వెండితెరపై తన నటన, గ్లామర్ తో ప్రేక్షకులను మెప్పిస్తోంది బాలీవుడ్ నటి మౌనీ రాయ్. అయితే లేటెస్ట్ గా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుని అందరినీ షాక్ కు గురిచేశారు. హర్యానాలోని కర్నాల్‌లో జరిగిన ఒక వివాహ వేడుకలో ప్రదర్శన ఇవ్వడానికి వెళ్లిన ఆమె.. అక్కడ కొందరు పురుషుల ప్రవర్తన వల్ల తాను 'అవమానానికి, మానసిక క్షోభకు' గురయ్యానని సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నెట్టింట ఇది వైరల్ అవుతోంది.
తాతయ్య వయసున్న వారి అసభ్య ప్రవర్తన!
కర్నాల్‌లో జరిగిన ఈవెంట్‌లో అతిథుల ప్రవర్తన చూసి చాలా అసహ్యం వేసిందని మౌనీ రాయ్ చెప్పుకొచ్చింది. ముఖ్యంగా తాతయ్యల వయసున్న ఇద్దరు వ్యక్తులు ప్రవర్తించిన తీరు దారుణం. నేను స్టేజ్ వైపు వెళ్తున్నప్పుడు, ఫోటోలు దిగే నెపంతో కొందరు పురుషులు నా నడుముపై చేతులు వేశారు. 'సార్.. దయచేసి చేయి తీయండి' అని నేను వారించినా వారు పట్టించుకోలేదుంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ.. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక సుదీర్ఘమైన నోట్ రాశారు. అంతటితో ఆగకుండా, ఆమె స్టేజ్ పైకి వెళ్ళాక కూడా ఆ ఇద్దరు వ్యక్తులు స్టేజ్ ముందు నిలబడి అసభ్యకరమైన సైగలు చేయడం, అనుచిత వ్యాఖ్యలు చేశారట. వారిని సున్నితంగా హెచ్చరించినప్పటికీ.. రోజా పూలు విసిరి మరింత వికృతంగా ప్రవర్తించారని మౌనీ రాయ్ చెప్పింది.
లో-యాంగిల్ వీడియోలు..
కొందరు వ్యక్తులు స్టేజ్ కింద నుంచి ఆమెను లో-యాంగిల్ లో వీడియోలు తీస్తూ వెకిలి చేష్టలకు దిగారని మౌనీరాయ్ తెలిపింది.. ఈ క్రమంలో మౌనీ తీవ్ర అసహనానికి లోనై పర్ఫార్మెన్స్ మధ్యలోనే స్టేజ్ దిగి వెళ్లిపోవాలని అనుకున్నారు. కానీ ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్‌గా తన బాధ్యతను పూర్తి చేసేందుకు మళ్ళీ వెనక్కి వచ్చి ప్రదర్శన ముగించాను.నేను ఇబ్బంది పడుతున్నా అక్కడ ఉన్న కుటుంబ సభ్యులు కానీ, ఆర్గనైజర్లు కానీ ఆ వ్యక్తులను అడ్డుకోలేదు. మేం కళాకారులం.. గౌరవంగా బ్రతకడానికి కష్టపడతాం. మీ ఇంట్లో ఆడవాళ్లతో ఎవరైనా ఇలాగే ప్రవర్తిస్తే ఊరుకుంటారా? సిగ్గుపడండి అంటూ మౌనీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
బుల్లితెర నుంచి వెండితెర వరకు..
'క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ' సీరియల్‌తో కెరీర్ మొదలుపెట్టిన మౌనీ రాయ్, 'దేవోన్ కే దేవ్... మహాదేవ్' లో సతిగా, 'నాగిన్' లో శివన్యగా దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల ఆమె హారర్ కామెడీ 'ది భూత్నీ' లో నటించారు. ఎంతో అనుభవం ఉన్న తనలాంటి నటికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే, కొత్తగా వచ్చే అమ్మాయిల పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు. ఈ ఘటనపై నెటిజన్లు మౌనీకి మద్దతుగా నిలుస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు. పబ్లిక్ ఈవెంట్లలో సెలబ్రిటీల భద్రత గాలికి వదిలేస్తున్న ఆర్గనైజర్ల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
