- ఉమ్మడి వరంగల్లో గన్తో బెదిరింపులు, దాడులు
- ప్రతీకార హత్య కోసం తిరుగుతున్న సూరి
- రేపో, మాపో అరెస్ట్ చూపే అవకాశం..
హనుమకొండ, వెలుగు: ఈ ఏడాది ఏప్రిల్ లో రాచకొండ పోలీసులు బహిష్కరణ విధించగా నగరం వీడిన మోస్ట్ వాంటెడ్ రౌడీ షీటర్ సూరి అలియాస్ దాసరి సురేందర్ అలియాస్ మోయిన్, అలియాస్మునీర్(35) వరంగల్ ను అడ్డాగా చేసుకుని మరో ఐదు జిల్లాల్లో అరాచకాలకు తెరలేపి అడ్డంగా దొరికిపోయినట్టు సమాచారం. సూరి గ్యాంగ్ పై ఇప్పటివరకు పలు పోలీస్ స్టేషన్లలో మూడు హత్యలు సహా పలు లైంగికదాడులు, దాడులు, దొంగతనాలు, ఆయుధాలతో సంచరించడం వంటి మొత్తం 45 కేసులు ఉన్నాయి. దీంతో అతడిని ఏడు నెలల కింద నగరం నుంచి రాచకొండ పోలీసులు బహిష్కరించారు. తర్వాత అతడు వరంగల్ వెళ్లి భీమారం సమీపంలోని ఓ డాగ్ ఫామ్ లో అడ్డా ఏర్పాటు చేసుకుని, కొంతమంది యువకులు, కాలేజీ స్టూడెంట్స్ తో ముఠా నిర్వహిస్తూ దందాలకు పాల్పడుతున్నాడు.
గత నెల18న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ లారీ భద్రాచలం వెళ్తుండగా..హనుమకొండ జిల్లా శాయంపేట మండలం మాందారిపేట వద్ద సూరి, అతని గ్యాంగ్ రెండు బైకులతో అడ్డగించారు. సైడ్ ఇవ్వలేదనే కారణంతో లారీ డ్రైవర్, ఓనర్ ను గన్ తో బెదిరించి తీవ్రంగా కొట్టారు. అదేరోజు అక్కడి పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోయించుకుని డబ్బులివ్వకుండా పరారయ్యారు. తీవ్ర గాయాలతో లారీ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శాయంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టగా సూరి వ్యవహారం బయటపడింది. కాగా, ఇదే గ్యాంగ్ లోని ఓ ముగ్గురు సభ్యులు ములుగు జిల్లా కేంద్రంలోని ఓ పాన్ షాప్ వద్ద ఒకరిని గన్ తో బెదిరించగా..అక్టోబర్ 31న టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వారిని విచారించగా, సూరి గురించి అన్ని విషయాలు బయటపెట్టినట్టు తెలిసింది. దీని ఆధారంగానే సూరిని అదుపులోకి తీసుకుని రెండు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
మర్డర్ చేసేందుకు వరంగల్లో మకాం ?
ఈ ఏడాది సెప్టెంబర్ 5న భూపాలపల్లికి చెందిన మహమ్మద్ బాసిత్ మేడారం అటవీ ప్రాంతంలో హత్యకు గురయ్యాడు. ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో భూపాలపల్లికి చెందిన ముగ్గురు అతడిని చంపి, గుర్తు పట్టకూడదనే ఉద్దేశంతో మృతదేహానికి నిప్పంటించారు. మృతుడు బాసిత్ బంధువుకు రౌడీ షీటర్ సూరి పరిచయం. అతడి కోరిక మేరకు బాసిత్ ను చంపినవాళ్లను హత్య చేయాలనే ఉద్దేశంతో సూరి తిరుగుతున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే తన వద్ద ఉన్న గన్ తో ఇటీవల బాసిత్ సమాధి వద్ద గాల్లోకి కాల్పులు జరిపి చంపిన వాళ్లను హత్య చేసి తీరతానని శపథం చేసినట్లు తెలిసింది. ఆ వ్యవహారంతో పాటు భూదందాల్లోనూ సూరి గ్యాంగ్ ఎంటరైనట్లు సమాచారం.
సూరి గురించి తెలిసిన తర్వాత అతడిని అదుపులోకి తీసుకుని ఆ గ్యాంగ్ ఎక్కడెక్కడ ఎలాంటి దారుణాలకు పాల్పడిందో కూపీ లాగుతున్నారు. నేడో, రేపో పోలీస్ ఉన్నతాధికారులు ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. యువకులు, స్టూడెంట్స్ తో గ్యాంగ్ నడుపుతున్న రౌడీ షీటర్ సూరికి ఇన్ స్టాగ్రామ్ లో దాదాపు 11 వేల మందికిపైగా ఫాలోవర్స్ ఉండటం గమనార్హం. సురేందర్ స్వగ్రామం వరంగల్ జిల్లా నెక్కొండ మండలం నాగారం కాగా, గతంలో హైదరాబాద్ లో కారు డ్రైవర్గా పని చేశాడు. గొడవల్లో తలదూర్చుతూ గ్యాంగ్ స్టర్గా మారాడు.
