నేను... అమ్మను

నేను... అమ్మను

మనమందరం పుట్టినరోజును ఆనందంగా జరుపుకుంటాం. శక్తికొలదీ సంబురాలు చేసుకుంటాం. మన ఆనందాన్ని మన వారితో పంచుకుంటాం. అది అత్యంత సహజంగా జరిగే వేడుక. కాని మా తల్లుల విషయంలో మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. తల్లులందరికీ కలిపి ఒకేసారి జరిగే పుట్టినరోజు వేడుక మదర్స్‌‌ డే. భారతీయ సంస్కృతి మాతృదేవోభవ అని తల్లికి అత్యున్నత స్థానం ఇచ్చింది. ఏ ఇద్దరు మనుషులకు ఒకే పోలిక లేనట్లే... ఏ ఇద్దరు తల్లుల ఆలోచన ఒకేలా ఉండదు.

తల్లిగా మన పురాణాలలో ఎలా ఉన్నానో చూడండి...

రామాయణంలో నేను రాముడికి తల్లి కౌసల్యగా, నా రాముడు పట్టాభిషిక్తుడు కావాలని కోరుకున్నా. భరతుడి తల్లి కైకేయిగా నా భరతుడు పట్టాభిషిక్తుడు కావాలి. కాని నా సవతి కొడుకు అడవుల పాలవ్వాలని దురాలోచన చేశాను. లక్ష్మణుడి తల్లి సుమిత్రగా, నా కుమారుడు లక్ష్మణుడు అన్నగారితో పాటు అడవులకు వెళ్లి, అన్నగారికి సేవలు చేయాలని కోరుకున్నా. ఒక తల్లిగా మూడు స్వభావాలతో ఉన్నా. ఇక భారతంలో చూస్తే, వందమంది కౌరవుల తల్లి గాంధారిగా, నా బిడ్డలు చేసే తప్పులను పూర్తిగా సమర్థించకపోయినా, వ్యతిరేకించలేకపోయా. దుర్యోధనుడు పుట్టినప్పుడే వాడి కారణంగా వంశనాశనం జరుగుతుందని పండితులు చెప్పినప్పటికీ, నాలోని మాతృ ప్రేమ నన్ను గుడ్డిదాన్ని చేసింది. ఆ రోజే నేను దుర్యోధనుడిని ఒక్కడినీ విడిచిపెట్టి ఉంటే, మా వంశం నిర్వంశం అయ్యేది కాదు. మాకు తలకొరివి పెట్టడానికి ఒక్క కొడుకు కూడా మిగలకుండా ఉండేది కాదు. నేను చాలా చిత్రమైన దానిని. పంచపాండవుల తల్లిగా మాద్రి సంతానాన్ని కూడా కుంతి రూపంలో నా బిడ్డలుగానే చూసుకున్నా. బకాసురుడు ఇంటికొక మనిషిని ఆహారంగా భుజించేవాడు. ఆ రోజు వాడికి నా ఇంటి నుంచి ఒక మనిషిని పంపాలి. ఆ సమయంలో నేను అన్న మాటలు ఇంకా నాకు బాగా గుర్తు. నాకు ముగ్గురు కుమారులు. మాద్రికి ఇద్దరు కుమారులు, నా కుమారులలో ఒకరిని ఆహారంగా పంపుతా. అప్పుడు నాకు కూడా ఇద్దరు కుమారులు మిగిలినట్టు అని నా కుమారుడు భీముడిని ఆహారంగా పంపా. అక్కడ కూడా నేను ఒక తల్లినే. 

ఇన్ని భిన్న స్వభావాలతో నన్ను  మాత్రమే సృష్టించారేమో! ఏ తల్లిలోనైనా కన్నపేగు కారణంగా స్వార్థం ఉంటుందనుకుంటాం.

మరి అన్ని సందర్భాలలోనూ నేను స్వార్థంగా ఉండాలి కదా. కానీ అలా లేను. ఎందుకు లేనో నాకే అర్థం కాదు. నేను సత్యభామగా అవతరించినప్పుడు నా కుమారుడైన నరకాసురుడిని వధించా. అప్పుడు నా తల్లి మనసుకి తోచింది ఒకటే, దుష్టసంహారం. అక్కడ నేను బాధ్యతాయుతంగా ప్రవర్తించా. ఇలా ఎన్నని చెప్పగలను. యశోదగా, దేవకీదేవిగా, వకుళమాతగా, మండోదరిగా...లెక్కలేనంతమంది పురాణపురుషులను కన్నాను. 

త్రిమూర్తులకు జన్మనిచ్చా. 
ఆ విషయం విడిచిపెట్టేద్దాం.. జంతువుల విషయంలోకి వస్తే... ఒక ధేనువుగా బుల్లి తువ్వాయికి జన్మనిస్తా. అది పుట్టిన పది నిమిషాలకే నడవటం ప్రారంభించగానే నా వెంట తీసుకెళ్తా. నేను ముందు నడుస్తుంటే, అది నా వెనకాలే వస్తుంది. మధ్యమధ్యలో వెనక్కు తిరిగి వెంట వస్తోందో.. లేదో .. చూస్తా. నేను పిల్లి పిల్లల తల్లిగా, నా పిల్లలను చాలా జాగ్రత్తగా రక్షించుకుంటా. ఒక్కో పిల్లను నోటితో పట్టుకుని, ఎవరూ చూడని ప్రదేశంలో భద్రంగా ఉంచుతా. ఇలా ఏడు ఇండ్లు తిప్పుతా నా పిల్లల్ని. వాటి స్థావరం ఎవరికైనా తెలుస్తుందేమోనని, దగ్గరకు ఎవరైనా వస్తుంటే, మీద పడిపోయి, రక్కేస్తా. నా పిల్లల జోలికి ఎవ్వరు వచ్చినా సహించను. పిల్లి తల్లిగా అంత చిత్రంగా ప్రవర్తించే నేను, కోతిపిల్ల తల్లిగా చాలా విలక్షణంగా ఉంటా. నా పిల్లలను నేను ఎత్తుకోను. అవే నా పొట్టను గట్టిగా పట్టుకుంటాయి. అవి పడిపోతాయనే భయం నాకు ఉండదు. అవి నన్ను పొదివి పట్టుకున్నప్పుడు కూడా నేను చెట్ల కొమ్మల మీద గంతులు వేస్తుంటా. నా పిల్ల నన్ను మరింత గట్టిగా పట్టుకుంటుంది. నిజంగా నా ఈ ప్రవర్తన నాకే వింతగా తోస్తుంది. పసిపిల్లల్ని అంత నిర్లక్ష్యంగా ఎలా చూస్తానో అని ఆశ్చర్యం వేస్తుంది.

ఒక పాముగా నేను గుడ్లు పెట్టి, అంతలోనే విపరీతమైన ఆకలి వేయటంతో, కళ్లు సరిగా కనపడక, నా గుడ్లను నేను తినేస్తా. ఎంత చిత్రమైన దాన్నో నేను. నా పిల్లలను నేనే చంపుకోవటం నాకు అర్థం కాదు. ఒక పెద్దపులిగా కూడా నేను పిల్లలు పుట్టగానే కొన్ని పిల్లలను ఆకలితో తినేస్తా. ఆకలి తీరాక ఎన్ని పిల్లలు మిగిలితే అవే నా పిల్లలు. నా పాలు తాగి పెరుగుతాయి. ఒక తాబేలుగా నేను మరింత వింతగా ప్రవర్తిస్తా. సముద్రంలో స్వేచ్ఛగా తిరిగే నేను, గుడ్లను పెట్టే టైం వచ్చేసరికి, సముద్రపు ఒడ్డుకు చేరి, పెద్ద గొయ్యి తవ్వి, అందులో గుడ్లు పెట్టి, మట్టితో కప్పేస్తా. మళ్లీ నీళ్లలోకి వచ్చేస్తా. నా పిల్లలు చక్కగా పెరిగి నా దగ్గరకు వస్తాయని మనసులో స్మరిస్తుంటా. కొంత కాలానికి అవి గుడ్ల నుంచి బయటకొచ్చి, బుడి బుడి అడుగులతో సముద్రంలోకి వచ్చేస్తాయి. నాకంత ధైర్యం ఏమిటో మరి! 

ఒక కోడి పెట్టగా నేను గుడ్లు పెట్టి, అవి పిల్లలుగా ఎదిగేవరకు ఆ గుడ్లను నా రెక్కల కింద జాగ్రత్తగా పొదివి ఉంచుకుంటా. పిల్లల కోడి అని పేరు కూడా ఉంది నాకు. ఎక్కడ గద్ద వచ్చి నా పిల్లల్ని తన్నుకుపోతుందో అనే భయంతో, నా పిల్లల్ని నా రెక్కల కింద దాచి పెడతా. పక్షుల రూపంలో నేను నా పిల్లలను గుడ్లుగా పెట్టి, ఎంతో జాగ్రత్తగా పొదుగుతా. నన్ను చూసి నేనే ఆశ్చర్యపోతా. ఒక కంగారు తల్లిగా నా పిల్లను నా పొట్ట సంచిలోనే ఉంచుకుంటా. ఆ పిల్లతోనే గెంతులు వేస్తా. కానీ కడుపులో మోసి పిల్లకు జన్మనిచ్చాక కూడా నా కడుపులోనే దాచుకోవటం నాకే చిత్రంగా అనిపిస్తుంది.

ఎన్ని రకాలుగా ఉంటానో నేను. ముక్కోటి దేవతలు ఉంటారని తెలుసు. కానీ, లెక్కలేనన్ని స్వభావాల తల్లులు ఉంటారని నాకు మాత్రమే తెలుసు. దేవుడు మా తల్లులను ఇన్ని రకాలుగా ఎందుకు సృష్టించాడా? అని నన్ను నేను ప్రశ్నించుకున్నా. దేవుడి చిద్విలాసాలలో ఇది కూడా ఒకటేమో అనుకున్నా. తరచి చూడగా నాకు అర్థమైంది. అదే.. ఒక తల్లిగా ఎంత బాధ్యతగా ఉండాలో చెప్పటానికే ఇన్ని రకాలుగా తల్లులను సృష్టించి ఉంటాడని అర్థమైంది. దుష్టుడైన కుమారుడిని ఆదిలోనే తుంచివేయాలని, లేకపోతే గాంధారి పరిస్థితి తప్పదని చెప్పడానికి నన్ను ఆ తల్లి రూపంలో చూపాడు దేవుడు. 

కోతి, పిల్లి, పాము, తాబేలు, ఆవు... ఒకటేమిటి.. ప్రతి ప్రాణిలోని తల్లి నుంచి ఏమేమి తెలుసుకుని, నేను ఒక ఆదర్శమైన మాతృమూర్తిలా ఎలా ఉండాలో తెలియచెప్పడానికే ఆ విధాత మా తల్లులను ఇన్ని రకాలుగా సృష్టించి ఉంటాడని అనిపిస్తోంది. ఆ విధాతను కన్నది కూడా నేనే కదా. అందుకే ఆయన మనోగతం నాకు అర్థమైనట్టు ఇంకెవరికీ అర్థం కాదు. నేను మంచి తల్లిగా, అన్ని రకాల తల్లుల్లోని మంచిని హంసలా స్వీకరించి, దేశానికి మంచి పౌరులను అందించాలని మనఃస్ఫూర్తిగా నన్ను నేను కోరుకుంటున్నా. 

మా తల్లులను ఐదు రకాలుగా విభజించారు. గోమాత, నదీమాత, నిజమాత, భూమాత, వేదమాత. ఈ ఐదుగురు తల్లుల్ని భక్తిశ్రద్ధలతో అనునిత్యం పూజిస్తే, దేశం సుభిక్షంగా ఉంటుందని పెద్దలు చెప్పారు. నా బిడ్డలంతా ఈ సూత్రాలు పాటించాలి. నేను ఆనందంగా ఉంటే, యావత్​ప్రపంచం శాంతిసౌభాగ్యాలతో విలసిల్లుతుంది.

-డాక్టర్. వైజయంతి పురాణపండ