DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్

DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్

ఐపీఎల్ లో మరోసారి బ్యాటర్లు తడాఖా చూపించారు. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ల ధాటికి గుజరాత్ బౌలర్లు తేలిపోయారు. ముఖ్యంగా మోహిత్ శర్మ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త గణాంకాలను నమోదు చేశాడు. నాలుగు ఓవర్లలో ఏకంగా 73 పరుగులు సమర్పించుకుని ఐపీఎల్ చరిత్రలో అత్యధిక అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్ గా దారుణమైన రికార్డును మూట కట్టుకున్నాడు.

ఇప్పటివరకు ఈ రికార్డ్ భారత బౌలర్ బేసిల్ తంపి పేరిట ఉంది. 2018లో సన్ రైజర్స్ తరపున ఆడిన తంపి.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 70 పరుగులు సమర్పించుకున్నాడు. డెత్ ఓవర్ స్పెషలిస్ట్ గా పేరొందిన మోహిత్.. ఈ మ్యాచ్ లో తన మార్క్ చూపించలేకపోయాడు. తన తొలి ఓవర్లో 12.. రెండో ఓవర్లో 16 ఇచ్చాడు. ఇక మూడో ఓవర్లో 14 పరుగులు.. నాలుగో ఓవర్ అయిన  ఇన్నింగ్స్  చివరి ఓవర్ లో ఏకంగా 31 పరుగులు సమ్పర్పించుకున్నాడు.

ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ఢిల్లీ వేదికగా అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది. టాపార్డర్ విఫలమైనా.. కెప్టెన్ రిషబ్ పంత్(43 బంతుల్లో 88,5 ఫోర్లు, 8 సిక్సులు) అక్షర్ పటేల్(43 బంతుల్లో 66,5 ఫోర్లు, 4 సిక్సులు) భారీ భాగస్వామ్యంతో నిర్ణీత 20 ఓవర్లలో 224 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో గుజరాత్ ప్రస్తుతం 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది.