V6 News

ఏడాది కూతురికి నిప్పంటించి.. ఆత్మహత్య చేసుకున్న తల్లి

ఏడాది కూతురికి నిప్పంటించి.. ఆత్మహత్య చేసుకున్న తల్లి
  • కూతురి గ్రహణం మొర్రికి తానే కారణమని మనస్తాపం
  • నిజామాబాద్​ జిల్లా ధర్పల్లి​ మండలంలో ఘటన

సిరికొండ, వెలుగు: కూతురికి గ్రహణం మొర్రి ఉండడాన్ని భరించలేక చిన్నారికి నిప్పంటించి, తల్లి ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్​ జిల్లా భీంగల్​మండలం బడా భీంగల్​కు చెందిన కీర్తన(26)కు ధర్పల్లి మండలం గోవింద్​ పల్లి గ్రామానికి చెందిన ప్రదీప్​తో నాలుగేళ్ల కింద వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. చిన్న కూతురు సాన్వీ(1) గ్రహణం మొర్రితో బాధపడుతోంది. ఆరు నెలల కింద ప్రైవేట్​ ఆస్పత్రిలో సర్జరీ చేయించినా వ్యాధి నయం కాలేదు. దీంతో మనస్తాపానికి గురైన కీర్తన బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపులు వేసుకొని కూతురిపై పెట్రోలు పోసి తాను అంటించుకుంది. స్థానికులు తలుపులు బద్దలు కొట్టి కీర్తనను జిల్లా ఆసుపత్రికి తరలించారు.

అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. సాన్వీని హైదారాబాద్​ తరలిస్తుండగా, మార్గమధ్యలో చనిపోయింది. భర్త ప్రదీప్​ గల్ఫ్​లో ఉన్నాడు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వినయ్​ తెలిపారు. ఇదిలాఉంటే రెండు రోజుల కింద ధర్పల్లికి సాన్వీ ఆధార్​ అప్​డేట్​ కోసం మీ సేవ కేంద్రానికి మామయ్యతో కలిసి వెళ్లిన కీర్తన తన తమ్ముడు వస్తాడని బైక్​లో పెట్రోల్​ కావాలని మావయ్యతో చెప్పి బాటిల్​లో పెట్రోల్​ తెచ్చుకుంది.