1861 మే 6న పుట్టిన మోతీలాల్ నెహ్రూ కశ్మీరీ బ్రాహ్మణుల తరగతికి చెందినవాడు. ఖద్దరు దుస్తులు, తెల్లని కాశ్మీరీ శాలువాతో హుందాగా కనిపించేవాడు. ఆయన పుట్టడానికి మూడునెలల ముందే తండ్రి చనిపోయాడు. అన్న నందలాల్ ఆయన బాగోగులు చూసుకునేవాడు. మోతీలాల్ న్యాయవిద్య చదివి హైకోర్టు వకీల్ పరీక్షలో గోల్డ్ మెడల్ సాధించాడు.
ఆ తర్వాత ఆయన బార్లో సొంత ప్రాక్టీస్ పెట్టుకునేలా నందలాల్ ఏర్పాట్లు చేశాడు. కానీ ఈయన ప్రాక్టీస్ మొదలుపెట్టిన కొన్నాళ్లకే నందలాల్ కన్నుమూశారు. దాంతో కుటుంబ బాధ్యత మోతీలాల్‌పై పడింది. పొద్దున్నుంచి రాత్రి వరకు ప్రాక్టీస్ చేసేవాడు. ఆ కష్టాన్ని ఇష్టంగా చేయడంతో విజయానికి ఎంతో సమయం పట్టలేదు. ఈ విషయాలన్నీ ఆయన కొడుకు జవహర్ లాల్ రాసిన జీవిత చరిత్రలో కనిపిస్తాయి.
జవహర్లాల్ పుట్టిన చాలాకాలం తర్వాత ఆయనకు ఇద్దరు కూతుళ్లు పుట్టారు. వాళ్ల కుటుంబానికి బంధువులు కూడా తోడవ్వడంతో అందరూ కలిసి ‘ఆనంద భవన్’ అనే విశాలమైన ఇంట్లో ఉండేవారు. ఢిల్లీ, అలహాబాద్లలో వాళ్ల జీవితం గడిచింది. మోతీలాల్ ఆతిథ్యం విషయంలో ఆడంబరంగా ఉండేవాడు.
యూరోప్ దేశాలకు వెళ్లి వచ్చినప్పుడల్లా అక్కడి కల్చర్, పద్ధతులు పాటించేవాడు. ఇంగ్లిష్ పబ్లిక్ స్కూల్స్లో ట్రైనింగ్ అయిన ఆంగ్లేయుల వ్యక్తిత్వం ఆయనకు నచ్చింది. దాంతో కొడుకును చదివించడానికి ‘హరో’కు పంపించాడు. అయినప్పటికీ మన దేశ సంస్కృతి, సంప్రదాయాలకు కట్టుబడి ఉండేవాడు. 1919 లో ఆయన కాంగ్రెస్కు అధ్యక్షత వహించాడు. గాంధీ చేస్తోన్న సహాయ నిరాకరణోద్యమానికి మద్దతు పలికాడు.
గాంధీకి బొంబాయి హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఆయనతోపాటు అక్కడే ఉన్నాడు. అయితే స్వాతంత్ర్య ఉద్యమం గురించి చిత్తరంజన్ దాస్, మోతీలాల్ గాంధీతో డిబేట్ చేశారు. అదే కౌన్సిల్ ఎంట్రీ. దాని తర్వాత గాంధీ తప్పుకోవడంతో స్వరాజ్యపార్టీ పూర్తిగా సిద్ధమైంది. అంతటా ఎన్నికలు జరిగాయి.
న్యూఢిల్లీలో సెంట్రల్ అసెంబ్లీలో మోతీలాల్ నెహ్రూను ప్రతిపక్షనాయకునిగా ఎన్నుకున్నారు. ప్రభుత్వం అపజయం పాలవుతూ ఉండగా అంతలో స్వరాజ్య పార్టీ సభ్యులందరినీ కమిటీలలో చేరుస్తూ, వాళ్లకు పారితోషికం ఇచ్చేది. దీంతో మొదట్లో ఉన్న తిరుగుబాటు ధోరణి చివరిదాకా కొనసాగలేదు. అలాంటి పరిస్థితుల్లో మోతీలాల్ దాదాపు ఒంటరిగానే రాజ్యాంగానికి ఒక రూపం తెచ్చాడు.
ఇండియాకు బ్రిటిష్ కామన్వెల్త్ లోపలే డొమీనియన్ స్టేట్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. కానీ, ఆ రాజ్యాంగాన్ని కొడుకు జవహర్ లాల్ ఆమోదించలేకపోయాడు. తండ్రీ కొడుకుల మధ్య ఘర్షణ మొదలైంది. ఆ తర్వాత 1929 కల్లా ఒప్పుకోవడం ముగిసిపోవాలని అంగీకారానికి వచ్చారు. తన కుటుంబ సభ్యులతోపాటు అనేకమందితో కలిసి ప్రజా వ్యతిరేక ఆందోళనలో పాల్గొని, దాదాపు 70 ఏండ్ల వయసులో జైలుకెళ్లాడు. ఆయనకు ఆస్తమా ఉంది. అది గుండె మీద తీవ్ర ఒత్తిడి కలిగించింది.
జైలులో ఆయనకు సరైన చికిత్స అందక ఆరోగ్యం క్షీణించసాగింది. ఆరోగ్యరీత్యా వదిలిపెట్టమని ఎవరైనా చెప్తే ఆయనకు నచ్చేదికాదు. డాక్టర్ల సలహా మేరకు10 వారాల జైలు శిక్ష తర్వాత విడుదలయ్యాడు. అప్పుడు ఆయన కొడుకు అయిదోసారి అరెస్ట్ అయ్యాడు. ముందస్తుగా విడుదలయ్యాడు. కొడుకుతోపాటు గాంధీ కూడా ఆయన్ను కలిశాడు. అప్పుడాయన గాంధీతో.. ‘‘నేను త్వరలోనే వెళ్లిపోతున్నా. స్వరాజ్యాన్ని చూడలేను. కానీ, మీరు దాన్ని సాధిస్తారని నాకు తెలుసు” అన్నాడు. ఫిబ్రవరి 6న ఆయన తుదిశ్వాస విడిచారు.
- మేకల మదన్మోహన్ రావు, కవి, రచయిత-
