ఆర్టీసీకి దసరా ఆమ్దానీ.. రోజూ రూ.16 కోట్ల రెవెన్యూ

ఆర్టీసీకి దసరా ఆమ్దానీ..  రోజూ రూ.16 కోట్ల రెవెన్యూ

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీకి దసరా పండుగ కొత్త జోష్​ను ఇచ్చింది. దసరా సందర్భంగా ఈ నెల 13 నుంచి 24 వరకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర స్టేట్స్​కు 5,265 స్పెషల్ బస్సులను ఆర్టీసీ నడిపింది. ఈ స్పెషల్ బస్సులతో సాధారణ రోజుల్లో వచ్చే రెవెన్యూ కంటే ప్రతి రోజూ అదనంగా మరో రూ.3 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. సాధారణ రోజుల్లో రోజుకు రూ.13 కోట్లు రెవెన్యూ వస్తుండగా దసరా స్పెషల్ బస్సులు స్టార్ట్ అయిన తరువాత ప్రతి రోజు రూ.16 కోట్లకు పైగా రెవెన్యూ వచ్చింది. 

శుక్ర, శనివారాల్లో రికార్డు స్థాయిలో రోజుకు రూ.19 కోట్లు రెవెన్యూ వచ్చినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక ఆర్టీసీ కొత్తగా స్టార్ట్ చేసిన డైనమిక్ ఫేర్(సీట్లు నిండుతున్న కొద్ది టికెట్ ధర పెరడగం) విధానం బాగా కలిసొచ్చిందని అధికారులు చెప్తున్నారు. గత కొంత కాలం నుంచే ఈ డైనమిక్ ఫేర్ అందుబాటులో ఉండగా పండుగకు బాగా కలిసొచ్చింది. 

ఈ నెల 20న ఆన్​లైన్​లో డైనమిక్ ఫేర్ బుకింగ్ ద్వారా 18 వేల సీట్లు బుక్ కాగా.. రూ.1.05 కోట్ల రెవెన్యూ వచ్చింది.  ఓపీఆర్ఎస్ (ఆన్ లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టం)లో ఇప్పటివరకు ఇదే అత్యధిక రెవెన్యూ అని అధికారులు చెబుతున్నారు. గత 11 రోజుల్లో డైలీ రెవెన్యూకు అదనంగా రూ.26 కోట్ల రెవెన్యూ వచ్చినట్లు సమాచారం. రాష్ర్టంలో 10 రీజియన్లు ఉండగా ప్రతి రీజియన్ కు రూ.2.50  కోట్ల అదనపు రెవెన్యూ వచ్చినట్లు తెలుస్తోంది.