
బెంగళూరు : భర్త చేసిన పాడు పనికి తట్టుకోలేక ఓ మహిళ ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. తమ తండ్రి చేసిన పాడు పనికి జీవితం మీద విరక్తి కలిగిందని వాట్సాప్ లో స్టేటస్ పెట్టి ఇద్దరు కుమార్తెలు, తల్లి సూసైడ్ చేసుకున్నారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి బెంగళూరులో జరిగింది.
వివరాలు..
మండ్యకు చెందిన సిద్దయ్య, రాజేశ్వరి (40) దంపతులకు మానస (17), భూమిక (15) కుమార్తెలు ఉన్నారు. సిద్దయ్య వాచ్ మెన్ గా విధులు నిర్వహించేవాడు. రాజేశ్వరి గృహిణి కాగా కుమార్తెలు మానస ప్రథమ పీయూసీ చదువుతుండగా, భూమిక SSLC చదువుతోంది. సిద్దయ్య మూడేళ్లుగా ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుడంటంతో భార్య పిల్లలను నిర్లక్ష్యం చేశాడు. పలుమార్లు కుటుంబ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా సిద్దయ్య ప్రవర్తనలో మార్పురాలేదు. ఇటీవల సిద్ధయ్య ఇంటికి రావడం కూడా తగ్గించడంతో భార్య రాజేశ్వరి ఇద్దరు పిల్లలు తీవ్ర మనస్ధాపానికి గురయ్యారు.
డ్యూటీ కోసం సిద్దయ్య వేరే ప్రాంతానికి వెళ్లడంతో ఆదివారం రాత్రి రాజేశ్వరి, ఇద్దరు కుమార్తెలు ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం ఉదయం ఎంతసేపటికి ఇంటి తలుపు తీయకపోవడంతో ఇరుగుపొరుగు వారు స్థానికులు సాయంతో తలుపు బద్దలుకొట్టి గదిలో చూడగా.. ముగ్గురు ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించి మృతదేహాలను విక్టోరియా హస్పిటల్ కి తరలించారు. సూసైడ్ కు ముందు కూతురు మానస తన మొబైల్ వాట్సాప్ స్టేటస్ లో ఓ మెసేజ్ పెట్టింది. ఇలాంటి తండ్రి ఇంకెవరికి ఉండకూడదని.. తండ్రి చేసిన పాడు పనికి జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డామని తన చావుకు సిద్దయ్య, అతని ప్రియురాలే కారణమని తెలిపింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు..దర్యాప్తు చేపట్టారు.