ట్రాఫిక్ చలాన్లతో 46 రోజుల్లో 300 కోట్లు

ట్రాఫిక్ చలాన్లతో 46 రోజుల్లో 300 కోట్లు
  • పెండింగ్‌‌లో మరో 30 శాతం
  • ఇక పట్టుబడితే మొత్తం ఫైన్‌‌ చెల్లించాల్సిందే

హైదరాబాద్‌‌, వెలుగు: ట్రాఫిక్‌‌ పెండింగ్ చలాన్ల డిస్కౌంట్‌‌ ఆఫర్‌‌ ‌‌ముగిసింది. మార్చి1న ప్రారంభమైన ఆఫర్‌‌ శుక్రవారం అర్ధరాత్రితో కంప్లీట్‌‌ అయ్యింది. 46 రోజుల పాటు నిర్వహించిన స్పెషల్‌‌ డ్రైవ్‌‌లో రూ.300 కోట్లకు పైగా వసూలు అయ్యాయి. సుమారు 2.92 కోట్ల చలాన్లు క్లియర్ అయ్యాయి. మరో 30 శాతం చలాన్లు పెండింగ్‌‌లో ఉన్నాయి. శనివారం నుంచి ఈ–చలాన్‌‌ సైట్‌‌ అప్‌‌డేట్‌‌ కానుంది. ఆఫర్‌‌ ట్యాగ్‌‌లైన్‌‌ తీసేసి ఫుల్‌‌ ఫైన్ అమౌంట్‌‌ను అప్‌‌డేట్‌‌ చేయనున్నారు. క్లియర్‌‌‌‌ అయిన చలాన్లు, వసూలైన జరిమానా మొత్తానికి సంబంధించిన డేటాను ఆఫీసర్లు రెడీ చేస్తున్నారు. పెండింగ్‌‌ కేసుల వివరాలు రెండ్రోజుల్లో వెల్లడించనున్నారు.

ట్రాఫిక్‌‌ వింగ్‌‌కి రూ.30 కోట్లు

2018 నుంచి గతేడాది వరకు మొత్తం 6.18 కోట్లకు పైగా ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌‌లో ఉండేవి. వీటికి సంబంధించి రూ.1,550 కోట్లు వసూలు కావాల్సి ఉంది. దీంతో పాటు ఈ ఏడాది కూడా చలాన్లు భారీగా పెరిగిపోయాయి. వీటిని తగ్గించేందుకు‌‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో యాక్షన్ ప్లాన్ రూపొందించారు. ట్రాఫిక్ చీఫ్‌‌ ఏవీ రంగనాథ్‌‌ను నోడల్ ఆఫీసర్‌‌‌‌గా నియమించారు. బైక్స్, ఆటోలకు 75 శాతం, ఆర్టీసీ బస్సులకు 70 శాతం, కార్లు, లైట్ మోటార్ వెహికల్స్‌‌కు 50 శాతం, తోపుడు బండ్లకు 80 శాతం డిస్కౌంట్‌‌ ఇచ్చారు. మొదట్లో మార్చి 31 వరకు లాస్ట్‌‌ డేట్‌‌ పెట్టారు. వాహనదారుల నుంచి విశేష స్పందన రావడంతో మరో 15 రోజుల పాటు ఆఫర్‌‌‌‌ పొడిగించారు. ఇలా వసూలైన డబ్బులో రూ.30 కోట్లను ట్రాఫిక్‌‌ వింగ్‌‌కు, మిగతా డబ్బు సర్కార్‌‌ ‌‌గల్లాకి చేరింది. ట్రాఫిక్ పోలీసులు బ్రీత్‌‌ ఎనలైజర్స్, డిజిటల్‌‌ కెమెరాలు, ట్యాబ్స్‌‌ కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

‘ఫుల్‌‌ ఫైన్‌‌’కు ఇంకో డ్రైవ్

ఫిబ్రవరి 28 దాకా జనరేట్‌‌ అయిన చలాన్లపై మాత్రమే ఆఫర్‌‌‌‌ ఇచ్చారు. మార్చి 1 నుంచి విధించిన వాటిపై అమలు చేయలేదు. మరోవైపు మొత్తం చలాన్లలో మరో 30 శాతం పెండింగ్‌‌లోనే ఉన్నాయి. ఇక నుంచి వెహికల్‌‌పై పెండింగ్‌‌లో ఉన్న మొత్తం చలాన్‌‌ అమౌంట్‌‌ను వాహనదారులు చెల్లించాల్సి ఉంటుంది. ఆఫర్‌‌‌‌ను‌‌ వినియోగించుకోని వారిని గుర్తించేందుకు ట్రాఫిక్ పోలీసులు డ్రైవ్ నిర్వహిచనున్నారు.