
- ఐదేళ్లుగా 4.34 లక్షల రేషన్ దరఖాస్తులు పెండింగ్
- రాష్ట్ర ఏర్పాటు తర్వాత అప్రూవ్ చేసినవి 3.59 లక్షలే
- రేషన్ కోసం ఎదురుచూస్తున్నలక్షలాది కుటుంబాలు
- రాష్ట్రవ్యాప్తంగా కార్డులు లేకుండానే రేషన్ పంపిణీ
కొత్త రేషన్ కార్డుల కోసం జనం ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు నాలుగు లక్షలకు పైగా రేషన్ కార్డుల అప్లికేషన్లు పెండింగ్‌లో ఉండిపోయాయి. ఎప్పుడు కార్డు వస్తుందా?.. రేషన్ ఎప్పుడు తీసుకుందామా? అని లక్షలాది కుటుంబాలు ఆశగా చూస్తున్నాయి. గ్రామాలు, పట్టణాల్లో ఉమ్మడి కుటుంబాల్లో పెళ్లిళ్లు అయి వేరు కాపురాలు పెట్టినవారు రేషన్ కార్డు రాక.. సరుకులు అందక ఇబ్బందులు పడుతున్నారు. దరఖాస్తు చేసుకున్న వారందరికీ కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలని, కొత్తగా ఆహార భద్రత కార్డులను పంపిణీ చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
8 లక్షల వరకూ అప్లికేషన్లు
రాష్ట్రంలో నూతన కార్డుల కోసం మీసేవ కేంద్రాలు, పౌరసరఫరాల శాఖ కార్యాలయాల్లో 2014 జూన్ 2 నుంచి ఇప్పటి వరకు 7,94,129 మంది నమోదు చేసుకున్నారు. వీరిలో 3,59,870 రేషన్ కార్డులకు సంబంధించి అప్రూవల్ లభించింది. మిగతా 4,34,259 దరఖాస్తులు పౌరసరఫరాల శాఖ కార్యాలయాలు, డీఎస్‌వో కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్నాయి. హైదరాబాద్ పరిధిలో 1,39,716 దరఖాస్తులు రాగా.. 44,715 మందికే రేషన్ అప్రూవల్ లభించింది.
ఐదేళ్లుగా రేషన్ కార్డులే లేవు
రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా 17 వేల రేషన్ షాపుల్లో 87.98 లక్షల కార్డులతో 2.75 కోట్ల మంది లబ్ధిదారులు రేషన్ పొందుతున్నారు. అయితే వీరందరికీ ప్రత్యేకమైన కార్డులు లేవు. దీంతో నెలనెలా రేషన్ తీసుకునేందుకు వీరంతా ఇబ్బందులు పడతున్నారు. మీసేవ కేంద్రాలకు వెళ్లి ఆహార భద్రత కార్డు జిరాక్స్ కాపీ తీసుకువస్తేనే రేషన్ డీలర్లు సరుకులు ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు అసలు రేషన్ కార్డులే ఇవ్వలేదు. రేషన్ కార్డును రేషన్‌కు మాత్రమే వినియోగించేలా చేస్తామని మొదట చెప్పిన ప్రభుత్వం.. ఆ తర్వాత అసలు కార్డులే అక్కర్లేదన్నట్లు వ్యవహరిస్తోంది. కార్డులను రూపొందించాలనే ఆలోచననే విస్మరించింది.