ప్రజావాణిలో భూ సమస్యలే ఎక్కువ!

ప్రజావాణిలో భూ సమస్యలే ఎక్కువ!

కామారెడ్డి , వెలుగు: జిల్లాలో భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత భూములకు సంబంధించిన అనేక సమస్యలతో సతమతమవుతున్న  రైతులకు ‘ధరణి’ తో మరిన్ని కొత్త చిక్కులు వచ్చాయి. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏండ్ల తరబడి రెవెన్యూ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నారు. మండల స్థాయిలో రెవెన్యూ అధికారులు అందుబాటులో ఉండక, ఉన్నవారు పట్టించుకోకపోవడంతో చాలా మంది రైతులు జిల్లా కేంద్రంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి క్యూకడుతున్నారు. జిల్లా అధికారులకైనా విన్నవించుకుంటే త్వరగా పరిష్కారమవుతాయని ప్రజావాణికి వస్తున్నామని వారు చెప్తున్నారు. 

75 ఫిర్యాదుల్లో.. 41 భూ సమస్యలే..

 ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో సగం కంటే  ఎక్కువ ఫిర్యాదులు భూములకు సంబంధించినవే వస్తున్నాయని అధికారులు చెప్తున్నారు.  సోమవారం నిర్వహించిన ప్రజావాణికి హాజరైన  కలెక్టర్​ జితేశ్​వి పాటిల్​,  జడ్పీ సీఈవో సాయాగౌడ్​,  ఏవో  రవీందర్​ ఫిర్యాదులు తీసుకుని బాధితులతో మాట్లాడారు.   అయితే  ప్రతి ప్రజావాణిలో వచ్చినట్లుగానే ఈ వారం కూడా  భూసమస్యలపైనే  ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయని  రెవెన్యూ అధికారులు చెప్పారు. ప్రజావాణికి మొత్తం 75 ఫిర్యాదులు వస్తే  అందులో  41 రెవెన్యూ శాఖవే ఉన్నాయన్నారు.  ఫిర్యాదుల్లో  సరిహద్దులు, భూ కొలతలు, పట్టాదారు  పాస్​ బుక్స్​ రాకపోవడం,  రైతుకు ఉన్న భూమికంటే రికార్డుల్లో తక్కువగా ఎంట్రీ కావడం,  అన్​లైన్లో ఎంట్రీ కాకపోవడం వంటివే సమస్యలు ఉన్నాయి.   

వచ్చిన వారే మళ్లీ..

ఫిర్యాదు దారుల్లో ఎక్కువ మంది ప్రతి వారం వస్తున్నారు.  ఒక సారి ఫిర్యాదు ఇస్తే సమస్య  పరిష్కారం కాకపోవడంతో మళ్లీ వచ్చి ఫిర్యాదు ఇస్తున్నారు. కొందరయితే  నాలుగైదు వారాల పాటు తిరుగుతున్నారు. అయినా సమస్యలు పరిష్కరిస్తలేరని  ఉన్నతాధికారులు తీరుపై  అసహనం వ్యక్తం చేస్తున్నారు.