
రాష్ట్రంలో ఉదయం ఎండ, సాయంత్రం వాన దంచికొట్టింది. పొద్దున 8 నుంచే మొదలైన ఉక్కపోత, వేడితో ప్రజలు అల్లాడిపోయారు. సాయంత్రం ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో ఊపశమనం పొందారు. మొత్తం వాతావరణం చల్లబడిపోయింది. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వాన పడింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
మీర్‌ఖాన్ పేటలో 92.5 మిల్లీమీటర్లు….
సోమవారం దాదాపు అన్ని జిల్లాల్లో వర్షం పడింది. రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్ పేటలో అత్యధికంగా 92.5, మంఖల్‌లో 71 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్‌లో 48.3, రంగారెడ్డి జిల్లా తొర్రూరులో 47 మి.మీ. వర్షం పడింది. రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ కేంద్రం తెలిపింది. అలాగే మరో రెండు రోజులు వడగాల్పులు వీస్తాయని పేర్కొంది.
హైదరాబాద్‌లో రోడ్లు జలమయం…
హైదరాబాద్‌లో సాయంత్రం కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. హిమాయత్ నగర్, మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట, ఎస్ఆర్ నగర్, కూకట్‌పల్లి, మియాపూర్, మల్కాజ్ గిరి, కుషాయిగూడలో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో నగరవాసులు ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తిప్పలుపడ్డారు. ఈదురుగాలులు ధాటికి కొన్ని చోట్లు హోర్డింగులు కూలిపోయాయి.
ఆదిలాబాద్‌లో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత…
మరోవైపు సోమవారం మధ్యాహ్నం వరకు ఎండలు మండిపోయాయి. ఆదిలాబాద్‌లో అత్యధికంగా 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్‌లో 44.4, రామగుండంలో 43.6, హన్మకొండలో 43, మెదక్‌లో 42.7 డిగ్రీలు రికార్డయ్యాయి. ఆదిలాబాద్‌లో అత్యధికంగా 33 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాచలం, నిజామాబాద్, రామగుండంలలో 31 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.