ఆకలైతుంటే.. సదువుడెట్ల!

ఆకలైతుంటే.. సదువుడెట్ల!

సర్కారు బడుల్లో టెన్త్​ స్టూడెంట్స్​కు ఉదయం, సాయంత్రం స్పెషల్​ క్లాసులు

హైదరాబాద్, వెలుగు :రాష్ర్టంలోని సర్కారు బడుల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు ఆకలితో అలమటిస్తూ చదువుకుంటున్నారు. టెన్త్​పాస్​పర్సెంటేజీ పెంచేందుకు బడుల్లో నిర్వహిస్తున్నస్పెషల్​క్లాసుల నేపథ్యంలో దాదాపు 12 గంటల పాటు స్కూల్​లోనే గడుపుతున్నారు. ఉదయం టిఫిన్ చేయకుండా, సాయంత్రం ఏమీ తినకుండా మధ్యాహ్నం ఒక్కసారి మాత్రమే తెచ్చుకున్న బాక్స్​ తింటుండడంతో ఖాళీ కడపులుతో క్లాసులు వింటున్నారు.  అర్థాకలితో చెప్పింది అర్థం కాక…ఎప్పుడు ఇంటికి వెళతామా? ఎప్పుడు తింటామా అని ఆలోచిస్తున్నారు.

వంద శాతం టార్గెట్​ కోసం ..

రాష్ర్టంలో అన్ని మేనేజ్​మెంట్ల పరిధిలో మొత్తం 11వేలకు పైగా హైస్కూళ్లుండగా, సుమారు 5.5లక్షల మంది టెన్త్​ స్టూడెంట్స్​ఉన్నారు. సర్కారు, జిల్లా పరిషత్​స్కూళ్లు 4,600 వరకూ ఉన్నాయి. ఇందులో 2లక్షల మందికి పైగా విద్యార్థులు ఎస్​ఎస్​సీ చదువుతున్నారు. గతేడాది టెన్త్​లో ఏకంగా 92.43శాతం పాస్ పర్సెంటేజీ వచ్చింది. జిల్లా పరిషత్​స్కూళ్లలో 91.26శాతం, గవర్నమెంట్​స్కూళ్లలో 84.3శాతం స్టూడెంట్స్​పాస్​అయ్యారు. ఇప్పుడు ఈ పర్సెంటేజీని నిలుపుకోవడం అన్ని స్కూళ్లకు కష్టంగా మారింది. అన్ని సర్కారు బడుల్లోనూ వందశాతం పాస్​ అయ్యేలా చూడాలని ఆఫీసర్ల నుంచి వస్తున్న ఆదేశాలతో హెడ్మాస్టర్లు, టీచర్లలో  ఆందోళన మొదలైంది. దీంతో పాస్ పర్సెంటేజీ పెంచేందుకు స్పెషల్​క్లాసులు మొదలుపెట్టారు. దాదాపు 12 గంటల పాటు కేవలం మధ్యాహ్న భోజనంపైనే ఆధారపడి చదువుతుండడంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. సర్కారు బడుల్లో చదివేదంతా పేద విద్యార్థులే కాబట్టి ఉదయం, సాయంత్రం టిఫిన్, స్నాక్స్​ఏర్పాటు చేస్తే బాగుంటుందంటున్నారు.

స్పెషల్​ ఫండ్స్​, దాతల నుంచి..

రాష్ర్టంలో దాదాపు అన్ని స్కూళ్లల్లో దసరా సెలవుల వరకే టెన్త్ సెలబస్​ పూర్తయ్యింది. సెలవుల తర్వాత స్పెషల్​క్లాసులు మొదలుపెట్టారు. మార్చి19 నుంచి బోర్డు పరీక్షలు ప్రారంభం కానుండగా,  ఫిబ్రవరిలో ప్రీఫైనల్​నిర్వహిస్తారు. దీంతో స్కూళ్లలో ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకూ టెన్త్ పిల్లలకు స్పెషల్​క్లాసులు, టెస్టులు నిర్వహిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఓ అరగంట అటూ ఇటూగా కొనసాగుతోంది. ఇంతవరకూ బాగానే ఉన్నా, ఉదయమే వచ్చి, రాత్రి వరకూ స్కూళ్లలోనే ఉంటున్న స్టూడెంట్స్​తిండి గురించి మాత్రం పట్టించుకోవడం లేదు. గతేడాది కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు స్పెషల్​ఫండ్స్​ద్వారా స్నాక్స్ ఏర్పాటు చేశారు. మరికొన్ని బడుల్లో దాతల ద్వారా అందిస్తున్నారు. కానీ ఈ విషయంలో ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని టీచర్లు అంటున్నారు.

పాస్ ​పర్సెంటేజీ పెంచడంపైనే అధికారుల దృష్టి

మా ఊరికి స్కూల్ పది కిలోమీటర్లుంటది సార్. రోజూ పొద్దుగాల 8 గంటలకే స్పెషల్ క్లాస్​ఉంటది. ఇంట్ల నుంచి 7 గంటలకే బయలుదేరుతం. ఇంట్ల ఉంటే తింటం లేకపోతే అట్లనే వస్తం. సాయంత్రం 6  గంటల దాకా స్పెషల్​ క్లాస్​ నడుస్తది. ఒక్కోసారి లేట్ అయితది. ఇంటికి పోయే సరికి రాత్రి 7 లేదా 8 అవుతది. మధ్యాహ్నం తింటం. క్లాసులు చెప్తుంటే ఆకలయితా ఉంటది. ఇనబుద్ది కాదు. తప్పదు గదా సార్..సదువు లేకపోతే నడవదు కదా. పొద్దున, సాయంత్రం టిఫిన్​ లెక్క ఏమైనా పెడితే బాగుంటది.

–  హైదరాబాద్​లోని బొల్లారంలో  చదివే శామీర్​పేట, తూంకుట ఎస్​ఎస్​సీ విద్యార్థుల ఆవేదన