- మల్కాజిగిరి సర్కిల్లో అత్యధికంగా దోమల ఉత్పత్తి
- ఫంక్షన్‌హాళ్లు, సెల్లార్లు, తాళం వేసిన ఇండ్లు కేంద్రంగా వృద్ధి
- గ్రేటర్లో డేంజర్ బెల్స్.. రికార్డు స్థాయిలో దోమల ఉత్పత్తి
- అర్బన్ మలేరియా స్కీమ్నివేదికలో వెల్లడి
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ సిటీ పరిధిలో దోమల ఉత్పత్తి రికార్డు స్థాయిలో పెరుగుతోంది. అప్రమత్తమై అరికట్టకపోతే డెంగ్యూ, మలేరియా కేసులు భారీగా పెరిగే అవకాశం ఉంది. గత10 రోజుల్లో గ్రేటర్‌పరిధిలో 850కు పైగా డెంగ్యూ కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. ఇవి కేవలం ప్రభుత్వ హాస్పిటళ్లలో నమోదైన కేసులు మాత్రమే. ప్రైవేట్ హాస్పిటళ్లలో నమోదవుతున్న కేసుల సంఖ్య ఇంతకు మించి ఉంది.
తాజాగా విడుదలైన అర్బన్ మలేరియా స్కీమ్–2024 స్టడీలో రికార్డు స్థాయిలో దోమలు పెరుగుతున్నాయని తేలింది. అధికారులు వేల సంఖ్యలో దోమల హాట్స్పాట్లను గుర్తించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు సర్కిళ్లలో 27,608 దోమల వృద్ధి కేంద్రాలను గుర్తించారు. ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దోమలు వృద్ధి చెందితున్నాయని, సిటీ మొత్తం స్వైర విహారం చేస్తున్నాయని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో రోజురోజుకు డెంగ్యూ, మలేరియా కేసులు అధికమవుతున్నాయి.
క్లోజ్‌చేసిన ఇండ్లలో 894 స్పాట్లు
మల్కాజిగిరి సర్కిల్‌పరిధిలో దోమల వృద్ధి కేంద్రాలు అత్యధికంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా వాడుకలో లేని, తాళం వేసి ఉన్న ఇండ్లు, ఓపెన్‌ప్లాట్లు, కన్స్ట్రక్షన్జరిగే ప్రాంతాలు, సెల్లార్లు, ఫంక్షన్‌హాళ్లను దోమలు తమ వృద్ధి కేంద్రాలుగా మార్చుకుంటున్నాయి. అలాగే అపరిశుభ్రంగా ఉన్న ఇండ్లు, పరిసరాలు, నీళ్లు నిల్వ ఉంటున్న కొబ్బరి చిప్పలు, టైర్లు, పూలకుండీల్లో దోమలు వృద్ధి చెందుతున్నాయి. మల్కాజిగిరిలో మూసి ఉన్న ఇండ్లలో 894 హాట్స్పాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
గాజులరామారంలోని ఖాళీ ఇండ్లలో 713, సంతోశ్‌నగర్‌లోని ఇండ్లలో 625 హాట్స్పాట్లు ఉన్నాయి. గాజులరామారంలోని బిల్డింగ్కన్స్ట్రక్షన్ ఏరియాల్లో 641, అల్వాల్‌లో 568, శేరిలింగంపల్లిలో 567 హాట్స్పాట్లు ఉన్నాయి.
మల్కాజిగిరిలోని ఓపెన్‌ప్లాట్లలో 886, చందానగర్ లో 787, గాజులరామారంలో 549, శేరిలింగంపల్లిలో 436 దోమలు వృద్ధి కేంద్రాలను అధికారులు గుర్తించారు. మొత్తంగా ఆరు సర్కిళ్ల పరిధిలోని నిర్మాణాల పరిసరాల్లో 6,370 హాట్స్పాట్లు ఉన్నట్లు తేల్చారు. ఫంక్షన్‌హాళ్లలో 767, సెల్లార్లలో 4,634, ఓపెన్‌ప్లాట్లలో 6,157, తాళాలు వేసి ఉన్న ఇండ్లు, పరిసరాల్లో 9,680 దోమల వృద్ధి కేంద్రాలు ఉన్నాయి.
గ్రేటర్ నాలాల్లో దోమల బ్రీడింగ్ ఆగాలి
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి
సిటీలోని వరద నీటి కాల్వల్లో దోమలు వృద్ధి చెందకుండా చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు. నీరు నిలబడకుండా పూడిక తీయించాలని చెప్పారు. శుక్రవారం ఉదయం కమిషనర్ జోనల్, అడిషనల్ కమిషనర్లతో ఆమె టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మురుగు, వరద నీరు ముందుకు కదలకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో బ్రీడింగ్ ఎక్కువగా జరుగుతోందని, వెంటనే పూడిక తీయించాలని సూచించారు. సీఆర్ఏంపీ ద్వారా చేపట్టిన బీటీ రోడ్ల నిర్వహణ అగ్రిమెంట్పూర్తికావస్తుందని, మిగిలిన పనులను పూర్తిచేయించాలని ఆదేశించారు. ఫుట్ పాత్ సెంట్రల్ మీడియన్, కర్బ్ లైన్, లైన్ మార్కింగ్ పనులను కంప్లీట్చేయాలన్నారు.
