పేకాటలో పట్టుబడుతున్న వాళ్లలో వీరే ఎక్కువ..!

పేకాటలో పట్టుబడుతున్న వాళ్లలో వీరే ఎక్కువ..!

హైదరాబాద్ నగర శివార్లు పేకాటకు అడ్డాగా మారుతున్నాయి. పోకర్స్ గేమ్ పేరుతో నగరంలో కొత్త ట్రెండ్ మొదలైంది. యూపీ, గోవా నుంచి ఆర్గనైజింగ్ చేస్తుంది ఈ పేకాట గ్యాంగ్. సిటీలోని ఫామ్ హౌజ్ లు, గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్ మెంట్లలో విచ్చలవిడిగా పేకాట స్థావరాలు నడుస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేకాట ఆడుతూ పట్టుబడుతున్న వాళ్లలో ఎక్కువ మంది వీఐపీలు, రియల్టర్లు, చోటామోట పోలిటికల్ లీడర్లే ఉంటున్నారు. ఇలా పట్టుబట్టవారికి పైరవీలు చేస్తే స్టేషన్ బెయిల్స్ ఇస్తున్నారని పోలీసులపై ఆరోపణలు వస్తున్నాయి. సైబరాబాద్ లో ఈ మధ్యకాలంలో పేకాట ఆడుతున్న 84 మందిని రిమాండ్ చేశారు పోలీసులు. 

బేగంపేటలో అర్ధరాత్రి పేకాట ఆడుతున్న గెస్ట్ హౌజ్ పై పోలీసుల రైడ్స్ చేశారు. పట్టుబడ్డవాళ్లలో బిజినెస్ మెన్లు, వీఐపీలు, రాజకీయ నాయకులే ఉన్నట్లు తెలుస్తోంది. వీరి దగ్గర నుంచి 12 లక్షల 66 వేల నగదు సీజ్ చేశారు. అయితే చిన్న చిన్న కేసులకే ప్రెస్ మీట్లు పెట్టే పోలీసులు.. వీఐపీ పేకాట సెంటర్ల మీద దాడి విషయంపై మాత్రం ప్రెస్ మీట్ పెట్టడం లేదు. కనీసం మీడియాకి విజువల్స్, ఫోటోలు ఇవ్వకపోవడంతో.. పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. పోకర్స్ పేకాటలో పేమెంట్స్ అన్నీ ఆన్ లైన్ లోనే జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం పేకాట బ్యాన్ చేసినా.. లక్షల రూపాయలు పెట్టి ఇండ్లను రెంట్ కు తీసుకొని పేకాట స్థావరాలు నడిపిస్తున్నారు. గచ్చిబౌలి, కోకాపేట, ఔటర్ రింగ్ రోడ్డు పరిసరాల్లో పేకాట గ్యాంగ్స్ ఎక్కువగా పట్టుబడుతున్నాయి.