మాగంటి గోపీనాథ్‌ మరణం.. ఓ మిస్టరీ!..జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ తీవ్ర దుమారం

మాగంటి గోపీనాథ్‌ మరణం.. ఓ మిస్టరీ!..జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ తీవ్ర దుమారం
  • విచారణకు పెరుగుతున్న డిమాండ్​.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ తీవ్ర దుమారం
  • ఇప్పటికే పోలీసులకు గోపీనాథ్​ తల్లి ఫిర్యాదు.. అనుమానాలున్నాయని ఆవేదన 
  • మనుమడితో కలిసి తాజాగా మీడియా ముందుకు!
  • గోపీనాథ్​ ఫ్యామిలీ సర్టిఫికెట్లలో మా పేర్లేవి?: మహానంద కుమారి 
  • తప్పుడు పత్రాలతో  సునీత ప్రచారం చేస్కుంటున్నది
  • మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్​
  • విచారణ జరపాలి.. కేటీఆర్​ పాత్ర తేల్చాలి: కేంద్ర మంత్రి సంజయ్​

హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ మరణంపై నెలకొన్న అనుమానాలు తీవ్ర రాజకీయ దుమారానికి దారి తీస్తున్నాయి.  జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ, ఈ అంశం రోజుకో మలుపు తిరుగుతూ సంచలనం సృష్టిస్తున్నది. గోపీనాథ్ మృతి మిస్టరీగా ఉందని, పూర్తిస్థాయి విచారణ జరిపించాలని, దీని వెనుక ఉన్న రహస్యాలను ఛేదించాలని ఆయన తల్లి మాగంటి మహానంద కుమారి డిమాండ్ చేయడంతో ఈ వ్యవహారం మరింత వేడెక్కింది. ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె, తన కొడుకు మరణం సాధారణమైనది కాదని, దీని వెనుక ఏదో అనుమానాస్పద కోణం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొడుకు మరణం పట్ల తల్లి వ్యక్తం చేస్తున్న అనుమానాలు, ఆమె ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.  ఈ మిస్టరీని ఛేదించేందుకు ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కేంద్రమంత్రి బండిసంజయ్​ సైతం  డిమాండ్​ చేయడమే కాకుండా.. అందులో కేటీఆర్​ పాత్ర తేల్చాలన్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సైతం ఈ అంశంపై స్పందించారు. ఎంపీ హోదాలో బండి సంజయ్​ ఫిర్యాదు ఇస్తే.. కచ్చితంగా విచారణ చేయిస్తామని హామీ ఇచ్చారు.

అనేక అనుమానాలు

మాగంటి గోపీనాథ్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో జరిగిన పరిణామాలు కూడా అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. తనను ఆసుపత్రి లోపలికి రానీయకుండా కేటీఆర్ అడ్డుకున్నారని గోపీనాథ్‌‌ తల్లి మహానంద కుమారి ఆరోపిస్తున్నారు.  కేటీఆర్  మాత్రం ఆసుపత్రిలోనే తిష్టవేశారని, ఇది ఆస్తుల పంపకానికి సంబంధించిన కుట్రలో భాగమేనని బండి సంజయ్ విమర్శించారు. గోపీనాథ్ అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు లేదా చికిత్స పొందుతున్న సమయంలో, కుటుంబ సభ్యులలో ఒకరిని ముఖ్యంగా తల్లిని కలవనీయకుండా అడ్డుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పైగా కుటుంబ సభ్యులను లోపలికి రానియొద్దని కూతురు దిశిర.. హాస్పిటల్​ సిబ్బందికి లెటర్​ రాసివ్వడం వెనుక ఎవరి ప్రోద్భలం ఉన్నదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేవలం రాజకీయ నాయకుడి మరణంగా కాకుండా, దీనిని ఆస్తి తగాదాలు, రాజకీయ కుట్ర కోణంలో చూడాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఆరోపణలపై లోతుగా విచారణ చేయాలనే డిమాండ్​..

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో మాగంటి గోపీనాథ్ మరణం తీవ్ర దుమారం రేపుతున్నది. బీఆర్ఎస్ టికెట్‌‌పై గెలిచిన గోపీనాథ్ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఆయన మరణంపై అనుమానాలు తెరపైకి రావడం  రాజకీయంగా సంచలనంగా మారింది. ఒకవైపు గోపీనాథ్ తల్లి, కొడుకు విచారణ కోసం డిమాండ్ చేస్తుంటే, మరోవైపు బండి సంజయ్ లాంటి కీలక నేతలు కేటీఆర్‌‌ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు. ఈ పరిణామాలు ఉప ఎన్నికల ప్రచారాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ప్రజల్లో ఈ మరణంపై నెలకొన్న సందిగ్ధత, రాజకీయ ఆరోపణలు ఓటర్ల తీర్పుపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాగంటి గోపీనాథ్ మరణంపై నెలకొన్న మిస్టరీ, ఆయన తల్లి ఆవేదన, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపణల నేపథ్యంలో ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు జరపాల్సిన అవసరం ఎంతైనా ఉందనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. కేవలం గుండెపోటుతో కూడిన సహజ మరణంగా సరిపెట్టకుండా, కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్న అనుమానాలను, ముఖ్యంగా కేటీఆర్ ప్రమేయం ఉందన్న ఆరోపణలను లోతుగా పరిశీలించాలంటున్నారు.  

దవాఖానలోకి రాకుండా ఆర్డర్లు: మహానందకుమారి

మాగంటి గోపీనాథ్ మరణంపై ఆయన తల్లి మాగంటి మహానంద కుమారి సంచలన ఆరోపణలు చేశారు. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌‌లో మనుమడు తారక్‌‌ ప్రద్యుమ్న (మాగంటి గోపీనాథ్‌‌ మొదటి భార్య కొడుకు)తో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. గోపీనాథ్ మరణం మిస్టరీగా ఉందన్నారు. తన కొడుకు మరణంలో అనుమానాస్పద అంశాలు ఉన్నాయని, పూర్తి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.  గోపీనాథ్​ మృతి చెందిన టైం తనకు చెప్పలేదని, కేటీఆర్​ హాస్పిటల్‌‌కు వచ్చిన తర్వాతే గోపీనాథ్​చనిపోయినట్టు ప్రకటించారని తెలిపారు. ‘తల్లిగా నాకే చెప్పకపోవడం ఏంటి?’  అని ప్రశ్నించారు. గోపీనాథ్ డయాలసిస్ పేషెంట్‌‌గా ఉన్నప్పుడు ఒక్క అటెండర్‌‌ను కూడా పెట్టకుండా వెళ్లారని, చనిపోయిన రోజు సాయంత్రం  వెంటనే అంత్యక్రియలు చేయడానికి కారణాలు ఏమిటని అనుమానం వ్యక్తం చేశారు. గోపీనాథ్ మరణాన్ని జూన్ 8న ప్రకటించారని, జులై 4న సునీత లీగల్ సర్టిఫికెట్ తెచ్చుకున్నారని, అందులో తమ కుటుంబ వివరాలు లేవన్నారు. హాస్పిటల్‌‌లో తన కొడుకును చూడడానికి తనను, మరో కొడుకు వజ్రనాథ్‌‌ను అనుమతించలేదని తెలిపారు. ‘‘నా కొడుకును చూస్తా అని హాస్పిటల్‌‌కు వెళ్లి, కేటీఆర్​ కారు వెనకాల పడ్డాను. మా కుటుంబీకులను లోపలికి రావద్దని ఆర్డర్స్ ఇచ్చారు’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గోపీనాథ్‌‌కు, సునీతకు తాను పెళ్లి చేయలేదని, అప్పటికే సునీతతో కలిసి ఉండేవాడని, తల్లిగా తనకు పరిమితులు ఉన్నాయని చెప్పారు. తనకు 25 ఏండ్ల వయసున్న మనవడు ప్రద్యుమ్న ( గోపీనాథ్ కుమారుడు) ఉన్నాడని, తన  ఐడెంటిటీ ఇప్పుడు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. గోపీనాథ్‌‌కు, ​భార్య మాలినీకి ఇంకా విడాకులు కాలేదని తెలిపారు. గోపీనాథ్​ కుటుంబీకులకే టికెట్​ఇస్తామని కేటీఆర్​అన్నప్పుడు తల్లిగా తనను ఒక్క మాట కూడా అడగలేదని,  గోపీనాథ్ మీద అంత ప్రేమ ఉన్న కేటీఆర్..తల్లిగా తనను కనీసం ఫోన్​ ద్వారా అయినా  పరామర్శించలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ ఐడెంటిటీ విషయంలో, గోపీనాథ్​ మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్​ చేశారు. 

మాకు గుర్తింపు లేదు: తారక్ ప్రద్యుమ్న

తన పాస్‌‌పోర్ట్, ఇతర పత్రాల్లో తండ్రిగా గోపీనాథ్ పేరే ఉన్నదని తారక్‌‌ ప్రద్యుమ్న తెలిపారు. ‘‘చట్టపరంగా కూడా అన్నీ సక్రమంగా ఉన్నాయి. ఎమ్మార్వో ఆఫీస్‌‌లో కూడా సబ్మిట్ చేశా. మా అమ్మతో చట్టపరంగా విడాకులు కాలేదు. తారక్‌‌ అంటే ఎవరో తెలియదన్న మాగంటి సునీత.. జూన్‌‌ 6న నాకు మొదటి సారి ఫోన్‌‌ చేశారు. ఎవరో తెలియకపోతే.. ఎందుకు ఫోన్‌‌ చేసినట్లు? గ్రాడ్యుయేషన్‌‌ డేకి రావాలని మా నాన్న అనుకున్నారు. కానీ, హఠాత్తుగా చనిపోయారు. సునీత నాకు ఫోన్‌‌ చేసి.. నువ్వు ఇండియా రావాల్సిన అవసరం లేదు.. రెజ్యూమె పంపించు కేటీఆర్‌‌ అంకుల్‌‌ కంపెనీస్‌‌లో ఉద్యోగం ఇప్పిస్తామన్నారు. మా పెద్దనాన్న మీద అనవసర ఆరోపణలు చేస్తున్నారు. జూన్‌‌ 25న ఫ్యామిలీ మెంబర్‌‌ సర్టిఫికెట్‌‌ కోసం అప్లై చేశారు.  అప్పుడు అఫిడవిట్‌‌లో ఎవరి పేర్లు పెట్టారో నాకు తెలియదు. మా అమ్మ, నాన్నమ్మ, నా పేర్లను లీగల్‌‌ హెయిర్‌‌ సర్టిఫికెట్‌‌లో పెట్టాలి’’ అని కోరారు.