మరో నెలలో పెళ్లనగా తల్లీకూతుళ్లు ఆత్మహత్య

మరో నెలలో పెళ్లనగా తల్లీకూతుళ్లు ఆత్మహత్య

కూతురుకు పెళ్లి నిశ్చయమైంది. మరో నెలలో పెళ్లి. దాంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. మరో నెలలో పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నానని ఆ అమ్మాయి ఎన్నో కలలు కన్నది. ఆ తల్లిదండ్రుల ఆనందం, అమ్మాయి కలలు చెదిరిపోయాయి. పెళ్లికి డబ్బు సర్దుబాటుకాకాపోవడంతో పెళ్లికూతురు, ఆమె సోదరి, తల్లి ముగ్గురూ కలసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాధ ఘటన ఖమ్మం పట్టణంలో చోటుచేసుకుంది. గాంధీ చౌక్‌లో నివాసముండే ప్రకాష్, గోవిందమ్మ(49) దంపతులకు ఇద్దరు కూతుళ్లు రాధిక(29), రమ్య(28). ప్రకాష్ మహబూబాబాద్‌లో బంగారానికి మెరుగుపెట్టే పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయనకు తోడుగా భార్య గోవిందమ్మ, కూతుళ్లు టైలరింగ్ చేస్తూ చేదోడువాదోడుగా ఉంటున్నారు. కాగా, ఈ మధ్యే పెద్ద కూతురు రాధికకు.. జనగామాకు చెందిన ఓ వ్యక్తితో పెళ్లి కుదిరింది. జనవరి 11న పెళ్లికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. దాంతో అబ్బాయి, అమ్మాయి కుటుంబాలు పెళ్లి పనుల్లో పడ్డాయి. అయితే పెళ్లి దగ్గరపడుతున్నా కూడా పెళ్లికి కావలసిన డబ్బులు సర్దుబాటుకాకపోవడంతో గోవిందమ్మ, రాధిక తీవ్ర ఆందోళనలో పడ్డారు. ఒత్తిడి భరించలేక గోవిందమ్మ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి బంగారం మెరుగుపెట్టే రసాయనం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. పనికి వెళ్లిన ప్రకాష్ రాత్రి ఇంటికి వచ్చాడు. ఎన్నిసార్లు తలుపుకొట్టినా తీయకపోవడంతో స్థానికుల సాయంతో పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు ప్రకాష్ ఇంటికి వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా.. తల్లికూతుళ్లు ముగ్గురు చనిపోయి ఉన్నారు. కేసు నమోదుచేసిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. కేసు దర్యాప్తు చేస్తున్నారు.