
- రెగ్యులర్ రిక్రూట్ మెంట్ల ఊసెత్తని సర్కార్
- ఏండ్లుగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ తోనే ఎల్లదీత
- మెడికల్ రిక్రూట్‌మెంట్లకు ఇక బోర్డు ఎందుకంటున్న హెల్త్ స్టాఫ్
నర్సుల పట్ల సర్కార్ వివక్ష
నర్సింగ్ పోస్టుల భర్తీకి ఈ ఏడేండ్లలో ఒకే ఒక్క రెగ్యులర్ నోటిఫికేషన్ ఇచ్చారు. 3,311 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి అర్హులు లేరన్న సాకుతో అందులో 893 పోస్టులు రిక్రూట్ చేయకుండా ఖాళీగా ఉంచారు. ప్రస్తుతం ఖాళీలు 5 వేలకు పైనే ఉన్నాయి. కరోనా వచ్చినప్పటి నుంచి ఔట్‌సోర్సింగ్ నోటిఫికేషన్లే ఇస్తున్నారు. డాక్టర్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. నర్సుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వివక్ష దారుణం.
‑ కురుమెటి గోవర్ధన్, ఫౌండర్ ప్రెసిడెంట్, తెలంగాణ నర్సింగ్ సమితి
హైదరాబాద్, వెలుగు: ఆరోగ్యశాఖలో ఖాళీల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నా రిక్రూట్‌మెంట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రస్ట్ చూపించడం లేదు. గవర్నమెంట్ దవాఖాన్లు, మెడికల్ కాలేజీల్లో వేల సంఖ్యలో ఖాళీ పోస్టులు ఉన్నా రెగ్యులర్ బేసిస్‌పై రిక్రూట్ చేయడం లేదు. సరైన వైద్యం అందక రోగులు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోవడం లేదు. డెంగీ, కరోనా వంటివి వచ్చినప్పుడు నర్సులు, డాక్టర్లకు టెంపరరీగా ఉద్యోగాలు ఇస్తున్న సర్కారు.. అవసరం తీరాక వాళ్లను రోడ్డున పడేస్తున్నది. హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో 10 వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని రెండేండ్ల కింద అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వమే
వెల్లడించింది. ఇందులో 2,407 డాక్టర్ పోస్టులు, 7,647 పారామెడికల్ పోస్టులు ఉన్నట్టు చెప్పింది. ఇప్పుడీ సంఖ్య మరింతగా పెరిగింది. అన్ని హాస్పిటళ్లలో కలిపి 3,766 డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ఈ ఏడాది జూన్‌లో రాష్ట్ర సర్కార్‌కు ఇచ్చిన నివేదికలో హెల్త్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. ఇటీవల కొత్తగా 8 కాలేజీల్లో సుమారు 350 డాక్టర్ పోస్టులు మంజూరయ్యాయి. ఇవి కూడా కలిపితే ఖాళీల సంఖ్య 4 వేలు దాటుతుంది. కొత్త మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్ల అప్‌గ్రెడేషన్, బెడ్ల సంఖ్య పెంపుతో నర్సింగ్, ఇతర పారామెడికల్ స్టాఫ్ అవసరం కూడా విపరీతంగా పెరిగింది.
(మొదటిపేజీ తరువాయి)
ఇవి కూడా కలిపితే ఖాళీల సంఖ్య 4 వేలు దాటుతుంది. కొత్త మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్ల అప్‌గ్రెడేషన్, బెడ్ల సంఖ్య పెంపుతో నర్సింగ్, ఇతర పారామెడికల్ స్టాఫ్ అవసరం కూడా విపరీతంగా పెరిగింది. కానీ, ఈ రెండేండ్లలో పారామెడికల్ రెగ్యులర్ రిక్రూట్‌మెంట్‌కు కనీసం ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. చివరిగా 2017లో 4,441 పారామెడికల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి, ఇప్పటివరకూ అందులో 2,418 పోస్టులను మాత్రమే భర్తీ చేశారు. ఇవి తీసేసినా పారామెడికల్ పోస్టులే ఇంకో 5,229 ఖాళీగా ఉంటాయి. కొత్త ఖాళీలు కలిపితే ఈ సంఖ్య 8 వేలకు చేరుతుందని చెప్తున్నారు.
కాంట్రాక్టు పద్ధతిలోనే తీస్కుంటున్నరు
డాక్టర్ల ఖాళీలు, పారామెడికల్ ఖాళీల సంఖ్య పెరగడంతో ఉన్నవాళ్లపై ఒత్తిడి పెరిగింది. దీంతో డాక్టర్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో, పారామెడికల్ పోస్టులను ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్ చేయడం ప్రారంభించారు. రాష్ట్రం వచ్చాక కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వ్యవస్థ ఉండదని చెప్పిన కేసీఆర్, చివరకు మెడికల్ ప్రొఫెసర్ల భర్తీనీ కాంట్రాక్ట్ మయం చేశారు. ఇటీవల ఏర్పడిన కొత్త మెడికల్ కాలేజీలకు కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రొఫెసర్ల రిక్రూట్‌మెంట్‌కు నోటిఫికేషన్ జారీ చేశారు. ఇలా టెంపరరీ రిక్రూట్‌మెంట్లతో భవిష్యత్‌లో ఇబ్బందులు వస్తాయని హెల్త్ ఆఫీసర్లు హెచ్చరిస్తున్నా సర్కార్ లెక్క చేయడం లేదు. టెంపరరీ బేసిస్ లో సర్కార్ దవాఖాన్లలో పనిచేసేందుకు డాక్టర్లు కూడా ఇంట్రస్ట్ చూపించడం లేదు. ఇటీవల పల్లె దవాఖాన్ల కోసం నోటిఫికేషన్ ఇస్తే, కనీసం 80% పోస్టులకు కూడా అప్లికేషన్లు రాలేదు. మెడికల్ ప్రొఫెసర్ పోస్టుల పరిస్థితి కూడా అలాగే ఉన్నట్టు చెబుతున్నారు. తెలంగాణ వాళ్లు దొరక్కపోతే ఇతర రాష్ట్రాల వాళ్లను రప్పించాలనీ ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొంటున్నారు.
రిక్రూట్ మెంట్ బోర్డు ఎందుకు
డాక్టర్, పారామెడికల్ పోస్టులను రెగ్యులర్ పద్ధతిలో భర్తీకి టైమ్ పడుతుందని, అందుకే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్ చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ, హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో రిక్రూట్‌మెంట్లు స్పీడ్‌గా చేసేందుకు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కూడా ఉంది. మూడేండ్ల కిందటే దీన్ని ఏర్పాటు చేసినా, రిక్రూట్‌మెంట్లు చేసేందుకు మాత్రం చాన్స్ ఇవ్వలేదు. అలాంటప్పుడు బోర్డు పెట్టి ఉపయోగం ఏంటని డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ నియామకాల బాధ్యతలు కూడా జిల్లా కలెక్టర్లు, డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్లకే ఇస్తున్నారు. బోర్డు ద్వారా రెగ్యులర్ బేసిస్‌పై రిక్రూట్‌మెంట్లకు అవకాశం ఉన్నా, టెంపరరీ నియామకాలకే సర్కార్ మొగ్గు చూపడంపై డాక్టర్లు, నర్సులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.