ్...... ఈ రోజు నీ డ్రెస్ చాలా బాగుంది. ... నీ టాలెంట్ నీకు తెలియదు... నిన్ను చేసుకున్నోడు చాలా సంతోషంగా ఉంటాడు ... ఇలా మాట్లాడటాన్నే 'బిస్కెట్ వేయటం' అంటున్నారు. దీన్నే పొగడ్త అని కూడా అంటారు. 

పొగడ్త మనిషిని ఎంతో ఎత్తుకు ఎదిగేలా చేస్తుంది. అదే పొగడ్త అధఃపాతాళానికి తోసేయనూవచ్చు. అందుకే పొగడ్తలకు పొంగిపోతే ఇల్లు గుల్లవుతుంది. తలకు మించిన భారాన్ని నెత్తికెత్తుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎదుటి వాళ్లు ఎందుకు పొగుడుతున్నారోతెలుసుకోవాలి. పొగడ్తలను, అబద్ధాలను నమ్మి మోసపోతున్న అమ్మాయిలు రోజురోజుకు ఎక్కువై పోతున్నారు.

 డబ్బు, ఆస్తి, కారు, గిఫ్ట్లు చూపించి యువతులను లోబరుచుకునే వాళ్ల మాటలు నిజమనుకుంటే అంతే...! ప్రేమ పేరుతో రంగుల ప్రపంచాన్ని చూపి, తీరా పెళ్లి అనేసరికి తప్పించుకుంటున్న అబ్బాయిలను నమ్మితే కష్టాలు కొని తెచ్చుకున్నట్లే..!

ఆనాటి శకుంతల

మహాభారతంలో శకుంతల దుష్యంతుడి పొగడ్తలు నమ్మి, తండ్రికి కూడా తెలియకుండా వివాహం చేసుకుంటుంది.

ఈ వల్కలాజినములకు...  నీ వన్యఫలాశనముల కీ విటపకుటీరావాసములకు నుచితమె!
 నీ విలసిత రూపకాంతి నిర్మలగుణముల్.
 ఈ మునిపల్లె నుండుటిది యేల కరం బనురాగమొప్పఁగా
భామిని నాకు భార్య వయి భాసురలీల నశేషరాజ్య లక్ష్మీ మహనీయ సౌఖ్యముల మేలుగ నందు మనిందితేందుపా
దామలతుంగహర్మ్యముల హరిహిరణ్మయకుట్టిమంబులన్ అని దుష్యంతుడు శకుంతలను పొగుడుతాడు.

వేటకై వెళ్లిన దుష్యంతుడు కణ్వముని ఆశ్రమానికి వెళ్తాడు. శకుంతలను చూసి ఆమె అందానికి ఫిదా అయిపోతాడు. ఎలాగైనా ఆమెను పొందాలని నిర్ణయించుకుంటాడు. ముందుగా ఆమె అందాన్ని పొగడటం మొదలు పెడతాడు."నీ రూపం, శరీరం, నీ గుణాలు నారచీరలు కట్టుకోవడానికి సరైనవి కావు. అడవి పళ్లు తింటూ ఆకుల ఇంట్లో ఉండటం నీలాంటి అందగత్తెలకు తగదు" అని ఆమె రూపాన్ని పొగిడి, ఆమె ఉన్న పరిస్థితులు అందుకు తగ్గవి కావని చెప్తాడు. తర్వాత తనతో ఉండటం వల్ల కలిగే సుఖాల గురించి వివరిస్తాడు.

"ఇలాంటి మునుల ఆశ్రమంలో నువ్వు ఉండటం దేనికి? నాకు భార్యవయితే, నీకు అపారమైన రాజ్య సంపద వస్తుంది. సుఖాలు అనుభవించొచ్చు. చంద్రకిరణాల్లాంటి మేడలు, బంగారు కట్టడాల్లో సుఖపడొచ్చు' అని ఆశలు కల్పిస్తాడు. ఆ పొగడ్తలకు లొంగుతుంది శకుంతల. అంతే... తండ్రి అయిన కణ్యుడు రాకముందే, పెద్దలు ఎవరూ లేకుండానే దుష్యంతుడిని గాంధర్వవివాహం (ఇతరులు ఎవ్వరికీ తెలియకుండా, సొంత నిర్ణయంతో చేసుకునే పెళ్లి) చేసుకుంటుంది. దాంతో అనేక కష్టాలు అనుభవించింది.

మాయను గుర్తించాలి

శకుంతల లాగానే ఇతరులు గుర్తించి, పొగడాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. మరింత ఇష్టపడాలని మనుసూ కోరుకుంటుంది. జీవితాన్ని సుఖంగా, సంతోషంగా గడపాలనుకోవటంలో తప్పు లేదు. అలాగని ఎదుటి వాళ్ల మాటల్లోని మాయను గుర్తించకపోతే కష్టం. పొగడ్తల్లోని నిజాల్ని గ్రహించాలి. ముఖ్యంగా నేటికాలం అమ్మాయిలు ప్రేమ, పెళ్లి, డబ్బు, అధికారం పేరుతో మాయమాటలు చెప్పే వారితో జాగ్రత్తగా ఉండాలి. . . 

ఎంత గొప్ప రాజు అయినా.. పొగడ్తలకు పడిపోతాడు. దిల్లీకి రాజైనా.. మీరు తోపు అంటే.. లోపల ఏదో తెలియని ఆనందం. కానీ పొగిడే వాళ్లందరూ.. మన మంచి కోరుకోరు. కొందరు మన నాశనాన్ని కూడా కోరుకుంటారు. అందుకే పొగడ్తలకు పడిపోకూడదు. విమర్శలను కూడా సరిగా తీసుకోవాలి. మిమ్మల్ని పొగిడేవారికంటే.. విమర్శించే వారితోనే మీకు లాభాలు ఎక్కువ.

జీవితంలో పొగడ్తలను అందరూ ఇష్టపడతారు. ఏదో పైకి మాత్రం.. నో.. నో నేను అస్సలు పడిపోను అని చెబుతారు. కానీ తమని పది మంది మెచ్చుకోవాలని అందరికీ ఉంటుంది. కొంతమంది తమను అందరూ పొగడాలని.. చూస్తారు. కొంతమంది.. తమ చుట్టూ పొగిడేవారిని చేర్చుకుంటారు. ఇక వాళ్లు ఎప్పుడూ భజన చేస్తూనే ఉంటారు. అయితే కొన్నిసార్లు పొగడ్తలు మిమ్మల్ని మంచి పనులు చేసేలా చేస్తాయి. మరికొన్ని సార్లు మిమ్మల్ని ముంచేస్తాయి.