మహారాష్ట్ర శాసనసభలో 2021-2026 మధ్య నమోదైన మిస్సింగ్ కేసుల డేటాను ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సమర్పించారు. ఈ మిస్సింగ్ కేసుల్లో ఇల్లు విడిచి వెళ్లడానికి స్త్రీ, పురుషుల్లో వేర్వేరు కారణాలు ఉన్నాయని ఈ రిపోర్ట్ వెల్లడించింది.
మహిళలు ఇల్లు విడిచి వెళ్ళడానికి ముఖ్య కారణాలు చుస్తే.. 46.32% ప్రేమ వ్యవహారాలు.. 20% కుటుంబ సమస్యలు/గొడవలు.. 2% మానసిక ఒత్తిడి కాగా... పురుషులు ఇల్లు విడిచి వెళ్ళడానికి ప్రధాన కారణాలు చూస్తే.. 32% కుటుంబ సమస్యలు/గొడవలు.. 9.12% ప్రేమ వ్యవహారాలు.
మిస్సింగ్ కేసులలో రిలీఫ్ ఇచ్చే విషయాలు చూస్తే... ఇల్లు వదిలి వెళ్లిపోయిన వారిలో చాలామంది మళ్లీ వాళ్ళంతట వాళ్లే ఇంటికి తిరిగి వస్తున్నారని ముఖ్యమంత్రి తెలిపారు.
మహారాష్ట్ర డేటా (2021–2026): ఈ ఐదేళ్లలో 2,34,811 మంది మహిళలు, 2,17,758 మంది పురుషులు అదృశ్యం కాగా... వారిలో 93% మంది సురక్షితంగా ఇళ్లకు తిరిగి వచ్చారు.
కిడ్నాప్ కేసులు : అదృశ్యమైన కేసులలో కిడ్నాప్ కేసులు చాలా తక్కువ శాతం మాత్రమే ఉన్నాయి. మహిళల అదృశ్య కేసుల్లో 5.25%, సాధారణ కిడ్నాప్ కేసుల్లో 4.47% మాత్రమే నిజమైన కిడ్నాప్‌లు.... మిగిలినవన్నీ స్వచ్ఛందంగా ఇల్లు వదిలి వెళ్లినవే.
చిన్నారుల రక్షణ (గత 13 ఏళ్ల రికార్డు): 2012 జనవరి నుండి 2025 డిసెంబర్ మధ్య కాలంలో తప్పిపోయిన దాదాపు 95,000 మంది చిన్న పిల్లల్లో (బాలికల్లో) 91,000 మందికి పైగా ఆచూకీ కనిపెట్టి వారి కుటుంబాలతో కలిపారు. మొత్తం బాలురు, బాలికలను కలిపి చూస్తే 1.37 లక్షల మందిలో 1.31 లక్షల మందిని సురక్షితంగా రక్షించారు.
నేర విచారణ, శిక్షల అమలులో పురోగతి
నూతన నేర చట్టాల (భారతీయ న్యాయ సంహిత - BNS) అమలుతో రాష్ట్రంలో నేరం రుజువై శిక్ష పడే రేటు (Conviction Rate) గణనీయంగా పెరిగిందని సీఎం తెలిపారు.
►ALSO READ | ఢిల్లీ నిరసనల్లో ఆఫ్‌లైన్ మెసేజింగ్ యాప్స్! మొబైల్ డేటా లేకపోయినా ఎలా పనిచేస్తాయంటే?
శిక్షల శాతం పెంపు: 2011-12లో కేవలం 9.4%గా ఉన్న శిక్షా రేటు, గతేడాది 44.2%కి, మే 2026 నాటికి 52.6%కి పెరిగింది. త్వరలోనే దీనిని 70%కి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
వేగంగా చార్జిషీట్లు: 50% కేసుల్లో నిర్దేశిత 60 లేదా 90 రోజుల్లోపే చార్జిషీట్లు దాఖలు చేస్తున్నారు. ప్రత్యేకించి అత్యాచార కేసుల్లో 90% చార్జిషీట్లను 60 రోజుల్లోపే సమర్పిస్తున్నారు.
సాంకేతికత వినియోగం: 90% కేసులలో 'ఇ-సాక్ష్య' ద్వారా సాక్షుల వాంగ్మూలాలను కెమెరాలో రికార్డ్ చేస్తున్నారు. 91.9% తీవ్రమైన నేరాల ఘటనా స్థలాలను ఫోరెన్సిక్ సందర్శించి ఆధారాలు సేకరిస్తున్నాయి.
ఇల్లు వదిలి వెళ్లే మహిళల్లో దాదాపు సగం మంది ప్రేమ వల్లే ఆ నిర్ణయం తీసుకుంటుండగా, పురుషుల్లో ఎక్కువమంది ఇంటి సమస్యల వల్లే వెళ్తున్నారు. అయితే, అదృశ్యమైన వారిలో 90% పైగా ప్రజలు సురక్షితంగా మళ్లీ ఇళ్లకు చేరుకోవడం గమనార్హం.
