70 ఏండ్లలో చేయనిది.. 8 ఏండ్లలో చేసి చూపించాం

70 ఏండ్లలో చేయనిది.. 8 ఏండ్లలో చేసి చూపించాం

మొహాలీలో 300 పడకల క్యాన్సర్​ హాస్పిటల్​ ప్రారంభం

మొహాలి : వైద్య రంగంలో.. గడిచిన 70 ఏండ్లలో జరగని అభివృద్ధిని, 8ఏండ్లలో చేసి చూపించామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. క్యాన్సర్​ను జయించేందుకు కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు. పంజాబ్.. మొహాలిలోని ముల్లన్​పూర్​లో 300 పడకల హోమి బాబా క్యాన్సర్​ హాస్పిటల్, రీసెర్చ్​ సెంటర్​ను బుధవారం ఆయన ప్రారంభించారు.  ఈ హాస్పిటల్​ను ఇండియన్​ గవర్నమెంట్​ అటామిక్​ ఎనర్జీ డిపార్ట్​మెంట్​కు చెందిన ఇండిపెండెంట్​ సంస్థ టాటా మెమోరియల్ సెంటర్ రూ.660 కోట్లతో నిర్మించింది. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు. క్యాన్సర్ అనగానే భయపడొద్దని, ధైర్యంతో పోరాడాలన్నారు. చాలా మంది క్యాన్సర్​ను జయించారని తెలిపారు. దేశ వ్యాప్తంగా 1.50 లక్షల హెల్త్, వెల్​నెస్​ సెంటర్లు ఏర్పాటు చేస్తుందని తెలిపారు. అందులో 1.25 లక్షల సెంటర్లు పని చేస్తున్నాయని వివరించారు. 

ప్రతి నిరుపేదకు ట్రీట్​మెంట్​ 

ప్రతి నిరుపేదకు క్యాన్సర్​ ట్రీట్​మెంట్​ అందజేస్తామని మోడీ తెలిపారు. హిమాచల్​ప్రదేశ్​లోని బిలాస్​పూర్​లో ఏయిమ్స్​ నిర్మించామని, అందులో కూడా క్యాన్సర్​ ట్రీట్​మెంట్​ కోసం మెరుగైన వసతులు కల్పించామన్నారు. తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్యం అందిస్తున్నామని చెప్పారు. హైటెక్​ హెల్త్​కేర్​ సిస్టమ్​ అందుబాటులోకి వచ్చినప్పుడే.. ప్రతీ వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడని వివరించారు. క్యాన్సర్​ హాస్పిటల్​ ఏర్పాటు చేయడంలో టాటా మెమోరియల్​ సెంటర్​ కీలక పాత్ర పోషించిందన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పంజాబ్​ గవర్నర్​ బీఎల్​ పురోహిత్, సీఎం భగవంత్​సింగ్​ మాన్, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, కాంగ్రెస్​ ఎంపీ మనీశ్​ తివారీతో పాటు బీజేపీ నేతలు పాల్గొన్నారు. హాస్పిటల్​లో ఎంఆర్ఐ, మమోగ్రఫీ, డిజిటల్​ రెడియోగ్రఫీ, ఇమ్యునోథెరపీ తదితర ఫెసిలిటీస్​ అందుబాటులో ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్, హిమాచల్​ప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, రాజస్థాన్​ రాష్ట్రాల నుంచి క్యాన్సర్​ ట్రీట్​మెంట్​ కోసం పంజాబ్​ వస్తుంటారు.