
- మాదాపూర్ లో బోర్డు తిప్పేసిన కంపెనీ
- పోలీసులను ఆశ్రయించిన 23 మంది బాధితులు
- ఇద్దరు డైరెక్టర్లు అరెస్ట్.. పరారీలో మరొకరు
మాదాపూర్, వెలుగు : సమతామూర్తి చిట్ ఫండ్ పేరుతో ఓ కంపెనీ జనాల నుంచి చిట్టీలు కట్టించుకొని బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు మాదాపూర్ పోలీసులను ఆశ్రయించారు. కేసు ఫైల్ చేసి ఇద్దరు డైరెక్టర్లను అరెస్ట్ చేశారు. మరో డైరెక్టర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం మాదాపూర్ ఇన్ స్పెక్టర్ గడ్డం మల్లేశ్తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకు 23 మంది బాధితులను గుర్తించామన్నారు. 130 మంది వరకు బాధితులు ఉండొచ్చన్నారు. మొత్తం రూ.2 కోట్ల వరకు చిట్టీల బిజినెస్ పేరుతో చీటింగ్ జరిగినట్లు గుర్తించామన్నారు.
బయటపడింది ఇలా..
బడంగ్ పేటకు చెందిన ఉషాలక్ష్మి ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ లో జూనియర్ అసిస్టెంట్. గతేడాది జులైలో ఆమె ఆఫీసులో ఉండగా క్రిస్టినా అనే మహిళ మరో వ్యక్తితో కలిసి ఉషాలక్ష్మిని సంప్రదించింది. తాము సమతామూర్తి చిట్ ఫండ్ కంపెనీకి చెందిన వాళ్లమని చెప్పింది. కొత్త చిట్టీ మొదలుపెడుతున్నామని.. మీరు కూడా వేయాలని అడిగింది. వారి మాటలు నమ్మిన ఉషాలక్ష్మి.. తన చెల్లి పెండ్లి కోసం రూ.25 లక్షలు చిట్టీ వేసేందుకు ఒప్పుకుంది. మూడో నెలలోనే చిట్టీ లిఫ్ట్ చేసుకోవచ్చని.. డబ్బులు ఇస్తామని సదరు కంపెనీ ప్రతినిధులు ఉషాలక్ష్మిని నమ్మించారు.
దీంతో ఆమె గతేడాది సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్.. మూడు నెలల పాటు చిట్టీ డబ్బులు రూ.లక్షా 15 వేలు గూగుల్ పే ద్వారా చెల్లించింది. మూడో నెల దాటినా పైసలు ఇవ్వకపోగా ఉషాలక్ష్మి.. క్రిస్టినాను అడిగింది. తనకు హెల్త్ ప్రాబ్లమ్ ఉందని.. మాదాపూర్ లోని తమ ఆఫీసుకు వెళ్లి డైరెక్టర్ గణేశ్‌ను కలవాలని క్రిస్టినా ఆమెకు చెప్పింది. ఉషాలక్ష్మి మాదాపూర్ లోని ఆఫీసుకు వెళ్లి గణేశ్‌ను కలిసింది. లిఫ్ట్ చేసిన చిట్టీ పైసలు ఇవ్వాలంటే డిసెంబర్ నెల కూడా ఇన్ స్టాల్ మెంట్ కట్టాలని ఆమెకు చెప్పాడు. దీంతో ఆమె గణేశ్‌కు గూగుల్ పే ద్వారా రూ.50 వేలు పంపింది.
వారం రోజుల్లో చిట్టీ డబ్బులు ఇస్తానని అతడు చెప్పాడు. ఈలోగా తమ ఏజెంట్ మీ ఇంటికి వచ్చి ఎంక్వయిరీ చేస్తాడని చెప్పాడు. డిసెంబర్ 26న ఉషాలక్ష్మి ఇంటికి ఓ ఏజెంట్ వచ్చాడు. ఆమెతో బ్లాంక్ చెక్ మీద సంతకం చేయించుకొని వెళ్లిపోయాడు. ఆ తర్వాత నుంచి క్రిస్టినా, గణేశ్ తో పాటు ఏజెంట్ కు ఎన్నిసార్లు కాల్ చేసినా రెస్పాన్స్ లేకపోవడంతో ఉషాలక్ష్మి మాదాపూర్ లోని చిట్ ఫండ్ ఆఫీసు వద్దకు వచ్చింది. అక్కడ ఎలాంటి ఆఫీసు లేకపోవడంతో ఆ కంపెనీ బోర్డు తిప్పేసినట్లు గుర్తించింది. మోసపోయినట్లు తెలుసుకుని గత నెల 13న మాదాపూర్ పీఎస్ లో కంప్లయింట్ చేసింది. పోలీసులు 420,406 సెక్షన్ల కింద కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.
చిన జీయర్ స్వామికి చెందిన కంపెనీ అంటూ..
మంచిర్యాలకు చెందిన తండ్రీకొడుకులు ఈ. శ్రీనివాస్(47), రాకేష్ వర్మ(27) ఉప్పల్‌లో ఉంటూ గణేశ్ అనే మరో వ్యక్తితో కలిసి మాదాపూర్‌లో సమతామూర్తి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీ ప్రారంభించారు. రూ. లక్ష నుంచి రూ. కోటి వరకు చిట్టీల పేరుతో బిజినెస్ స్టార్ట్ చేశారు. 40 మంది స్టాఫ్‌ను పెట్టుకున్నారు. టెలీ కాలర్ల ద్వారా జనాలకు కాల్స్చేయిస్తూ తమ కంపెనీలో చిట్టీలు కట్టాలని చెప్పించారు. తమ కంపెనీ చిన జీయర్‌స్వామికి సంబంధించినదని.. చిట్టీలు కట్టేందుకు వచ్చిన వారికి చెప్పి నమ్మించారు. అందుకే సమతామూర్తి చిట్‌ఫండ్ అని పేరు పెట్టినట్లు చెప్పారు.
మాదాపూర్ తో పాటు ఎల్ బీనగర్, కూకట్ పల్లిలోనూ బ్రాంచ్ లు తెరిచారు. ఒక్కో వ్యక్తి నుంచి రూ.5 లక్షలు, రూ.10 లక్షలు, రూ.25 లక్షలు వరకు చిట్టీలు కట్టించుకున్నారు. మూడు, నాలుగు నెలల తర్వాత చిట్టీ డబ్బులు ఇస్తామని చెప్పి బ్లాంక్ చెక్కులు అందించారు. ఈ కంపెనీలో చిట్టీలు వేసిన వారిలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, సాఫ్ట్ వేర్ ఎంప్లాయీస్ సైతం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చిట్టీ డబ్బులు ఇవ్వకపోగా మాదాపూర్ లోని సమతామూర్తి చిట్ ఫండ్ కంపెనీ బ్రాంచ్ కు బాధితులు వెళ్లారు. అప్పటికే కంపెనీ బోర్డు తిప్పేయగా పీఎస్ కు క్యూ కట్టారు.
ఇప్పటివరకు 23 మంది బాధితులు పీఎస్ కు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు 130 మందిని చీటింగ్ చేసినట్లు గుర్తించారు. రూ.2 కోట్లకుపైగా వసూలు చేసినట్లు తెలిపారు. బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఇన్ స్పెక్టర్ మల్లేశ్తెలిపారు. ఈ కేసును సైబరాబాద్ ఎకనమిక్ అఫెన్స్ వింగ్ కు అప్పగించేందుకు మాదాపూర్ పోలీసులు ఉన్నతాధికారులను సంప్రదించారు.
సీపీని కలిసిన బాధితులు
భారీ చిట్ ఫండ్ స్కామ్ పై గత నెల 13న మాదాపూర్ పోలీసులకు కంప్లయింట్ చేసినా చర్యలు తీసుకోలేదంటూ ఈ నెల 5న తొమ్మిది మంది బాధితులు సైబరాబాద్ సీపీ అవినాష్మహంతిని కలిసి ఫిర్యాదు చేశారు. అదే రోజు రాత్రి మాదాపూర్పోలీసులు చిట్‌ఫండ్ కంపెనీ డైరెక్టర్లుగా ఉన్న తండ్రీ కొడుకు శ్రీనివాస్, రాకేష్ వర్మను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. మరో డైరెక్టగర్ గణేశ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.