పెద్దగుల్ల తండాలో తల్లీకూతుళ్ల ప్రాణం తీసిన కూలర్..కరెంట్ షాక్ కొట్టడడంతో మృతి

పెద్దగుల్ల తండాలో తల్లీకూతుళ్ల ప్రాణం తీసిన కూలర్..కరెంట్ షాక్ కొట్టడడంతో మృతి
  • కామారెడ్డి జిల్లా పెద్దగుల్ల తండాలో ఘటన

పిట్లం, వెలుగు: కూలర్​కు కరెంట్ సరఫరా అయి తల్లీ కూతుళ్లు చనిపోయిన ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం..జుక్కల్​ మండలం గుల్ల తండాకు చెందిన చవాన్ ప్రహ్లాద్, శంకాబాయి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. ప్రహ్లాద్ వెహికల్ డ్రైవర్ గా వేరే ప్రాంతానికి వెళ్లాడు. శంకాబాయి(36), తన పెద్ద కూతురు శివాని(14) శుక్రవారం రాత్రి నిద్రపోయేముందు చల్లగాలి కోసం కూలర్​ఆన్ చేశారు.

 శివాని కాళ్లు కూలర్ ​నీటిని తాకడంతో కరెంట్​షాక్​ కొట్టి.. తల్లి కూతుళ్లు చనిపోయారు. ఇంటి బయట పడుకున్న శంకాబాయి కొడుకు ప్రతీక్​ శనివారం ఉదయం లేచి  వెళ్లి చూడగా తల్లి, సోదరి చనిపోయి కనిపించారు. వెంటనే స్థానికులకు చెప్పడంతో విద్యుత్​ అధికారులకు సమాచారం ఇవ్వగా కరెంట్​సరఫరా నిలిపేశారు. శంకాబాయి మరో కుమార్తె బంధువుల ఇంటి వద్ద ఉంది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో బిచ్కుంద సీఐ జగడం నరేష్, జుక్కల్ ఎస్ఐ భువనేశ్వర్ రావు​ వెళ్లి కేసు నమోదు చేశారు.