
- పట్టించుకోని అధికార యంత్రాంగం
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో వాహనాల సంఖ్య పెరిగిపోతున్నా తగిన పార్కింగ్ స్థలాలు లేక వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ పడితే అక్కడే వాహనాలను పార్క్ చేస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు రాజీవ్ రహదారిని ఆనుకొని రంగంపల్లి నుంచి శాంతినగర్ వరకు దాదాపు రెండు కిలోమీటర్ల మేర వ్యాపార సముదాయాలు ఉన్నాయి. ఈ రహదారి ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సిటీ వాహనాలతో బిజీగా ఉంటుంది.
రాజీవ్‌రహదారి పక్కన ఉన్న వాహన సముదాయాల ముందు పార్కింగ్ స్థలం లేకపోవడంతో వాహనదారులు తమ వాహనాలను ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు పార్కింగ్ స్థలాలు చూపించడం లేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు. ఏవైనా ప్రమాదాలు జరిగినపుడు ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించి రాంగ్ పార్కింగ్‌లో ఉన్న వాహనాలను స్వాధీనం చేసుకుని, ఫైన్ లు వేస్తున్నారు. కానీ శాశ్వత పరిష్కారం మాత్రం చూపడం లేదు. పెయిడ్ పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.
హైవేను ఆనుకొని షాపింగ్స్
పట్టణంలో రాజీవ్ రహదారిని ఆనుకొని ఇరువైపులా షాపులు ఉన్నాయి. అక్కడక్కడా మద్యం షాపులు, బార్లు కూడా ఉన్నాయి. ప్రభుత్వం గతంలో హైవేలపై దాదాపు వంద మీటర్ల దూరంలోనే మద్యం షాపులు ఉండాలని నిబంధనలు విధించినప్పటికీ వాటిని తుంగలో తొక్కారు. రోడ్లను ఆనుకొనే మద్యం షాపులు నడుస్తున్నాయి.
అక్కడే ఆటో స్టాండ్ ఎప్పుడు చూసినా కాలు తీసి కాలు పెట్టే సందు ఉండదు. మరో వైపు హైవేకు సమీపంలోనే షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు ఉన్నాయి. దీంతో షాపింగ్ చేసేవారు, రెస్టారెంట్లలో తినేవారు రోడ్లను ఆనుకొని టూవీలర్స్, ఫోర్ వీలర్స్ పార్క్ చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్య తీవ్రమైంది. ఇప్పటికే ఎన్నోసార్లు ఇదే స్పాట్లలో రోడ్డు ప్రమాదాలు జరిగి చాలా మంది చనిపోయారు.
పెయిడ్ పార్కింగ్లు ఏర్పాటు చేయాలే...
పట్టణాల్లో పెరిగినపోయిన ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి మున్సిపాలిటీల ఆధ్వర్యంలో పెయిడ్ పార్కింగ్లు ఏర్పాటు చేయాలి. ఆటోల కోసం ప్రత్యేక పార్కింగ్ఏర్పాటుతో ట్రాపిక్ ను కంట్రోల్ చేయవచ్చు. కార్ల కోసం పెద్దపల్లిలోని జూనియర్ కాలేజీ ముందు పార్కింగ్ ఏర్పాటు చేసినట్లు ఆటోలకు కూడా పార్కింగ్ ఏర్పాటు చేయాలని ఆటోవాలాలు కోరుతున్నారు. ప్రధాన కూడళ్ల వద్ద పెయిడ్ పార్కింగ్లు ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ సమస్య తీరుతుంది. వ్యాపార, వాణిజ్య భవన సముదాయాల్లో వాహనాల పార్కింగ్ కోసం సెల్లార్లను నిర్మించేలా చూడాలని వాహనదారులు కోరుతున్నారు.
జిల్లా కేంద్రంలో రాజీవ్ రహాదారికి ఇరువైపులా ఏ భవనానికి సెల్లార్లు కనిపించవు. అక్కడక్కడా సెల్లార్ కన్పించినా దాంట్లో ఏదో షాపులు నడిపిస్తూనే ఉన్నారు. రోడ్డు పక్కన వాహనాలు కనిపిస్తే పాపం అన్నట్లుగా ట్రాఫిక్ పోలీసులు కెమెరాలో ఫోటోలు తీసి చలాన్లు వేస్తున్నారు. పుట్‌పాత్‌లను వ్యాపార వర్గాలు ఆక్రమించుకొని వారికి సంబంధించిన వస్తువులు, బోర్డులను పెట్టుకుంటున్నారు.