మెదక్, వెలుగు: ఏపీలోని కర్నూల్ జిల్లా చిన్న టేకూర్ వద్ద ప్రైవేట్ బస్ దగ్ధమైన ఘటనలో చనిపోయిన తల్లీకూతుళ్లు మంగ సంధ్యారాణి(43), చందన(23) అంత్యక్రియలు సోమవారం వారి స్వగ్రామం మెదక్ మండలం శివ్వాయిపల్లిలో అశ్రునయనాలతో జరిగాయి. డీఎన్ఏ పరీక్షల అనంతరం డెడ్‌బాడీలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.
కర్నూల్ నుంచి అంబులెన్స్‌లో డెడ్‌బాడీలు ఆదివారం అర్ధరాత్రి శివ్వాయిపల్లికి చేరుకోగా, గ్రామంలో విషాదం నెలకొంది. తల్లీకూతుళ్లకు ఒకేసారి తండ్రి, కొడుకులు ఆనంద్ గౌడ్, శ్రీవల్లభ తల కొరివి పెట్టడం గ్రామస్తులను కంట తడి పెట్టించింది. అంత్యక్రియలకు బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు తరలివచ్చారు.
మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, నాయకులు దేవేందర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేశ్ గౌడ్ తదితరులు కుటుంబ సభ్యులను పరామర్శించారు.
వస్తాకొండూరులో అనూషకు..
యాదాద్రి: బస్సు దగ్ధమైన ఘటనలో చనిపోయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనూష రెడ్డి డెడ్‌బాడీ యాదాద్రి జిల్లా గుండాల మండలం వస్తాకొండూరుకు చేరుకుంది. ఈ ఘటనలో అనూష డెడ్‌బాడీ గుర్తుపట్టలేని విధంగా కాలిపోవడంతో, ఆమె తల్లితండ్రులు శ్రీనివాసరెడ్డి, విజిత డీఎన్ఏను సేకరించారు.
48 గంటల తరువాత రిపోర్ట్ రావడంతో అక్కడి ఆఫీసర్లు అనూష డెడ్‌బాడీని వస్తాకొండూరుకు తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. అనంతరం ఆమె అంత్యక్రియలు పూర్తి చేశారు. ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గ్రామానికి చేరుకొని అనూష తల్లిదండ్రులను ఓదార్చారు.
