చెడుకే ఎక్కువ ప్రచారం!

చెడుకే ఎక్కువ ప్రచారం!

‘‘ వ్యక్తి మంచితనం వ్యాపించడానికి పట్టేకాలం.. చెడు వ్యాపించడానికి పట్టదు. దుర్గంధం పాకినంత దూరాలకు జోరుగా సుగంధం వ్యాపించదు! దీన్ని బట్టి తెలుస్తుంది కదా – చెడును గుర్తించినంత చురుగ్గా మంచిపనులను గమనించడానికి యత్నం చేసే దృష్టి లోకానికి లేదని. అందుకే ఎంతటి గుణసంపన్నులయినా ఏదో ఓ చెడు పనిచేస్తే కానీ, పదిమంది నోళ్లలో పడరు. ఎప్పుడూ చెడు పనులే చేసేవాళ్లు ఒక్క మంచిపని చేసినా చాలు. కానీ, ఎప్పుడూ మంచిగా ఉండేవాళ్లు ఒక్కసారి కాలు జారారో... లోకం అదేపనిగా టాం.. టాం.. వేస్తుంది. నాటివరకు ఎంతో మంచిగా ఉండే ఇద్దరు ముగ్గురు కూడా ఆనాటి నుండి అదోలా చూస్తారు. ఇన్నాళ్లూ ఇంత మంచి ప్రదర్శించడానికి ఇదే కారణమంటారు కూడా..” అంటారు ఉషశ్రీ ‘పెళ్లాడే బొమ్మా!’ నవలా లేఖావళిలో.


ఇది ఎంత సత్యమో అందరికీ ఆచరణలో తెలిసినదే. రామాయణంలో శ్రీరామచంద్రుడు ఎంత ధర్మనిరతుడో వాల్మీకి రామాయణం చెప్తుంది. ఆ రామచంద్రుడిని పొగిడిన కవిసమ్రాట్‌‌‌‌‌‌‌‌ విశ్వనాథ సత్యనారాయణ కంటే, శ్రీరాముడిని అతిగా నిందించినవారికే పేరుప్రఖ్యాతులు వచ్చాయి. సాక్షాత్తు హనుమంతుడు సీతమ్మను వెదుకుతూ లంకా నగరానికి వెళ్లిన సందర్భంలో, తనను రావణుడు గుర్తించాలనుకున్నాడు. ఏదైనా చెడ్డ పని చేస్తే అందరి దృష్టి తన వైపుకి మళ్లి, తనను రావణుడి దగ్గరకు తీసుకెళ్తారని అర్థం చేసుకుని, లంకా నగరాన్ని నాశనం చేయటం మొదలుపెట్టాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న రావణుడు.. తన భటులను పిలిచి, నగరాన్ని ధ్వంసం చేస్తున్న వానరాన్ని పట్టి బంధించి తీసుకురమ్మన్నాడు. ఆ విధంగా హనుమంతుడు రావణుని సభలోకి ప్రవేశించి, తన పని ముగించుకున్నాడు. రావణుడితో జరిపిన రాయబారం కంటే, లంకా నగరాన్ని విధ్వంసం చేయటం, అశోకవనాన్ని ధ్వంసం చేయటమే అందరికీ తెలుసు.


మహాభారతం విషయానికి వస్తే 


మహాభారతంలో ద్రోణాచార్యుడు అర్జునుడిలోని ఏకాగ్రతను గ్రహించి, తన విద్యనంతా అర్జునుడికి ధారపోశాడు. తన సొంత కొడుకు అశ్వత్థామకు కూడా చెప్పని ఎన్నో విద్యలు నేర్పాడు. అతడిని మేటి విలుకానిగా తీర్చిదిద్దాడు. కురుక్షేత్ర యుద్ధ సమయంలో, ‘అర్జునా! ఈ యుద్ధాన్ని నువ్వు ఎన్ని రోజుల్లో ముగించగలవు’ అని ధర్మరాజు అడిగితే, ‘అన్నయ్యా! ఒక్కరోజులో సర్వనాశనం చేయగల పాశుపతాస్త్రం నా దగ్గర ఉంది. కానీ, దానిని మానవ వినాశనానికి ఉపయోగించకూడదు. నేను ఈ యుద్ధాన్ని నెల రోజులలో ముగిస్తా’ అన్నాడు. విద్యను సద్వినియోగం చేసుకున్నాడు అర్జునుడు. అదే ఏకలవ్యుడు తన విద్యను దుర్వినియోగం చేయటం చూసిన ద్రోణుడి గురు హృదయం బాధపడింది. తన విద్యతో అడవిలో ఉన్న మృగాలకి అకారణంగా హాని చేయడం చూసాడు ద్రోణుడు. అందుకే ఏకలవ్యుని చేతి బొటనవేలుని గురుదక్షిణగా అడిగి, ఏకలవ్యుడి వల్ల ఎవ్వరికీ అపకారం జరగకుండా జాగ్రత్తపడ్డాడు. కానీ, ద్రోణుడు చేసిన మంచిని గుర్తించకుండా, ఏకలవ్యుడి పట్ల వివక్ష చూపాడనే విష ప్రచారం జరిగింది. (నేటికి కూడా గన్ లైసెన్స్ అందరికీ అందుకే ఇవ్వరు అని మనం గుర్తించాలి)
నంబినారాయణన్‌‌‌‌‌‌‌‌ విషయంలో కూడా ఇలాగే జరిగింది. పి. ఎస్‌‌‌‌‌‌‌‌. ఎల్‌‌‌‌‌‌‌‌. వి., జి.ఎస్‌‌‌‌‌‌‌‌.ఎల్‌‌‌‌‌‌‌‌.వి. బృందానికి నాయకత్వం వహించాడు. లిక్విడ్‌‌‌‌‌‌‌‌ ప్రొపెల్లంట్‌‌‌‌‌‌‌‌లను ఉపయోగించి మొదటిసారిగా అధిక సామర్థ్యం గల సంక్లిష్టమైన రాకెట్‌‌‌‌‌‌‌‌ దశలను ప్రదర్శించిన ఒక గ్రూప్​కి అతను నాయకత్వం వహించాడు. ద్రవ  ఇంధనసాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో నంబి నారాయణన్‌‌‌‌‌‌‌‌ అగ్రగామిగా నిలిచాడు. అతి తక్కువ ఖర్చుతో రాకెట్ లాంచ్ చేసి ప్రపంచాన్ని అబ్బురపరిచాడు. భారతదేశానికి ఇంత మంచి పేరు తీసుకొచ్చిన విషయం చాలామందికి తెలియదు. కానీ, అదే నంబి నారాయణన్‌‌‌‌‌‌‌‌ మీద గూఢచర్య ఆరోపణలు వచ్చినప్పుడు ఆ వార్తలో అసత్యం ఉన్నప్పటికీ దావానలంలా  ప్రపంచమంతా వ్యాపించింది. అతనికి శిక్ష విధించారు. నిజం తెలిసిన తర్వాత విడుదల చేశారు. చెడుకి జరిగినంత ప్రచారం, మంచికి జరగకపోవటమనేది మానవ సహజమైన నైజం. మనలో లేని మంచి గుణాలు, ఇతరులలో ఉంటే సహించలేము. అదే దుర్గుణాలు ఉంటే, చాలా సంతోషంగా అందరికీ చెప్పి ఆనందపడుతూ ఉంటాం. అదే మానవ నైజం.


డా. వైజయంతి పురాణపండ 
ఫోన్: 80085 51232