
పెషావర్: పాకిస్తాన్లో మోర్టార్ షెల్ పేలడంతో ఐదుగురు పిల్లలు చనిపోయారు. మరో 12 మందికి గాయాలయ్యాయి. శనివారం ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లక్కీ మార్వాట్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొండలలో పేలని మోర్టార్ షెల్ దొరకడంతో పిల్లలు దానిని వారి గ్రామానికి తీసుకొచ్చారని పోలీసులు తెలిపారు.
బాంబు అని తెలియక దానితో వారు ఆడుకుంటుండగా అది పేలిపోయిందని చెప్పారు. ఈ పేలుడులో ఐదుగురు చిన్నారులు చనిపోగా, 12 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు వెంటనే స్పాట్ కు చేరుకున్నాయి. మృతులను, గాయపడిన వారిని సమీపంలోని సిటీ ఆసుపత్రికి తరలించాయి. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు.