తల్లిపై హత్యాయత్నం.. కొడుకుకు రెండేళ్ల జైలుశిక్ష

తల్లిపై హత్యాయత్నం.. కొడుకుకు రెండేళ్ల  జైలుశిక్ష

సిద్దిపేట రూరల్, వెలుగు: మద్యానికి బానిసై కన్నతల్లిపై హత్యాయత్నం చేసిన కొడుకుకు సిద్దిపేట అసిస్టెంట్ సెషన్స్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. సిద్దిపేట రూరల్ సీఐ జానకిరామిరెడ్డి వివరాల ప్రకారం.. నంగునూరు మండలం గట్లమల్యాల గ్రామానికి చెందిన బండి తిరుపతి డ్రైవర్‌‌గా పనిచేస్తుండేవాడు.  అతని తీరుతో విసుగు చెందిన భార్య పుట్టింటికి వెళ్లిపోగా.. పనికూడా మానేసి తల్లి సారవ్వ దగ్గరే ఉండేవాడు. తల్లిని బెదిరించి డబ్బులు తీసుకునేవాడు.  2021 జులై 31న  తల్లిని డబ్బులు అడగగా లేవని చెప్పడంతో  కత్తితో మెడ, వీపు, ఛాతిపై పొడిచాడు. గమనించిన గ్రామస్తులు రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను  సర్పంచ్ తిప్పని రమేశ్ సహకారంతో  108లో హాస్పిటల్‌కు తరలించారు.

అనంతరం రాజగోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. ఎస్సై మైపాల్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని జ్యుడీషియల్ రిమాండ్​కు పంపించి  తగిన ఆధారాలతో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.  పరిశీలించిన సిద్దిపేట అసిస్టెంట్ సెషన్స్  కోర్టు జడ్జి స్వాతిరెడ్డి మంగళవారం నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు.  కేసు ఇన్వెస్టిగేషన్ చేసిన ఎస్సై, పబ్లిక్ ప్రాసిక్యూటర్, కోర్టు కానిస్టేబుల్, కోర్టులైజనింగ్ అధికారులను సీపీ ఎన్ శ్వేత అభినందించారు.